Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రం, తెనుగు, తెలుగు

5

కంగానూ, అటుపిమ్మట భాషావాచిగానూ వ్యాప్తిలోనికి వచ్చిందని నిర్ణయించ వచ్చు. ఈనాడు కూడా ఆంధ్రశబ్దం జాతి, దేశ, భాషలను సూచించడానికి వాడ బడుతూ ఉంది.

తెనుంగు, తెనుఁగు, తెనుగు; తెలుంగు, తెలుఁగు, తెలుగు ;

1.7. తెనుంగు, తెనుఁగు - ఈ రెండురూపాలు భాషాపరంగా నన్నయ భారతంలో మొట్టమొదటిసారిగా గ్రంథస్థమై ఉన్నాయి, తెలుగు ధ్వనిపరిణామంలో హ్రస్వం మీది పూర్ణబిందువుకు లోవం విభాషగా కావ్యభాషలో కన్పించడం వల్ల తెనుంగు, తెనుఁగు రూపాంతరాలే. నన్నయలో తెనుంగుకు ఒక ప్రయోగం, తెనుఁగుకు ఒక ప్రయోగం మాత్రమే ఉన్నాయి.

సారమతి, గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తిలో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె జగద్ధితంబుగాన్ . 28

జననుత కృష్ణద్వైపా
యనముని వృషభాభాహితమహాభారత బ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ
దెనుఁగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్.29

నన్నెచోడుని కుమారసంభవంలో తెనుంగు పదానికి రెండు ప్రయోగాలు కన్పిస్తాయి.

మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశి కవితఁ బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్.30

సరళముగాగ భావములు జానుఁ దెనుంగున నింపు పెంపుతోఁ
బిరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన నర్థము లొత్తగిల్ల బం
దురముగఁ బ్రాణముల్ మధు మృదుత్వ రసంబునఁ గందలళింప న
క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణంసాయన లీలఁ గ్రాలఁగాన్ .31

నన్నయ, నన్నెచోడులు తెలుంగు, తెలుఁగు రూపాలను ప్రయోగించలేదు. పాలకురికి సోమన తెనుంగు, తెలుఁగు పదాలను భాషాపరంగా ప్రయోగించి ఉన్నాడు.