Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పుట్నాల సద్ది
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
బియ్యం 3 కప్పులు
పుట్నాలు కప్పు
ఎండుమిర్చి 5
జీలకర్ర, ఆవాలు 1/4 టీ స్పూన్
మినప్పప్పు 1 టీ స్పూన్
శనగపప్పు 1 టీ స్పూన్
పల్లీలు 2 టీ స్పూన్
ఇంగువ చిటికెడు
పసుపు 1/4 టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె 5 టీ స్పూన్

మూడు ఎండుమిర్చిలు దోరగా వేయించి పుట్నాలతో కలిపి పొడి చేసుకోవాలి. బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానిన తర్వాత కొద్దిగా పలుకుగా వండి చల్లార్చుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో అన్నం చల్లారబెట్టి పసుపు, పుట్నాలపొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేగిన తర్వాత దింపి అన్నంలో వేసి బాగా కలియబెట్టి పది నిమిషాలు ఉంచితే చాలు. ఇందులో పులుపు కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు లేదా పోపులో చింతపండు పులుసు వేసి మరిగించి అన్నంలో కలపాలి.

కొబ్బరి సద్ది
బియ్యం 100 గ్రా.
పచ్చికొబ్బరి పొడి 100 గ్రా.
ఎండు మిర్చి 3
జీలకర్ర 1/4 టీ స్పూన్
ఆవాలు 1/4 టీ స్పూన్
మినప్పప్పు 1 టీ స్పూన్
సెనగపప్పు 1 టీ స్పూన్
ఇంగువ చిటికెడు
ఉప్పు తగినంత
పల్లీలు 50 గ్రా.
కరివేపాకు 2రెబ్బలు
నూనె 5 టీ స్పూన్

అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడిచేసి పల్లీలు వేసి కాస్త వేగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేపి కొబ్బరిపొడి కాస్సేపు వేయించాలి. ఈ పోపునంతా అన్నంలో వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. పోపుకాని, కొబ్బరికాని దోరగా వేగాలి. ఎర్రబడకూడదు.

తెలంగాణ రుచులు

16