Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మినప్పిండి మురుకులు

కావలసిన వస్తువులు
బియ్యం 3 కప్పులు. పుట్నాలపప్పు 1/2 కప్పు
మినప్పప్పు 1 కప్పు ఉప్పు తగినంత
నువ్వులు 3 టీస్పూన్లు నూనె వేయించడానికి.
వెన్న 10 గ్రా.లు.

తయారుచేసే విధానం

బియ్యం కడిగి నీళ్ళు పోసి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చిన తర్వాత బట్ట మీద ఆరనివ్వాలి. కడాయి వేడి చేసి మినప్పప్పు దోరగా కమ్మని వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పుట్నాలపప్పు, మినప్పప్పు, బియ్యం కలిపి మెత్తగా పిండి కొట్టించుకోవాలి. మురుకులు చేసుకునేముందు పిండి ఒక గిన్నెలో కొలుచుకుని ఒకటికి సగం నీళ్ళు తీసుకుని మరిగించాలి. ఇందులో వెన్న, నువ్వులు, తగినంత ఉప్పు వేసి మరుగుతున్నప్పుడు బియ్యంపిండి వేసి కలిపి దింపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా పిసికి మురుకుల గిద్దెలో పెట్టి వేడినూనెలో వత్తుకోవాలి లేదా ముందుగా నూనె రాసిన ప్లేటు మీద చిన్న చిన్న మురుకులు వత్తుకుని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని తీసుకోవాలి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి.

పెసర మురుకులు

కావలసిన వస్తువులు
బియ్యం పిండి 3 కప్పులు. వెన్న 50 గ్రా.లు.
పెసర పప్పు 1 కప్పు జీలకర్ర 4 టీస్పూన్ లు
ఉప్పు తగినంత నూనె వేయించడానికి

తయారుచేసే విధానం

పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. నీరంతా వడకట్టి పప్పును మెదపాలి. ఒక గిన్నెలో బియ్యంపిండి, ఉడికించిన పెసరపప్పు, జీలకర్ర, తగినంత ఉప్పు, వెన్న కలిపి తగినన్ని నీళ్ళు కలిపి తడుపుకోవాలి. గంట తర్వాత పిండి బాగా పిసికి మురుకుల గిద్దెలో పెట్టి స్టార్ బిళ్ళ పెట్టి చిన్న చిన్న మురుకులు వత్తుకుని వేడినూనెలో బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.

తెలంగాణ రుచులు

56