Jump to content

పుట:తెలుగు కార్టున్.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్టూన్ ఇష్టులకి అభినందన

ఒక పద్యం చేయాల్సిన పనిని, ఒక గీతం అందించాల్సిన భావాన్ని, ఒక వ్యాసం మనకిచ్చే ప్రయోజనాన్ని, ఒక ఉపన్యాసం సమాజానికి అందించే స్ఫూర్తిని ఒక కార్టూన్ ద్వారా మనకందిస్తున్నాడు చిరంజీవి మృత్యుంజయ. పదివేల మాటలకన్నా ఒక కార్టూన్ మిన్న. అందులో పొలిటికల్ కార్టూనైతే మరీనూ, స్తబ్ధంగా వున్న రాజకీయ వ్యవస్థకు, నిశ్శబ్దంగా వున్న మేధావుల మానసిక ప్రవృత్తికీ చైతన్యం అందించడమే మృత్యుంజయ కార్టూన్ల లక్ష్యం. అలాంటి మృత్యుంజయ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా దాదాపు 150 మంది కార్టూనిస్టులను కలుపుకొని కార్టూన్ ప్రదర్శనను ఏర్పాటు చేసి కార్టూనిస్టు లందరికీ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన సందర్భమిది.

ఒక జయదేవ్ గారు అయితేనేమి, ఒక చంద్ర అయితేనేమి, ఒక సరసి, ఒక సునీల, ఒక బాలీ అయితేనేమి ఇలా ఎంద రెందరో సుప్రసిద్దులైన కార్టూనిస్టులందరికీ ఈ మహాసభల సందర్భంగా సంతోషంతో స్నానం చేసినట్టుగా వుంది. సంతృప్తిగా భోజనం చేసినట్లుంది. నాలాంటి కార్టూనిస్టులకు (కార్టూన్ ఇష్టులు) ఎంతో కన్నుల పండువగా వుంది.

మృత్యుంజయకి శుభాకాంక్షలు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ ప్రదర్శన ద్వారా కలుసుకుంటున్న కార్టూనిస్టు లందరికీ శుభాభినందనలు.

మనమెప్పుడూ ఇలాగే కలుసుకుంటూ వుండాలని ఆకాంక్షిస్తూ మీ కార్టూనిస్టు...

- కె.వి. రమణాచారి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

(సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ, ధర్మాదాయ శాఖలు)