ఆంధ్రం, తెనుగు, తెలుగు
3
పాటు ఆంధ్రకులు కూడా ఉన్నట్లు స్మృతికి తెచ్చినాడు.16 కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రకులు; పులిందులు, కిరాతులు మొదలైన మ్లేచ్ఛజాతులవారు కౌరవపక్షంలో యుద్ధం చేసినట్లూ, వారు పరాక్రమవంతులై నట్లూ వర్ణించబడింది.17 శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు సర్వభూతోత్పత్తిని గురించి చెబుతూ దక్షిణాపథంలో జన్మించిన పుళింద శబరాది జాతులలో ఆంధ్రకులు ఒకరని పేర్కొన్నాడు.18
1. 3. సంస్కృత గ్రంథాల్లో జాతి వాచకంగా ప్రయోగించబడిన అంధ్ర, ఆంధ్ర, అంధక , ఆంధ్రక పదాలు ఏకజాతి వాచకాలే అని అభిప్రాయపడవచ్చు. ఈనాడుకూడా బీరారు ప్రాంతంలో 'అంధ' అనే ఒక అనార్యతెగవారున్నారు, అంధ యొక్క ప్రాకృత రూపాంతరమే అంధక ఆనీ, దాని సంస్కృ త రూపమే 'అంధ్ర' లేదా 'ఆంధ్ర' అనీ బరో (T. Burrow) అభిప్రాయం.19
1.4. ఇంతవరకు పేర్కొన్న గ్రంథస్థాధారాలను బట్టి ఆంధ్రజాతిని గురించి ఈ కింది అభిప్రాయాన్ని ప్రతిపాదించవచ్చు: ఆంధ్రులు ఆనార్యులు. ఆర్యుల్లో కొందరికి వీరితో సాంకర్యం ఏర్పడింది. ఆంధ్రులు సంకరజాతి వారని చెప్పడానికి మనుస్మృతి కూడా ఒక ఆధారం. శబర, పుండ్ర, పుళింద, కిరాతాది మ్లేచ్ఛజాతులలో ఆంధ్రులను కూడా జమకట్టి ఉండడం గమనించదగిన విషయం. ఆంధ్రశబ్దానికి సంస్కృతంలో వేటకాడు అనే ఒక అర్థం ఉంది.20 సంగం యుగానికి సంబంధించిన తమిళ గ్రంథాల్లో తెలుగువారిని 'వడుగర్' అని పేర్కొంటూ వారు వేటకుక్కలతో సంచరించేవారని వర్ణించబడింది, ఆర్యుల ప్రాబల్యాన్ని ఎదుర్కోలేని ఆంధ్రులు దక్షిణాపథానికి తరలివచ్చి రాజ్యాన్ని స్థాపించుకొని ఆ ప్రాంతంలోని ప్రజలతో కలసి ఉండవచ్చు. పాలకులైన వారిపేరే ఆ దేశానికి, ప్రజలకూ, భాషకూ కాలక్రమంలో సిద్ధించి ఉండవచ్చు.
1.5. ఆంధ్రశబ్దం జాతివాచకంగానే కాక దేశవాచకంగా కూడా ప్రాచీన సంస్కృత వాఙ్మయంలోనూ, శాసనాల్లోనూ కన్పిస్తుంది. వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను దక్షణ దిశకు పంపుతూ వారు వెదకవలసిన రాజ్యాలలో ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్యాది దేశాలను పేర్కొని ఉన్నాడు.21 దక్షిణదిగ్విజయయాత్రా సందర్భంలో సహదేవుడు జయించిన రాజ్యాల్లో ఆంధ్రదేశం కూడా ఉన్నట్లు వ్యాసభారతాన్నిబట్టి తెలుస్తుంది.22 భాగవతపురాణంలో బలికుమారులు ఆరుగురు తమ పేర్లతో ప్రత్యేక రాజ్యాలు స్థాపించుకొన్నారని, వారిలో ఆంధ్రుడనేవాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించినాడనీ ఒక ప్రశంస ఉంది.23