4
తెలుగు భాషా చరిత్ర
బౌద్ధవాఙ్మయంలోని అంధరట్ట (< ఆంధ్రరాష్ట్ర) అనే పదం ఆంధ్రదేశ సూచకమే. శివస్కంధవర్మ మైదవోలు శాసనంలో (క్రీ. శ. 234) “అందా పథీయో గామో విరిపరమ్" అను వాక్య భాగాన్ని బట్టి ఆంధ్రపదం దేశవాచకమని తెలుస్తుంది.24 మల్లిదేవనందివర్మ దానశాసనంలో (క్రీ. శ. 340) "ఆంధ్రమండలే ద్వాదశ సహస్రగ్రామ సంపాదిత సప్తార్ధ లక్షవిషయాధిపతేః" అన్న వాక్యంలోని ఆంధ్ర శబ్దం కూడా దేశ వాచకమే.25 వరాహమిహిరుని బృహత్సంహితలోని (క్రీ.శ. 600) "కౌశిక విదర్భ వత్పాంధ్రచేదికాశ్చోర్వితండకాః" అనే వాక్యంలోకూడా ఆంధ్ర పదం దేశవాచిగా వాడబడింది. చారిత్రక యుగంలో ఆంధ్రపదం దేశపరంగా అనేక గ్రంథాల్లోనూ, శాసనాల్లోనూ కన్పిస్తుంది. కాబట్టి, మొదట జాతివాచక మైన ఆంధ్ర శబ్దం తర్వాత దేశవాచకంగా ప్రయుక్తమైందనీ, అది క్రీస్తు శకానికి పూర్వమే దేశవాచకంగా కూడా సంస్కృత గ్రంథాల్లోకి వ్యాప్తికి వచ్చిందనీ, నిస్సంశయంగా చెప్పవచ్చు.
1.6. మనకు తెలిసినంతవరకు సంస్కృత వాఙ్మయంలో 11వ శతాబ్దానికి పూర్వం ఆంధ్రపదానికి భాషావాచిగా ప్రత్యక్ష ప్రయోగంలేదు. కాని, భరతుని నాట్యశాస్త్రంలో నాటకంలో ఉపయోగించదగిన 'విభాషలు' ఏడు విధాలనీ, అవి శకార, అభీర, చండాల, శబర, ద్రమిల, ఆంధ్ర, వనచరుల వ్యవహారంలోనివనీ సూచించబడింది.26 నన్నయభట్టు రచించిన నందంపూడి శాసనంలో ఆంధ్రశబ్దం, భాషావాచిగ మొట్టమొదటి సారిగా ప్రత్యక్షమవుతుంది. ఈ శాసనంలో నారాయణ భట్టును “యస్సంస్కృత కర్ణాటప్రాకృత పైశాచికాంధ్రభాషాసు కవిరాజశేఖర ఇతి ప్రథితః సుకవిత్వ విభవేన" అని నన్నయ ప్రశంసించి ఉన్నాడు. ఈ ఆధారాన్ని బట్టి ఆంధ్రపదం 11వ శతాబ్దం నాటికి భాషాపరంగా రూఢి కెక్కిందని, ఖచ్చితంగా చెప్పవచ్చు.27 ఆంధ్రశబ్దచింతామణి కర్త నన్నయభట్టు అని అంగీకరిస్తే ఆంధ్ర శబ్దాన్ని బాషాపరంగా శాసనంలోనే కాక గ్రంథంలో కూడ నన్నయ. ప్రయోగించినట్లు చెప్పవచ్చు. ఆంధ్రభాషాభూషణకర్త అయిన కేతన తెనుఁగు, తెలుఁగు పదాలతో బాటు ఆంధ్రశబ్దాన్ని కూడా భాషాపరంగా ప్రయోగించి ఉన్నాడు. తన లక్షణ గ్రంథానికి పెట్టిన పేరులోనే కాకుండా గ్రంథంలో కూడా ఆంధ్ర శబ్దాన్ని వాడి ఉన్నాడు. తెలుగులో గ్రంథరచన ప్రారంభమైన కాలం నుండి ఆంధ్ర శబ్దాన్ని భాషాపరంగా కవులూ, పండితులూ వాడినారని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఈ విధంగా మొదట జాతివాచకమైన ఆంధ్రశబ్దం తర్వాత దేశబోధ