Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్తరమస అని కూడా అంటారు. బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒక రోజు ముందే తెంపుకొచ్చివాటిని వాడి పోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలి పువ్వు అంటారు. ఈ రోజు వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు చేస్తారు. రెండవ రోజునాడు ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డిపూలు కోసుకువస్తారు. ఈ పూలను రెండు అంతరాలలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో వేస్తారు. రెండవ రోజు అటుకులు వాయనంగా పెడుతారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ: మూడవ రోజు బతుకమ్మను మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటల దగ్గర అందరూ కలసి ఆడవారు ఆడుకొని చెరువులో వేసి వస్తారు. మూడవ రోజు వాయనంగా సత్తుపిండి, పేసర్లు, చక్కెర, బెల్లం కలిపి పెడతారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు.

నానేబియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంత రాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. నాలుగవ రోజు నానబియ్యం ఫలహారంగా పెడతారు. వాయనంగా ఆ బియ్యాన్ని బెల్లంతో కానీ, చక్కెరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.

అట్ల బతుకమ్మ: ఈ ఐదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడిపూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు. ఈ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించి వాయనంగా పెడుతారు.

అలిగిన బతుకమ్మ: ఈ రోజు ఆశ్వయుజ పంచమి. ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించరు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు. నైవేద్యమేమీ సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ: ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబీపూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు. ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.

వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపువ్వు మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆలయం వద్ద ఆటపాటల మధ్య చెరువులో వేస్తారు. ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.

సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి. ఇదే చివరి పండుగ రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు ఆ పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం తయారుచేస్తారు.

తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు వుపయోగిస్తారు.

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మరోజు సద్దులతోపాటు చేసే మరో నైవేద్యం సత్తుపిండి. బియ్యం, పెసరపప్పు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, మొక్కజొన్న మొదలైన వస్తువులను దోరగా వేయించి పొడిచేసి పంచదార, యాలకులపొడి, నెయ్యి కలిపి చేసుకుంటారు.

తెలంగాణ రుచులు

14