Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

తెలుగు భాషా చరిత్ర


ఉరుతర గద్యపద్యోక్తుల కంటె-సరసమై పరగిన జానుఁ దెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ - గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱఁ
దెలుఁగు మాటలనఁగా వలదు. వేదముల. కొలఁదియ కాఁజూడుఁ డిలనెట్టులనిన32

తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో 'తెలుగు కవిత్వము,'33 'తెలుఁగుఁబడి'34 భారతావతారికలో 'తెనుంగుబాస',35 'తెనుఁగుబాస36 అని ప్రయోగించి ఉన్నాడు. తెలుంగు, తెలుఁగురూపాలు తెనుంగు, తెనుఁగులవలె రూపాంతరాలు. 13వ శతాబ్ధం, నుండి భాషాపరంగా వీని ప్రయోగం కావ్యాల్లో సర్వసాధారణంగా కన్పిస్తుంది.

1.8. భాషావాచియైన తెనుఁగు, తెలుఁగు - ఈ రెండురూపాలు భిన్న పదాలా లేక ధ్వనుల మార్పువల్ల ఏర్పడిన రూపాంతరాలా అని పరిశీలించవలసి ఉంది.

తెనుఁగు : తెనుఁగు తద్భవమనీ ఇది త్రినగశబ్ద భవమనీ కొందరు ఊహించినారు. ఇది ఊహయేకాని నిజముకాదు. (చూ. చిలుకూరి నారాయణరావు, ఆం. భా. చ. ప్రథమభాగం (1936), పు. 32) తెనుఁగు దేశ్యపదమనీ, దిగ్వాచి అనీ సోమయాజిగారి అభిప్రాయం (చూ. గంటిజోగి సోమయాజి, ఆం, భా. వి. (1947), పు. 29-32). తెనుంగు, తెనుఁగు శబ్దాలలోని -ంగు -ఁగు ప్రత్యయ భాగం (పోల్చిచూడు : వడగు, బడగు, DED4267 : కిలక్కు DED 1348; కుటకు, కొడగు DEP 1374), 'తెన్‌' శబ్దము దిగర్థమున్న ద్రావిడ పదాంశం (చూ. DED 2839). తెలుగుభాషలో తెన్ శబ్దం నేటి వ్యవహారం నుఁడి తొలగి పోయింది కాని, తెమ్మెర, తెన్నేరు, టెంకాయ, తీరు తెన్నూ, దిక్కూ. తెన్నూ ఇత్యాది సమాస రూపాల్లో మాత్రం నిలచి ఉంది. సాధారణంగా ఒక సమాజంలో ఒక భాష రూపొందే ప్రాథమిక దశలో ఆ భాషకు నామకరణం జరగదు. ఈనాడు కూడా కొన్ని అనాగరిక భాషలకు ఆ భాషా వ్యవహర్తలలో ప్రత్యేకమైన పేర్లు, లేని స్థితి కన్పిస్తుంది. ఒక భాషా సమాజంలోనే ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతం వారిని సూచించవలసి వచ్చినప్పుడు దిక్కులను బట్టి తూర్పువారనీ, పడమటివారనీ, ఉత్తరాదివారనీ వ్యవహరించడం సాధారణంగా కన్పిస్తుంది. ప్రాచీన ద్రావిడభాషా సమాజంలోని వారు దక్షిణప్రాంతపువారిని దక్షిణదిగ్వాచి యగు 'తెన్ " శబ్దముచే 'తెనుంగు' అని నిర్దేశించి ఉండవచ్చు. ఆ ప్రాంతపు మాండలికం ప్రత్యేక భాషగా పరిణమించినపుడు ఆ ప్రజలను నిర్దేశించిన తెనుఁగు వారి భాషకు పేరుగా కూడా ఏర్పడి ఉండవచ్చు. ద్రావిడ ప్రజలు ప్రాచీనకాలంలో