పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషాపరిణామం

111

   4.17. ఱ : శకటరేఫ, సాధురేఫ కొన్నిసార్లు తారుమారవడం శాసనాల్లో కనిపించినా, శకటరేఫ రూపాలు చాలా వరకు ఈ యుగపుశాసనాల్లో సక్రమంగానే పాటింపబడి ఉన్నాయి. కూcతురు శబ్దంలోనూ, _రాలు ప్రత్యయంలోనూ సాధురేఫ ఉన్నట్లు బాలవ్యాకరణంలో చెప్పబడి ఉంది, కాని ఈరెండు రూపాలు ఈ యుగపు శాసనాల్లో చాలా తరచుగా శకటరేఫతోనే ఉన్నాయి. కూంతఱు (SII 5.1025.10,1111), నాయకఱాలు (పై. 5.1030.5, 1141) మొ వి. కాబట్టి నన్నె చోడుడు వీటిని శకటరేఫతో వ్రాసి ఉండాలి. బహుశా వ్రాతప్రతులలో వ్రాయసగాండ్రు వాటిని తమకాలంలోనే అలవాటు ప్రకారం సాధురేఫగా మార్చారు కాబోలు !
   4.18. స > ళ : తాలవ్యాచ్చు పరమౌతుండగా సకారం శవర్ణంగా మారడం ఈయుగంలోనే చాలా తరచుగా కనిపిస్తుంది. అందులోను పదమూడో శతాబ్దినుంచి ఇది బలీయంగా వ్యాపిస్తుంది. ఉదాః పడశిన (SII 6.845, 12,1273) చేశిన (పై. 10 465. 109,1290), శీతాదేవి (పై. 5.1225 5,1349) మొ వి. ఈ మార్పుకూడా ఈయగంలో తాలవ్యాచ్చు ముందు దంత్యం కాని దంతమూలీయంగాని నిలవవు అనే సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. అంటే తాలవ్యాచ్చు ముందు చవర్ణం తాలవ్యంగాను, తక్కిన పరిసరాల్లో దంత్యం లేక దంతమూలీయంగా పలికేవారనడానికి ఈ మార్పుకూడా ఒక తార్కాణంగా తీసుకోవచ్చు, (చూ. 4,5-6).
   4.19. వర్ణసమీకరణం : డ్ల > ళ్ళ : ఈ యుగంలో 12వ శతాబ్దిలో డ్ల రూపాలే. చాలా తరచుగా ఉన్నాయి. ళ్ళ రూపాలు చాలా క్వాచిత్కంగా కనిపిస్తాయి. ళ్ళ రూపాలు రానురాను ఎక్కువౌతూ 14వ శతాబ్టిలో దాదాపు డ్ల రూపాల స్థానాన్ని ఆక్రమించిందనవచ్చు. డ్ల - రూపాలు: మాడ్లు (SII 10.476.6, 1293),(మాడలు); మూడ్లు(పై 5.70,12, 1117) (మూరలు); ళ్ల రూపాలు; మూళ్లు(పై. 10.84.17,1122), గుళ్ళు(పై.4.1379.9, 1381) మొ.వి.

వర్ణాల స్థాన నియమాలు :

   4.20. పదాదిలోను, అజ్మధ్యంగానూ, హల్లులు సాధారణంగా ఏ నియమం లేకుండా వస్తాయి. కాని ఒక డకారం తప్ప తక్కిన మూర్దన్య హల్లులు సాధారణంగా ఆఆల ముందే కనిపిస్తాయి. తక్కిన అచ్చులముందు ఈయుగపు శాసనాల్లో అట్టే కనిపించడంలేదు. టంకమాడలు (SII 6.1183.9, 1221).