Jump to content

పుట:తెలుగు కార్టున్.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిరక్షరాస్యులైన శ్రామికుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటుపాటలు, రాటుపాటలు, మోటపాటలు, కల్లాలదగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయి ధూల అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి.

ఒకతరం నుంచి మరోతరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గు కథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట, విలక్షణ కళారూపాల్లో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది

పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒకదశలో 'తెలంగాణలో కవులే లేరు' అనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటుచేసుకున్నాయి.

ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి, పండితుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకోర్చి, తెలంగాణ నాలుగు చెరుగులా తిరిగి, 354 మంది కవుల రచనలతో 'గోలకొండ కవుల సంచిక'ను వెలువరించారు. అది మన స్వాభిమాన ప్రతీక. సాహిత్య జయపతాక, జలపాత సదృశమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢిమతో 'అగ్నిధార', 'రుద్రవీణ' వంటి పద్య కావ్యాలను సృజించిన మహాకవి దాశరథి 'నా తెలంగాణ తల్లి కంజాత వల్లి' అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. 'భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా! వెలలేని నందనోద్యానమ్మురా!' అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకట రామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు.

వెక్కిరించిన వారికి కాళోజీ కవితలు దీటైన సమాధానం

ప్రజాకవి కాళోజీ తన కవితలతో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించినవారికి దీటైన సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నది.

నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలిజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తున్నది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షుడిగా ప్రసిద్ధ కవి నందిని సిధారెడ్డిని నియమించి, సారథ్య బాధ్యతలు అప్పగించింది.

అలాగే, డిసెంబర్ 15 నుంచి 19 వరకు (ఐదు రోజులపాటు) తెలంగాణలో మహోత్సవంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని భావించింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వివిధ అంశాలపై పుస్తకాల్ని ప్రచురించడం అత్యావశ్యకం. ఈ పుస్తకాలు వివిధ రంగాలలో తెలంగాణ జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిక్సూచిగా ఉంటాయి. ఈ దిశగా చొరవ చూపి అందంగా, హృద్యంగా ప్రచురించిన భాషా సాంస్కృతిక శాఖను అభినందిస్తున్నాను.

గౌ॥ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖరరావు

ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం