పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

260 తెలుగు భాషా చరిత్ర

మరచినకార్యమియ్యడను (ప. రం. ఉ. I 45), ఎక్కడబోయనో, ఎంతసేపాయ (కం. నా. వి. పుటలు 44,46). చాతకంబుల దయచాతఁగంబులొసంగి (చి. సిం.బి. III 67). దీనికి విపరీతంగా అకార విశిష్టంగా ఉండవలసిన మాటలు ఎకార విశిష్టంగా ఉండటం కూడ వ్యవహారభాషాలక్షణమే. ఇటువంటి మాటలు కూడ నాటీ కావ్యాలలో ఉన్నవి. ఉదా. చెరించేవిధము (ఆ.నా. హం V 195).

రెండుపదాలకు సంధి జరిగేటప్పుడు ఉత్తరపదం వకారాది ఐతే వ లోపించి సంధి జరుగటం కూడా వ్యవహార భాషాలక్షణమే. ఇటువంటి ప్రయోగాలు లక్షణ విరుద్ధమైనా నాటి కవులు వాడినారు. ఉదా. ముసుగు + వేసికొని = ముసుగేసుకొని (కం. పా ఉ. I 99), చేతి + వెంట = చేతెంట (బి. తి. అ. V 17).

8.30. లక్షణం అంగీకరించకపోయినా మహాకవులు ప్రాచీనకాలం నుండి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. వీటికి వ్యవహారబలమో లేక ఛందో నిర్భంధమో కారణం కావచ్చు. అటువంటి వాటిని సాహిత్యప్రియులు నిరంకుశ ప్రయోగాలంటారు. ఈయుగకవులు కూడ కొన్ని ప్రయోగాలు ఇటువంటివి చేసినారు. ఉదా. ఉశిరమ్ములు = ఉశీరమ్ములు (చిం. చా. రా. VI 80), ఉడింగి = ఉడిగి (చిం. చా. రా. VI 296), పూటమ్ము = పూవుటమ్ము (కూ. తి. ర. V 5), కడానీబెత్తెము = కడానిబెత్తము (ఋ. వేం. చం III 97), మొగఱాతళ్కు = మగఱాతళ్కు (ఋ. వేం. చం. III 71), మద్దెలవాచియు = మద్దెల వాయించియు (ఋ. వెం. చం. I 98), ఆకంటం జెందకయుండ = ఆకఁటం జెందక యుండ (చెం. కా. రా IV 77), తన పత్ని సావిత్రి తానంబుసేసి = స్నానంబుసేసి. (కం. నా. వి. III పుట. 61), యవ్వనాథ్య = యౌవనాఢ్య (అ. కా. II 115). తమ్మిచే = తమిచే (చిం. ఛా. రా. VI 330), మఱుసనాడు = మఱుసటినాడు (అ. నా. హం. V 202), ప్రాణనాయకి (లిం. శ్రీ. స. IV 152), వలిపెపు దుప్పటి చెఱగ (చె. కా. రా. III 4), దుప్పటిచెఱగున (లిం. శ్రీ. స III 35).

8.31. మాండలిక శబ్ద ప్రయోగాలు : ఆంధ్రదేశం సువిశాలమైనది. ఈనాడు తెలంగాణం, రాయలసీమ, చాళుక్యసీమ అనే మూడు ప్రధాన మండలాలున్నవి. ఈ ప్రధాన మండలాలను భాషాదృష్టిలో మరికొన్ని ఉపమండలాలుగా విభజించవచ్చును. ఇదిగాక ఆయా మండలాలు పరభాషామండలాలతో కలిసే పొలిమేరలలో పరభాషల యాసల ప్రభావంకూడ మన భాషపైన గోచరిస్తున్నది.