Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

తెలుగు భాషా చరిత్ర

మహాభారతంలో కూడా కన్పిస్తుంది. మయసభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓడ్ర, ఆంధ్రరాజులు ధర్మరాజును కొలిచినట్లు వర్ణింపబడింది.4 మనుస్మృతిలో కారావరవస్త్రీకి వైదేహునకు జన్మించిన నిషాదులు ఆంధ్రులని చెప్ప బడింది.5 నాట్యశాస్త్రంలో భరతుడు (క్రీ. శ. ప్రారంభకాలం) పాత్రోచిత భాషను గురించి చర్చిస్తూ బర్బర, కిరాత, ఆంధ్ర, ద్రమిల ప్రభృతి జాతులకు శౌరసేని మొదలైన ప్రాకృతాలను ఉపయోగించరాదని సూచించి ఉన్నాడు.6 వాయు పురాణంలో ఆంధ్రరాజులైన ఆంధ్రభృత్యుల పేర్లూ, వారి పరిపాలనా కాలం వివరించబడి ఉన్నాయి.7 ఆంధ్రభృత్యులే శాతవాహనరాజులు. వారి పరిపాలనా కాలం క్రీ. పూ. 230 క్రీ. శ. 225 అని చరిత్రకారుల నిర్ణయం. సంస్కృత భాగవతంలో శుకుడు హరిస్తుతి గావిస్తూ కిరాతహూణాంధ్ర పుళిందాది జాతులు తమతమ పాపాలనుండి విముక్తి పొందడానికి హరిని ఆశ్రయించినారని వర్ణించినాడు.8 చంద్రగుప్తమౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకురాయబారి మెగస్తనీను (క్రీ. పూ. 400) మౌర్యుల తర్వాత ఆంధ్రులు ఎన్నదగిన చతురంగబలం గల వారని ప్రశంసించి ఉన్నాడు.9 అశోకుడు వేయించిన కొన్ని శాసనాల్లోకూడా ఆంధ్ర ప్రజల ప్రసక్తి కన్పిస్తుంది. అశోకుని 13వ ధర్మలిపి శాసనంలో ఆంధ్రు లతని సామ్రాజ్యంలోని వారనీ, అతని ధర్మబోధలను అనుసరిస్తున్న వారనీ ప్రశంసించబడింది.10 కువలయమాల అనే ప్రాకృత గ్రంథంలో ఉద్యోతనుడు (కీ. శ. 9వ శతాబ్దం) ఆంధ్రులు ఆందమైనవారనీ, ఆహార విహార ప్రియులనీ అభివర్ణించి ఉన్నాడు.11 ఈ విధంగా ఆంధ్రశబ్దం ఐతరేయ బ్రాహ్మణకాలం నుండి జాతివాచకంగా గ్రంథస్థమై ఉంది.

1.2. సంస్కృత వాజ్మయంలో అంధక ఆంధ్రక జాతుల ప్రశంస కూడా కన్పిస్తుంది. వ్యాస మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరానికి విచ్చేసిన వారిలో అంధకులుకూడా ఉన్నట్లు వర్ణించబడింది.12 పాండవులు వనవాసానికి వెళ్ళిన వార్తవిని వారిని దర్శించడానికి భోజులు, వృష్ణులు, అంధకులు వెళ్ళినట్లు తెల్ప బడింది.13 భాగవతవురాణంలో అంధకులు యాదవజాతికి చెందిన ఒక తెగవారనీ, ద్వారకానగర సంరక్షకులనీ పేర్కొనబడి ఉన్నది.14 మత్స్యపురాణంలో అంధ కాసురుని సంతతి అంధకులని ఒక ఐతిహ్యం ఉంది.15 వ్యాసభారతంలో అరణ్యపర్వ కథాభాగంలో శ్రీకృష్ణుడు ధర్మజుని ఓదారుస్తూ, రాజసూయయాగ సమయంలో ధర్మజుని సేవించడానికి వచ్చిన రాజుల్లో పాండ్య, ఓడ్ర, చోళ , ద్రావిడులతో