వల్ల వ్యక్తులలో ఆక్సిటోసిన్ ఇతర రసాయనాల ఉత్పత్తి అధికమై వారిలో మానసిక సంతులనం ఏర్పడుతుందని, ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగే అవకాశం ఉందని రుజువయింది.
అలా ప్రస్తుతం ఆధునిక వైద్యశాస్త్రంలో 'కార్టూన్ థెరపీ' దిశగా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. కార్టూన్లు కేవలం వినోదం కోసమే కాదు. చికిత్సకోసం, మానవ వికాసం కోసం కూడా అనే నూతన కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఆ లెక్కన కార్టూన్లు ‘టైప్పాస్'కు మాత్రమే కాక, సామాజిక ప్రయోజనానికి కూడా అనే విషయం అర్థమవుతూ "కళ కళ కోసం కాదు సమాజం కోసం" అనేమాట కార్టూన్ సాక్షిగా మరోసారి నిరూపణ అవుతోంది.
మనదేశం సంగతి?
మనదేశంలో తొలి వార్తా పత్రిక 'బెంగాల్ గెజిట్. జేమ్స్ ఆగస్టస్ హిక్కీ కోల్‌కత్తాలో ఈ పత్రికను 1780లో ప్రారంభించి నప్పటి నుండీ మనదేశంలో వార్తాపత్రికల ప్రభంజనం మొదలైంది. అందులో కూడా కార్టూన్లు ప్రచురితం అయ్యాయి. ఆ తర్వాత 19వ శతాబ్దంలో స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చిన పత్రికలలోని కార్టూన్లు రాజకీయ అంశాల ప్రాతిపదికగా ప్రజాదరణ పొందాయి. ఆనాటి బ్రిటీష్ పాలకుల విధానాలు, దానికి నిరసనగా వ్యాసాలు, విశ్లేషణలు ఎంత ప్రభావం చూపాయో, అంతే సున్నిత విమర్శలను కార్టూన్లు చేసాయి. కొన్ని నిషేదానికి కూడా గురవడం గమనార్హం.
స్వాతంత్య్రానంతరం, నెహ్రూకాలంలో ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్ళైతో, కార్టూన్లకు ముఖ్యంగా పొలిటికల్ కార్టూన్లకు విశేష ప్రజాదరణ ఏర్పడింది. ప్రత్యేకంగా కార్టూన్ల కోసమే ఓ పత్రిక 'శంకర్స్ వీక్లీ' ప్రచురితమైంది.
ఆ తర్వాతి కాలంలో ఆర్.కె. లక్ష్మణ్, సుధీర్ తెలంగ్, అజిత్ నైనాన్, మారియో మిరాండా వంటి ఎందరో కార్టూనిస్ట్‌లు దేశవ్యాప్త కీర్తిని సంపాదించారు.
తెలుగు పరిస్థితి?
తెలుగు వారి జీవనంలో హాస్యం, వ్యంగ్యం కూడా ఎంతో ముఖ్యమైన భావోద్వేగాలు! అదే జీవన విధానం కార్టూన్లలో కూడా ప్రతిబింబించింది. ప్రబంధాలలో వర్ణించిన స్త్రీల సౌందర్యాన్ని వ్యంగ్యంగా చిత్రించడంలో తెలుగులో తొలి కార్టూన్ ప్రారంభమైందని తెలుస్తోంది. 'తలిశెట్టి రామారావు' గారు వేసిన ఈ చిత్రం 'ఆల్‌టైమ్ ఫేవరేట్' స్థాయిని సాధించింది. ఆ తర్వాత ఎందరెందరో కార్టూనిస్ట్‌లు కేవలం రాజకీయ కార్టూన్లనే కాక, పైన చెప్పిన అన్ని రకాల కార్టూన్లలో తమదైన ప్రతిభా ముద్రలతో దూసుకు వెళ్తున్నారు.
వీరిలో 'బాపు' గారిది ఓ ప్రత్యేకశైలి. తెలుగువారి కుటుంబ జీవనం, మధ్య తరగతి జీవనశైలి ప్రధానాంశాలుగా ఆయన గీసిన కార్టూన్లు దర్శకుడు బాపును 'కొంటె బొమ్మల బాపుగా మార్చాయి. జయదేవ్, మోహన్, శంకు, బాలి, మల్లిక్, రాగతిపండరి, రామకృష్ణ, బ్నిం, రాజు, చంద్ర, గీతా సుబ్బారావు, టీ.వీ., శేఖర్, శ్రీధర్, సురేన్ద్ర, సరసి, మృత్యుంజయ్, సుభాని, నర్సిం, శంకర్, వెంకటేష్, నారు, జావెద్, అవినాశ్, సూర్య ఇంకా ఎందరో... తెలుగు కార్టూన్ జర్నలిజంలో తమదైన శైలితో నిరంతరం పనిచేస్తున్నారు. 'కార్టూనిజం'ను తెలుగు మాధ్యమాలలో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అందుకే మీడియా జర్నలిజంలో ఇటీవలి కాలంలో 'కార్టూన్ షోలు' కూడా సీరియల్స్, టీ.వీ. ఛానెళ్ళలో ఆదరణ పొందాయి. అంతేగాక, క్రోక్విల్, హాస్యానందం వంటి పత్రికలు కార్టూన్ స్పెషల్ పత్రికలుగా పేరుపొందాయి. కాగా, ఇటీవలి కాలంలో అత్యధిక కార్టూనిస్ట్‌లు తెలంగాణ రాష్ట్రం నుంచే వస్తుండటం విశేషం. కార్టూన్ కళవైపు కృషి చేస్తున్న ఈ సృజనకారులు తెలంగాణలో హాస్యం - వ్యంగ్యం లేదు, తెలీదు అన్న మాటను తప్పని రుజువు చేస్తూ ముందు కెళ్తున్నారు.
వీటన్నిటి నేపథ్యంలో, కార్టూన్ జర్నలిస్ట్‌లకు, కార్టూన్లకు సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంకల్పించింది. అందుకే తెలుగు కార్టూనిజం చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా 2015 తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలలో రవీంద్రభారతిలో కార్టూనిస్ట్‌ల సదస్సును ఏర్పాటు చేసి దాదాపు 42 మంది కార్టూనిస్ట్‌లను అద్భుతంగా సత్కరించింది. అంతేగాక, 2016 రాష్ట్ర అవతరణ పురస్కారాలలో పామర్తి శంకర్‌కు లక్షరూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందించి కార్టూనిస్ట్‌లను గౌరవించింది.
ఇదే స్ఫూర్తిని ప్రస్తుతం కొనసాగిస్తూ 'ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణా సాహిత్య అకాడెమీ సారధ్యంలో నిర్వహిస్తున్న సందర్భంలో కార్టూన్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దాదాపు 155గురు కార్టూనిస్ట్‌లు 181 పైగా తమ కార్టూన్లను ప్రదర్శిస్తున్నారు. భాష, సంస్కృతి ప్రధాన వస్తువులుగా రూపొందిన ఈ కార్టూనో ఈ కోవలో ఇదే తొలి ప్రయత్నం అని చెప్పాలి.
ఈ కార్టూనోను కేవలం ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక అందమైన పుస్తకంగా ప్రచురించడం, ఓ చిరకాల జ్ఞాపకంగా తీర్చిదిద్దడం అభినందనీయం. ఈ అసాధారణ కృషిలో భాగస్వాములైన మిత్రులు మృత్యుంజయకు, సహకరించిన నర్సిం, శంకర్లకు ఇతర కార్టూనిస్ట్లందరికి అభినందనలు!
-మామిడి హరికృష్ణ