Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5. మన ఆచార, సంపద్రాయాలు పండుగలు, వ్రతాలు-రుచులు-ఆరోగ్యం మనిషి సంఘజీవి. ప్రతి సమాజానికి కొన్ని ప్రత్యేకమైన ఆచార సంప్రదాయాలుంటాయి. ఆచారం అంటేనే ఆచరించబడేది. ఒక వ్యక్తి ఒక పనిని విడువక ప్రతిరోజూ నియమంగా ఆచరిస్తే అది అతని అలవాటు అవుతుంది. అలా కాక ఒక సంఘం కాని, ఒక జాతిగాని, ఒక పనిని నియమంతో ఆచరించే అలవాటే ఆచారమవుతుంది. అంటే ఒక సంఘంలోని ప్రజలు తరతరాలుగా అనుసరించే పద్ధతులను ఆచారమని సాధారణంగా నిర్వచించవలసి ఉంటుంది. ఆచారమంటే... “ఒక సంఘంలోని సభ్యులలో సాంప్రదాయకంగా నెలకొనిన ప్రామాణికమైన ప్రవర్తన పద్ధతి ఆచారం.” ఈ ఆచారాలన్నింటితో అవినాభావ సంబంధం ఉన్న అంశం వంటలు. పుట్టిన తర్వాత పురుడు చేసినప్పుడు, పారాడునప్పుడు, అన్నప్రాశనం, సమర్త, పెండ్లి, సీమంతం వంటి కుటుంబ సంబంధమైన వేడుకల్లో ప్రత్యేకమైన వంటలు చేసుకుంటారు. ప్రత్యేక వంటలు శిశువు పుట్టిన పదకొండవ రోజు చేసుకుంటారు. పదకొండు విస్తర్లలో అన్నం, ఆకుకూరలు, కూరగాయలు కలిపి వండిన కలెగూరను పెడతారు. గోధుమపిండితో దీపంతెలు చేసి వత్తులు వేసి దీపాలను వెలిగించి పదకొండు విస్తర్లలోని అన్నం మధ్యలో పెడతారు. ఈ దీపాలను పురిదీపాలని అంటారు. ఆ రోజు వచ్చిన బంధువులందరికీ గుడాలు చేసి పెడతారు. వచ్చిన పేరంటాండ్రకు గుగ్గిళ్లు నానబోసి (పచ్చి శనగలు) పంచిపెడతారు. పేరు పెట్టే రోజు కూడా ఈ గుగ్గిళ్లను పంచి పెట్టడంతోపాటు బిడ్డను తొట్టెలో వేసి పడుకోబెడతారు. దీనితో బిడ్డకు శనిపీడ పోతుందని నమ్మకం. బిడ్డ బోర్లా పడ్డప్పుడు బూరెలు వండుతారు. పాకినప్పుడు పాయసం, అడుగులు వేసినప్పుడు నూనెపోలెలు (అరిసెలు) వండటం ఆనవాయితి. రజస్వల అయిన అమ్మాయికి ఆహారంలో పాలు, పెరుగు, మాంసాలను పెట్టకపోవడం ఆచారం. నీరు తీపిపదార్థాలను ఎక్కువగా పెడతారు. వివాహం వంటలు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో వివాహ ఆచారాలలో భాగంగా పెండ్లిపిల్లను, పెండ్లికొడుకును చేసిన రోజున వండే వంటలలో వడియాల పులుసు, సేమ్యా తినే తీపి వంటకం ప్రత్యేకమైనవి. పెండ్లిలో నాల్గవనాడు కాని లేక పెండ్లి తెల్లవారి కాని మగ పెండ్లివాళ్లకు, బంధువులకు ఆడపెండ్లివాళ్లు విందు భోజనం ఏర్పాటు చేయడం ఆచారం. దీన్ని బువ్వం బంతి, బూజం బంతి అని వ్యవహరిస్తారు. ఆధునిక యుగంలో పెండ్లి తర్వాత ఏర్పాటు చేసే విందు భోజనం ఈ బువ్వం బంతి అని చెప్పవచ్చు. విందు భోజనం ఏ లోపం కలుగకుండా వియ్యాలవారిని తృప్తిపరిచేదిగా వుంటుంది. బంగారన్నం, మాంసం, రకరకాల కూరలు, పులుసులు, చార్లు, పచ్చళ్లు, పెరుగు, గారెలు, లడ్డూలు, భక్షాలు, పేనీలు మొదలైన ఆహారపదార్థాలను వాళ్ల వాళ్ల స్తోమతను బట్టి ఘనంగా విందులో ఏర్పాటు చేస్తారు. రుచికరమైన విందుభోజనం చేయడంతోపాటు ఆ విందులో వియ్యాలవారు ఒకరినొకరు పరిహాసం చేసుకోవడంతో పెండ్లి ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సారెతోపాటుగా నూట ఒకటి గాని, నూట పదహార్లు గాని చకినాలను లెక్కప్రకారం పెడతారు. సారెలో పెట్టే చకినాలు ఒక పెద్ద పళ్లెం వెడల్పులో పదునెనిమిది నుండి ఇరవై చుట్లతో చుట్టి 21 తెలంగాణ రుచులు