మసాలా గవ్వలు
| మైదా | 1/2 కేజి. | నూనె | వేయించడానికి |
| గరం మసాలా పొడి | 1/2 టీస్పూన్. | డాల్డా లేదా నూనె | 3 టీస్పూన్లు |
| వాము పొడి | 1/2 టీస్పూన్ | పసుపు | చిటికెడు |
| ఉప్పు | తగినంత | కారం పొడి | 1 టీస్పూన్ |
తయారుచేసే విధానం
మైదా జల్లించుకుని కరిగించిన డాల్డా లేదా నూనె వేసి కలపాలి. తర్వాత ఉప్పు, కారంపొడి, గరంమసాలా పొడి, వాము పొడి వేసి, తగినన్ని నీళ్లు కలుపుకుంటూ గట్టిగా చపాతీపిండిలా చేసి మూత పెట్టి ఉంచాలి. గంట నానిన తర్వాత మళ్ళీ బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకుని దువ్వెన లేదా గవ్వల పీట మీద బొటనవేలుతో గవ్వల్లా వత్తుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఈ గవ్వలను వేసి బంగారు రంగు వచ్చేవరకూ నిదానంగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. గవ్వలను పలచగానే వత్తుకోవాలి. అలాగే పెద్ద మంట కాకుండా మధ్యస్థంగా వేడి ఉన్న మంట మీద కాల్చుకుంటే బాగా కాలుతాయి.
గుమ్మడికాయ హల్వా
| గుమ్మడికాయ తురుము | 2 కప్పులు | కాజు, బాదం | 6 |
| ఇలాచిపొడి | 1/2 టీస్పూన్ | నెయ్యి | 3 టీస్పూన్లు |
| పాలు | 2 కప్పులు | చక్కెర | 1 కప్పు |
తయారుచేసే విధానం
గుమ్మడికాయ చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి ఈ తురుమును కొద్దిసేపు వేయించాలి. పచ్చివాసన పోయాక పాలు పోసి, మొత్తం ఉడికాక చక్కెర వేసి పూర్తిగా దగ్గర పడేవరకూ ఉడికించి, ఇలాచి పొడి, సన్నగా ముక్కలు చేసుకున్న కాజు, బాదాం వేసి కలిపి దింపేయాలి. కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు.
పాలాంబురం
| బియ్యంపిండి | 1 కప్పు | ఇలాచిపొడి | 1/2 టీస్పూన్ |
| చక్కెర | 1/2 కప్పు | నెయ్యి | 2 టీస్పూన్లు |
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు తీసుకొని బియ్యంపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. వేరే గిన్నెలో 3 కప్పుల నీళ్లు మరిగించి ఈ బియ్యంపిండి మిశ్రమం వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చిక్కబడ్డాక చక్కెర వేసి కలిపి పూర్తిగా కరిగిన తర్వాత నెయ్యి, ఇలాచీ పొడి వేసి కలిపి దింపేయాలి.
43
తెలంగాణ రుచులు