8
తెలుగు భాషా చరిత్ర
'తెలుఁగు' త్రికళింగ శబ్దభవమనీ, ధ్వనిపరిణామం వల్ల అది త్రికళింగ> తి ఆలింగ> తెలింగ > తెలుంగుగా మారిందనీ కొందరి ఊహ. (గం. జో. సోమయాజి, ఆం. భా. వి., పు. 21-2). ఈ అభిప్రాయానికి సహేతుకమైన ఆధారాలు లేవు.
తెనుఁగు, తెలుఁగు రూపాంతరాలే కాని భిన్నధాతుజాలు కావు. ద్రావిడ భాషల్లో న/ల వినిమయం; -ణ--, --ళ~>--న-, -ల-- లు గానూ మారిన సందర్భాలున్నాయి (DED4524) . ఈ మార్పు మూల ద్రావిడంలోనే జరిగినట్టు భద్రిరాజు కృష్ణమూర్తి నిరూపించి ఉన్నారు.42 ఈనాడు కూడా కొన్ని ప్రాంతాల గ్రామీణుల వ్యవహారంలో తెలుగులో న, ల-ల వినిమయం కన్పిస్తుంది. మునగ- ములగ, చెనగు - చెలగు, మునుకోల - ములుకోల, జన్మం--జల్మం, లేద- నేదు, లాగు-నాగు మొదలైనవి. కాబట్టి తెలుఁగు త్రిలింగ శబ్దభవంకాదనీ, దేశ్యమైన తెనుఁగు యొక్క రూపాంతరమే తెలుఁగు అనీ, ఈ రెండు రూపాలూ ప్రాచీన కాలం నుండీ తెలుగు దేశంలో వ్యవహారంలో ఉన్నాయనీ నిర్ణయించవచ్చు.
1.10. దేశిపదాలను సంస్కృతీకరించడమో, లేదా వాటికి సంస్కృత సంబంధమైన కృతకవ్యుత్పత్తిని కల్పించడమో పండితుల సంప్రదాయం. ఇందుకు కారణం 'జనని సంస్కృతంబె సకలభాషలకును' అను నమ్మకమే, సంస్కృత భాషాభిమానం కొద్దీ ఓరుగల్లును ఏకశిలానగరమనీ, పెనుగొండను ఘనగిరి అనీ, కందుకూరును స్కంధపురి అనీ, చెయ్యేరును బాహుదా నది అనీ - ఈ విధంగా దేశి పదాలను పండితులు సంస్కృతీకరించి ప్రయోగించిన సందర్భాలు చాలాఉన్నాయి. తమిళ శబ్దాన్ని ద్రవిడ లేదా ద్రమిల అనీ, కరినాడు శబ్దాన్ని కర్ణాట అనీ (కర్ణయోః ఆటతీతి కర్ణాటకం), అత్తిరాల గ్రామాన్ని హత్యరాల అనీ, నార్త్ సింహాచలాన్ని నారదసింహాచలమనీ దేశ్యపదాలకు సంస్కృత భాషానురూపాలు సృష్టించబడి ఉన్నాయి. ఇటువంటిదే తెలుఁగు నుండి ఏర్పడిన త్రిలింగ శబ్దం. తెలుగు దేశంలో తెలగలు, తెలగాణ్యులు అనే తెగల వారిపేర్లను త్రిలింగ శబ్ద భవాలుగా నిరూపించలేము కదా ! అసలు తెలుగు దేశానికి త్రిలింగదేశమనే పేరు కొన్ని గ్రంథాల్లోనే కాని లోకంలో వ్యవహారంలో ఉన్నట్లు కన్పించదు. శైవమతం ప్రాబల్యం వహించిన కాలంలో పండితులు తెలుంగును త్రిలింగగ మార్చి ప్రయోగించి ఉండవచ్చు.