తెలుగు భాషా చరిత్ర
బోండు అని శాసనప్రయోగాలు కనిపిస్తాయి . నాయుండు అనే శబ్దం ప్రాచీన శాసనభాషలో కనిపించకపోవడంచేత ప్రాచీనకాలంలో ఇందలి యకార లోప విషయం తెలియదు. కాని 12వ శతాబ్దిలోనే నాయుండు అనడానికి బదులు నేండు/ నీండు అనే రూపాలు కనిపిస్తాయి. కాపినేనికి (SII 10.207.4,1198), కొమ్మ నిండు (పై.6.1020 7,1184) మొ.వి. కాబట్టి 12వ శతాబ్దికి పూర్వమే ఇందులోనూ పదమధ్య యకారం లోపించిందని చెప్పవచ్చు. ఇందులో మరోవిశేషం ఏమంటే నాయుండు > నాండు కాక నాయుండు > నీండు/ నేండు అయింది. అనగా యకారంలోని తాలవ్య ప్రభావం వల్ల నా > నీ/నే అయిందని చెప్పాలి.
నాయుండు, బోయుండు శబ్దాల్లోని యకారలోపం 12వ శతాబ్దికి పూర్వమే జరిగినా యకారం తోడి రూపాలు కూడా 16వ శతాబ్దిదాకా విరివిగా కనిపిస్తాయి. యకారంపై ఉకారం ఇకారం కావడం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దిదాకా చాలా తరచుగా కనిపిస్తుంది. సింగనబోఇండు (SII 5.1165.18,1460), ఎలబోఇండు (పై. 6.748.5,1428), ఘుఘ్ఘలు నాఇండు (పై. 6. 1094.6,1415), మొ. వి. ఇలా పదమధ్యంలోని యు > ఇ కావడం ప్రస్తుతయుగం మరీ ప్రచురంగా ఉండిందనడానికి ఈ కింది ఉదహరణ ప్రబల తార్కాణ అవుతుంది. (మాముళు) సేఇ మని వారికి యిచ్చి (= చేయుమని) (పై. 4.711.16,1598).
5.16. యి>హి : పదమధ్యంలోని యి > హి కావడం పూర్వయుగంలోనే చూశాం. అలాంటివి ఈయుగంలో అంత తరచుగా కాకపోయినా క్వాచిత్కంగానైనా కనిపిస్తాయి. ఆచందార్క స్తాహిగా (SII 5.1194.14,1455) మొ. వి. పూర్వ యుగంలో (4.18) బంగారు, బంగారు నాణేలు అర్థంలో పహిండి, పైండి, పయిడిం అనే రూపాల్ని చూశాం గాని పసిండి అనే రూపం కనిపించలేదు. 11వ శతాబ్దికి తర్వాత శాసనాల్లో ఉన్న పసిండి అనే రూపం ఈ యుగంలోనే కనిపిస్తుంది. (పై.5.134.9,1415). ఈ యుగంలో కూడా పహిండి, పయిండి, అనే రూపాలే విరివిగా కనిపిస్తున్నాయి. పహిండి రసన (పై. 6.1187.7, 1414), పహిండి గుడి (పై. 10.577.47,1410), పహిడి ( పై. 6.1248.30,1471.), పైండి పటికము (పై. 6.886.10,1421), పైడి (పై. 6.696.6,1219), పఇండి (పై. 6.709.9,1416), పయిండి కుండలు (పై. 4.702.104,1518).