ప్రకరణం 8
కావ్యభాషాపరిణామం
(క్రీ. శ. 1600 - 1899)
-బి. రామరాజు
8.0. ఆంధ్రభాషా సాహిత్యాల చరిత్రలో క్రీ. శ. 1600-1800 సంవత్సరాల నడిమికాలం ఒక విధంగా పరిణామాత్మకమైనది. రాజకీయంగా ఒక మహా సామ్రాజ్యం అంతరించి చిన్నచిన్న రాజ్యాలు సంస్థానాలు స్వతంత్రించి తలయెత్తినట్లే సాహిత్యంలో అనుస్యూతంగా వస్తున్న మార్గాన్నివదలి ఈ కాలంలో నూతన ప్రక్రియలు వాటికి తగిన భాషకూడా తలయెత్తినవి. కొందరు సాహిత్య చరిత్రకారులు ఈ యుగాన్ని క్షీణయుగం అన్నారు. కాని ఈ యుగాన్ని ఇంత చిన్నచూపు చూడనవసరం లేదు. తెలుగువాడు తెలుగు పొలిమేరలు దాటి చాలా దూరంపోయి ప్రకియావైవిధ్యంతోను సరికొత్త నడతలతోను నుడులతోను సంగీతమూ నృత్యమూ తోడుగా వివిధ హావభావాలు ప్రదర్శించినది ఈ యుగంలోనే. ఇరుగుపొరుగు సాహిత్యాలను బాగా ఆకళించుకొన్నది ఈ కాలంలోనే. పూర్వం సాహిత్యవ్యాసంగం ఎక్కువగా ఏవో ఒక వర్గానికి పరిచితమై ఉండేది. కాని స్త్రీపుంస వివక్షలేకుండా కులమత వివక్షలే కుండా ప్రక్రియావైవిధ్యంతోపాటు భాషాచ్చందో వైవిధ్యమూ స్వాతంత్ర్యమూ ప్రకటించిన కవిపండితులు వర్థిల్లినకాలం ఇదే. ఈ కాలపు భాషా విశేషాలు పరిశీలించటానికి తెలుగుదేశంలోని కవుల రచనలేకాక మధుర, తంజావూరు మొదలైనచోట్ల, తెలుగుదేశం బయట వర్ధిల్లిన తెలుగుకవుల రచనలుకూడ గ్రహించటం జరిగింది. యక్షగానాలు, నాటకాలు, పదకవితలు, వచనకృతులు వేరొక ప్రకరణంగా విభజించటంవల్ల ఇందులో కేవలం పద్యకృతులను ద్విపదలను మాత్రమే పరిశీలించటం జరిగింది. ఈ ఇన్నూరేండ్లలో నూర్లకొలది కవులున్నూ ముఖ్యులైన కొందరిని మాత్రమే పరిశీలనకోసం ఎంపిక చేసుకొన్నాను. ఆంధ్ర దేశ౦లోని వివిధ ప్రాంతాలవారే కాక ఆంధ్రేతర ప్రాంతకవులు కూడ ఇందులో