ప్రకరణం 1
ఆంధ్రం, తెనుగు, తెలుగు
- జి. ఎన్. రెడ్డి
1.0. మన భాషకు ఈనాడు ఆంధ్రం, తెనుగు, తెలుగు అని మూడు పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. సంస్కృత గ్రంథాల్లో ఆంధ్ర శబ్దం ఆంధ్రకు రూపాంతరంగా కన్పిస్తుంది. తెలుగు కావ్యాల్లో తెనుంగు, తెనుఁగు, తెలుంగు, తెలుఁగు, త్రిలింగ అనే పదాలు భాషాపరంగా ప్రయోగంలో ఉన్నాయి. తమిళంలో తెలుగు భాషకు పేర్లుగా వడగు, వడుగ పదాలు గ్రంథస్థమైనాయి.1 పోర్చుగీసు వారు తెలుగువారిని 'జెంతియె' (Gentio) అనీ, తెలుగు భాషను 'జెంతూ ' (Gentoo) అనీ, 16, 17 శతాబ్దాలలో వ్యవహరించినారు.2 మొత్తం మీద మన భాషను తెలిపే పదాలు: అంధ్ర, ఆంధ్ర, తెనుంగు, తెనుఁగు, తెలుంగు, తెలుఁగు త్రిలింగ, వడగు, వడుగ, జెంతూ. ఏకార్థబోధకాలైన ఈ పదాల చరిత్రనూ, రూపనిష్పత్తినీ, పరస్పర సంబంధాన్ని పరిశీలిద్దాం.
1.1. అంధ్ర, ఆంధ్ర : ఈ రెండు పదాలు రూపాంతరాలైన సంస్కృత పదాలు. ఇవి సంస్కృతంలో అతి ప్రాచీన కాలంలో జాతిపరంగా ప్రయోగింపబడి ఉన్నాయి. శునశ్శేపుని తమ జ్యేష్ఠభ్రాతగా అంగీకరించడానికి నిరాకరించిన మొదటి యాభైమంది పుత్రులనూ అనార్యజాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబాది దస్యులలో కలసి పొండని విశ్వామిత్రుడు శపించి బహిష్కరించినట్లు ఐతరేయబ్రాహ్మణంలో (క్రీ. పూ. 600) ఒక ఐతిహ్యం ఉంది.3 మనకు తెలిసినంతవరకు ఆంధ్ర శబ్దానికి సంస్కృతంలో మొట్టమొదటి ప్రయోగం ఇదే. మ్లేచ్ఛులైన ఈ అయిదుజాతుల వారూ ఆర్యావర్తానికి సరిహద్దు ప్రాంతాల్లో ఆనాడు నివసిస్తున్న ద్రావిడులో ముండా ప్రజలో అయిఉండవచ్చు. భాతరదేశానికి ఆర్యులు అగంతకులనీ, ముండా ప్రజలూ, ద్రావిడులూ వారికి పూర్వముండిన ఆదిమవాసులనీ చరిత్రకారుల నిర్ణయం. కాబట్టి ఆంధ్రులు ఆనార్యు లైన ద్రావిడులలో ఒక తెగవారని అభిప్రాయపడవచ్చు. ఆంధ్రుల ప్రశంస వ్యాస