102
తెలుగు భాషా చరిత్ర
ఏర్పడటం, పద్యశాసనాలు తలచూపటం, లేఖనం నుంచి నిర్మాణ్మక్రమం వరకూ అన్నిటిలోనూ కొత్త పరిణామాలు వచ్చి స్థిరపడటం ఈ ద్వితీయదశలోని ప్రధాన లక్షణాలు. సంస్కృత ప్రభావంవల్ల రేఫమీది హల్లుల్ని ద్విరుక్తంచేసి రాయటమనే సంప్రదాయం వచ్చింది. అరసున్న కొత్త ధ్వనిగా స్వతంత్రంగా మొలకెత్తింది. పద్య శాసనాలవల్లనే దాన్ని పునర్నిర్మించటం సాధ్యమయ్యేది. ద్విరుక్తాద్విరుక్తహల్లులున్న జంటమాటలు పుట్టుకొచ్చాయి. పదాదిన యవకారాలను వాడటం మొదలైంది. ఱకారం వర్ణత్వం కోల్పోయి అచ్చులమధ్య డకారంగానూ, సంయుంక్తాక్షరాల్లో రేఫగానూ పరిణమించింది. అజ్మధ్య డకారం ణకారంగా మారటం ఆరంభమయింది. సంయక్తాక్షరాల్లో రేఫ వకారపరంగా ఉంటే వకారం లోపించటం, ఇతర హల్లులతో ఉంటే తానే జారిపోవటం మొదలయింది. 'న్ఱ’ అనే సంయుక్తధ్వని 'ణ్ణ'గా మారింది. వ్యుత్పత్తులు స్పష్టంగా తెలిసిన దేశ్యపదాల్లో పదాదిసరళాలు కనిపించటం ప్రారంభమయింది. శకటరేఫ ప్రత్యేకవర్ణత్వం పోగొట్టుకుని రేఫతో మేళనం పొందింది. అత్సంధి వైకల్పికంగా ఉండేది. గసడదవాదేశం బహుళంగా మారింది. దృతసంధి పద్యరచనల్లో నిత్యంగాను, గద్యంలో వైకల్పికంగాను ఉండేది. అమహదేకవచన ప్రత్యయం 'బు' అనేది 'ము, వు, మ్ము'లుగా పరిణమించింది. మిశ్రసమాస కల్పనం జోరుగా సాగింది. కర్మణి ప్రయోగమూ, యత్తదర్ధక ప్రయోగమూ సంస్కృతంనుంచి ఎరువుగా వచ్చిపడ్డాయి. 'మణిప్రవాళశైలి' ఆచారంలోకి వచ్చింది. నాలుగోవంతు మాటలు ఎరువుగా వచ్చాయి.
3.84. కావ్యభాషాదశ : క్రీ. శ. 10, 11 శతాబ్దుల్లో కావ్యభాషా ప్రభావంవల్ల వాడుకభాషలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఇది భాషాచరిత్రలో కావ్యభాషాదశ. ఈ కాలంలో బయలుదేరిన మార్పులు క్రీ.శ. 1100 నాటికి భాషలో స్థిరపడలేదు. ఈ దశలో వచ్చిన పెద్దమార్పు పదజాలానికి సంబంధించింది. ఎరువుమాటల సంఖ్య మొత్తంలో సగానికి సగంగా ఉంది. తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయం 'ఎడి/-ఎడు' అనేది 'ఏ/-ఏటి'గా మారటం మొదలయింది. మహద్వాచకాల ప్రథమపురుషైకవచనంలోని తచ్చబ్ధవకారం లోపించటం ఆరంభమయింది. అమహత్ప్రత్యయం 'ము' లోపించటం, దానికి ముందున్న స్వరం దీర్ఘం కావటం మొదలయింది. నామాంతంలోని '-ఇయ'లో ఆద్యచ్చు లోపించటం మొదలయింది. వర్ణవ్యత్యయంవల్ల రెండు హ్రస్వాచ్చులు పక్కపక్కల చేరినప్పుడు అవి దీర్ఘాచ్చుగా మారటం ఆరంభమయింది.