Jump to content

పుట:తెలుగు కార్టున్.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యంగ్య చిత్రానికి వందనం!

కార్టూన్!

రాత - గీతల దృశ్య చిత్రం!

అన్ని చిత్రాలలాంటి ఒకానొక చిత్రమే. కానీ మిగతా సీరియస్ చిత్రాలకు లేని గొప్ప లక్షణం ఉన్న చిత్రం - కార్టూన్! ఆ గొప్ప లక్షణం - హాస్యం! వ్యంగ్యం!!

మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపచేస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. ఆవేదన చెందేలా చేస్తుంది. కానీ ఎక్కువసార్లు ఆహ్లాద పరుస్తుంది... తీవ్ర ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది... "జీవితం - లాంగ్ షాట్లో కామెడీ, క్లోజ్ షాట్లో ట్రాజెడీ" అని ఛార్లీ చాప్లిన్ చెప్పినట్లు “కార్టూన్ - రాతగీతల్లో కామెడీ, విషయ వస్తువులో ట్రాజెడీ" అని భావించేలా ఉంటుంది.

మనిషి మాత్రమే అనుభూతించగలిగిన హాస్య భావనని ఉద్దీపింప చేయగలిగే ఒకానొక సృజన రూపం - కార్టూన్!

గీతలతోనే చక్కిలిగిలి పెట్టగలిగిన హాస్య మంత్రం - కార్టూన్!

ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మన పంచేంద్రియాల సమన్వయ జ్ఞానంతోపాటు, మనకు ఇదివరలో లభించిన పూర్వజ్ఞానం, అనుభవం అవసరం. ఇంత మానసిక ప్రక్రియ మనకు, మన చుట్టూ ఉన్న భౌతిక, రాజకీయ, సాంఘిక పరిసరాలకు మధ్య సమన్వయానికి అవసరం అవుతుందని మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెపుతారు. అయితే కంటితో చూసిందే తడవుగా పాఠకుడిలో / వీక్షకుడిలో ఆనంద భావనని, ఆహ్లాద అనుభూతిని, హాస్య రసాన్ని అందించగలిగేది మాత్రం 'కార్టూన్' అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అధునిక కాలంలో హాస్యానికి టానిక్గా 'కార్టూన్' మారిందన్నా ఆశ్చర్యం లేదు.

నవరసాలలో 'నవ్వే రసానికి' ఇగ్నిషన్ - కార్టూన్!

తీవ్రమైన మానసిక, ఆర్థిక సంక్షోభంలో సైతం హృదయాన్ని తేలిక పర్చగలిగిన సృజన - కార్టూన్ ప్రత్యేకత!

ఇలాంటి 'కార్టూన్' ఇపుడు సర్వాంతర్యామి. ఏ పత్రిక చూసినా, ఆఖరికి విద్యాసంస్థలలోని గోడపత్రికలలో సైతం కనిపించే అద్భుత విశేషం - కార్టూన్! వ్యంగ్యం, హాస్యం, సునిశిత ధిక్కారం, తార్కిక నిరసన, విషాద సందర్భానికి సంఘీభావం అనే ఐదు లక్ష్యాల సాధనే కార్టూన్ల అంతిమ లక్ష్యం అని వందలాది ఏళ్ళనుంచి వస్తున్న కార్టూన్ల ప్రస్థానాన్ని గమనిస్తే అర్థమవుతుంది.

అయితే కాలక్రమంలో కార్టూన్లు పత్రికలలోనూ, మన నిత్య జీవితంలోనూ అంతర్భాగం అయిపోయాయి. పత్రిక తెరవగానే కార్టూన్లని వెతకడం సహజచర్యగా మారింది. ఇంతగా మన జీవితంతో ముడివేసుకున్న 'సృజనాత్మక వ్యాసంగం' మరేదీ లేదని చెప్పవచ్చు.

'కార్టూన్' వేయి విధాలు :-

ప్రపంచవ్యాప్తంగా కార్టూన్కు ఉండే ప్రాధాన్యత గుర్తింపులోకి వచ్చిన కాలం నుండి, అది రకరకాల రూపాలను సంతరించుకుంటూ ప్రయాణం సాగిస్తుంది. నిజానికి ఆదిమకాలంలో, మనిషి గుహలలో జంతు జీవనం సాగిస్తున్న కాలంలో తను చూసిన జంతువులను సంకేతాత్మకంగా చూపిస్తూ నాలుగు గీతలతో జంతువు రూపు రేఖలను వ్యక్తీకరించడం 'కార్టూన్'కు ప్రాథమిక రూపంగా భావించవచ్చు. అయితే ఆనాటి మానవుని సృజన వెనుక ఆహ్లాదం, వినోదం కన్నా భయమే ప్రధాన చోదకశక్తిగా ఉండేది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి.

అలా మొదలైన కార్టూన్ ఇపుడు ఎన్నెన్నో దశలను దాటి బహుముఖీనతని సాధించి జీవితంలోని అన్ని పార్శ్వాలను సమర్దవంతంగా ప్రతిబింబించగలుగుతోంది. ఈ ప్రస్థానాన్ని బట్టి కార్టూన్లలోని రకాలను స్థూలంగా ఈ విధంగా వర్గీకరించవచ్చు.