270 తెలుగు భాషా చరిత్ర
9. 3. ఇక మాండలికపదాల సంగతి. కావ్యవ్యవహారంలో మాండలికపద రూపాలుండవని ఈనాటికీ కొందరు పండితులు విశ్వసిస్తున్నా, నన్నయనాటినుంచీ అవి కనిపిస్తూనే ఉన్నాయి. నన్నయభాషలో 'దారుణం', 'నీతదర్థం' లాంటి గోదావరిమాండలికాలు కనిపిస్తున్నాయి. 'చల్లా యంబలిఁద్రావితిన్...” అనే శ్రీనాథ చాటువులోని (వీధి: పీఠిక, వేటూరి, పుట 57) 'చల్ల' మాండలికం ; ఇతర ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మాట 'మజ్జిగ'. అలాగే ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని 'బిజమాడు దేవర నిజకృపామహిమఁ జెన్నారు నాయిల్లు బిడారు నీకు' (అప్ప. 1-70) మొ వీరశైవ గృహభాషాపదాలు, వీటిని వర్గమాండలికాలు (Class dialects) అనవచ్చు. ఇలాంటివి వేనవేలు.
9. 4. వ్యాకరణవిరుద్ధ్యప్రయోగా లన్నిటినీ మన లాక్షణికులూ సనాతన పండితులూ 'గ్రామ్య'మని కావ్యప్రయోగానికి అనర్హమని నిరాదరించినా, వాటికి ప్రాచీనకావ్యాలలో సైతం ప్రయోగాలు లభిస్తున్నాయి. 'వస్తూచూస్తిమి రోస్తిమిన్', చేస్తిమి లేస్తిమామె కుడిచేతికి దండము' లాంటి. వ్యావహారికరూపాలు శ్రీనాథుడి చాటువుల్లో ఉన్నాయి. 'ఇరవై' (కాశీ. 1-52), 'వినీవినని భంగి' (నైష.5-68), 'ముట్టడము' (కాశీ. 5-301), 'చీకిలించుక' (కాశీ. 3-195), 'చావడము' (భార. ఉద్యో. 8-61), 'అయినా' (ఉ. హరి. 5-198), 'ఏమీ' (ఉ. హరి. 5-195), 'ముళ్ళు' (భాగ. 6-81), 'నాటుక' (భాగ. 5-2, 145), 'చేతురు' (నైష. 5-68), 'ఎగాదిగ' (అము. 2-50), 'పట్టుక' (ఆము. 6-85), 'చూచినారు, డాసినారు' (మను. 1-68), 'చలపకారము' (మను. 5-58), 'వేఁటకరుల్' (మను. 4-50), 'అల్పదనము' (పాండు. 8-62), 'దాఁటేవానికిన్' (పాండు. 4. 275), 'రోసింది, పూసింది, మూసింది, చేసింది" (కాళ. 71), 'అంటే' (కాళ. 52), 'పోతే' (కాళ. 69) మొదలైన 'గ్రామ్య' శబ్దాలు ప్రామాణికగ్రంథాల్లోనే లభిస్తున్నాయి. సామాన్య రచనల సంగతి చెప్పనక్కరలేదు. గేయసాహిత్యం (పదకవిత) లో 'గ్రామ్య' పదాలు బాగా చోటుచేసుకొన్నాయి. తాళ్లపాక కృష్ణమాచార్యుల 'సంకీర్తన లక్షణం'లో నాటకాదుల్లో పదకవితలో 'గ్రామ్య'పదాలు పనికి వస్తాయన్నారు (ప్రభాకరశాస్త్రి, 1948, పే. 44).
9.5. క్రీ.శ. పదహారో శతాబ్ధంనుంచి కేవలం వచనరచనలు కొద్దికొద్దిగా బయలుదేరేయి. విశ్వనాథ సానాపతి 'రాయవాచకం' (1520 ప్రాంతం) ఆలాంటి