పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

(రెండవ ముద్రణ)

అచ్చువేసిన రెండేళ్ళలోపలే తెలుగు భాషా చరిత్ర కాపీలన్నీ అమ్ముడు పోయాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు ఎమ్. ఏ. పరీక్షకు, ఓరియంటల్ పరీక్షలకు, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకుకూడా దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించటం ఈ గ్రంథం ఆవసరాన్ని, ప్రాముఖ్యాన్ని తెలుపుతున్నది. ద్వితీయముద్రణలో మొదటి ప్రతిలో వచ్చిన అచ్చుతప్పులను చాలావరకు సరిదిద్దే ప్రయత్నం జరిగింది. 2, 9, 13 ప్రకరణాల రచయితలు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. 6 వ ప్రకరణం పూర్తిగా తిరిగి రాయడం జరిగింది.

ఈ గ్రంథం ప్రధానంగా పరిశోధకవ్యాస సంకలనం. సామాన్య పాఠ్యగ్రంథాలకంటే ఎక్కువ వివరాలు, పరిశోధనగురుత్వం ప్రతి వ్యాసంలోను కనిపిస్తాయి. అందువల్ల ప్రధానంగా ఇది ఆధ్యాపకులకు సహాయగ్రంథంగా ఉపయోగిస్తుంది. ఈ వివరాలన్నీ సాధారణ విద్యార్థులు గుర్తు పెట్టుకోవటానికి ప్రయత్నించటం అనవసరం. నామ విభక్తులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైనవి రెండువేల యేండ్ల చరిత్రలో ఏయే మార్పులు పొందినదీ భిన్న ప్రకరణాలనుంచి సేకరించి సమన్వయించుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ మౌలిక గ్రంథం ఆధారంగా ఇలాంటి సమన్వయంతో మరోక పుస్తకం రావలసిన అవసరం ఉన్నది.

ఈ పుస్తకం కాపీలు అయిపోయి రెండేళ్ళకు పైచిలుకు అయింది. ఇది ఆంగ్లంలోకూడా రావలసి ఉన్నది. పునర్ముద్రణలో అయిన జాప్యాన్ని మన్నిస్తూ దీన్ని ఇతోధికంగా ఉపకరించటానికి సూచనలు చేస్తే సంతోషిస్తాను.


హైదరాబాదు

28 - 1 - 1979

భద్రిరాజు కృష్ణమూర్తి

సంపాదకుడు