Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రం, తెనుగు, తెలుగు

7

భారతదేశమంతా వ్యాపించి ఉండినవారే. కాబట్టి ఆనాడు ఉత్తర ద్రావిడప్రజలు దక్షిణ దిక్కులోని వారిని 'తెన్' శబ్దంతో నిర్దేశించి ఉండవచ్చు. అనడం అసంగతం కాదు, తమిళదేశానికి ఉత్తరాన ఉన్న తెలుగువారిని 'వడుగర్' అని, తెలుగు భాషను 'వడుగ' అనీ తమిళులు ప్రాచీనకాలంనుండి వ్యవహరించి ఉండడం పై అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఇటువంటిదే 'కొడగు' పదం కూడా.

1.9. తెలుఁగు : తెలుఁగు అనేశబ్దం భాషాపరంగా సంస్కృత గ్రంథాల్లో కన్పించడం లేదు. వాయుపురాణంలో మాత్రం 'తిలింగా' అనే పదం ఒక జనపదానికి పేరుగా పేర్కొనబడినది.37 కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానంలోని విద్యానాథుడు (క్రీ. శ. 13 వ శతాబ్దం) శ్రీశైలదాక్షారామ కాళేశ్వరములలోని శివలింగముల వలన తెలుగు దేశానికి త్రిలింగమనే పేరు ఏర్పడిందని 'ప్రతాపరుద్రీయం'లో తెల్పి ఉన్నాడు.38 విన్నకోట పెద్దన (క్రీ.శ. 14వ శతాబ్దం) కూడా ఆంధ్ర దేశానికి త్రిలింగదేశమనే పేరు కావ్యాల్లో ప్రయుక్తమై ఉన్నట్లూ, తెలుఁగు త్రిలింగ శబ్దభవమైనట్లూ, కావ్యాలంకార చూడామణిలో తెల్పి ఉన్నాడు :

ధర శ్రీపర్వతకాళే
శ్వరదాక్షారామసంజ్ఞ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగ దేశమనఁ జనుఁ గృతులన్

తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ
దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె
వెనుఁకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద ఱ
బ్బాస పంచగతులఁ బరఁగుచుండు39

త్రిలింగపదం దేశవాచకంగా బ్రహ్మాండ పురాణంలోనూ, స్కాందపురాణంలోనూ, గ్రంథస్థమై ఉన్నట్లు చిలుకూరి వీరభద్రరావుగారు ఆంధ్రుల చరిత్ర ప్రథమభాగంలో తెల్పి ఉన్నారు.40 రాజశేఖరుని విద్ధసాలభంజికలో (క్రీ. శ. 10 వ శతా.) "జయతు జయతు త్రిలింగాధిపో దేవః"41 అని ఒక ప్రయోగం ఉంది. పురాణాల కాలాన్ని ఇదమిత్థంగా నిర్ణయించడం కష్టం. వాటిలో ఆర్వాచీనాలైన ప్రక్షిప్త భాగాలెక్కువ. 'తెలుగు' త్రిలింగ శబ్దభవం కాదనీ, తెలుగు యొక్క సంస్కృతీ కృతరూపమే త్రిలింగమనీ కొమర్రాజు లక్ష్మణరావుగారు నిరూపించి ఉన్నారు. (లక్ష్మణరాయ వ్యాసావళి, పు. 122 - 26).