క్యారట్ సర్వపిండి
| బియ్యం పిండి | 3 కప్పులు. | సెనగపప్పు | 3 టీస్పూన్లు |
| క్యారట్ తురుము | 1 కప్పు | జీలకర్ర | 1 టీస్పూన్ |
| పచ్చిమిర్చి | 3 | కారం పొడి | 1/2 టీస్పూన్ |
| కరివేపాకు | 3 రెబ్బలు | ||
| కొత్తిమీర. | కొద్దిగా | ఉప్పు | తగినంత |
| నువ్వులు | 2 టీస్పూన్లు | నూనె | 1/4 కప్పు. |
తయారుచేసే విధానం
నువ్వులు దోరగా వేయించుకోవాలి. సెనగపప్పు నీళ్ళు పోసి నానబెట్టాలి. బియ్యంపిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, నువ్వులు, సెనగపప్పు, కారంపొడి, తగినంత ఉప్పు, సన్నగా తురిమిన క్యారట్ వేసి కలపాలి. తగినన్ని నీళ్ళు చల్లుకుంటూ గట్టిగా తడిపి మూతపెట్టి ఉంచాలి. పది నిమిషాల తర్వాత బాగా పిసికి కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. పాన్ లేదా మందంగా ఉండే గిన్నెకు నూనె రాసి ఈ ముద్దను చేత్తో పల్చగా సమంగా వత్తుకోవాలి. మధ్య మధ్య వేలితో రంధ్రాలు చేసి కొద్దిగా నూనె వేయాలి. చుట్టు కూడా కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టి నిదానంగా కాల్చాలి. దోరగా కాలిన తర్వాత తీసి పెరుగు లేదా పచ్చడితో తినాలి.
సొరకాయ/ఆనపకాయ సర్వపిండి
| బియ్యం పిండి | 2 కప్పులు. | సెనగపప్పు | 2 టీస్పూన్లు |
| సొరకాయ తురుము | 1/2 కప్పు | ధనియాల పొడి | 1/2 టీస్పూన్ |
| పచ్చిమిర్చి | 2 | కారం పొడి | 1/2 టీస్పూన్ |
| కరివేపాకు | 2 రెబ్బలు | ||
| కొత్తిమీర. | కొద్దిగా | ఉప్పు | తగినంత |
| నువ్వులు | 1 టీస్పూన్లు | నూనె | 1/4 కప్పు. |
తయారుచేసే విధానం
నువ్వులు దోరగా వేయించుకోవాలి. సెనగపప్పు నీళ్ళలో అరగంట నానబెట్టాలి. బియ్యంపిండిలో సన్నగా తురిమిన సొరకాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, సెనగపప్పు, ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా తడిపి మూత పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత బాగా పిసికి ఉండలు చేసుకోవాలి. మందంగా ఉండే గిన్నెకు లోపల నూనె రాసి ఈ ఉండను పెట్టి వేళ్ళతో వెడల్పుగా, సమంగా వత్తుకోవాలి. అక్కడక్కడ రంధ్రాలు చేసి కొంచెం నూనె వేయాలి. చుట్టూ కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టి దోరగా కాల్చుకోవాలి.
తెలంగాణ రుచులు
54