మగపెళ్లివారికి ప్రత్యేకమైన దావత్ ఇస్తారు ఆడపెళ్లివారు. దీనినే ఇందులు లేదా బువ్వబంతి, బూజంబంతి అని అంటారు. ఇదే ఇప్పటి రిసెప్షన్ పేరు. ఈ రిసెప్షన్లో బగారన్నం, మాంసాహారం, కూరలు, పులుసులు, చార్లు, పచ్చళ్లు, పెరుగు, గారెలు, లడ్డూలు, భక్ష్యాలు, పేనీలు, గర్జెలు, గులాబ్ జామూన్ లాంటివి విందులో వండి, వడ్డిస్తారు. అమ్మాయికి సారె ఇవ్వడానికి అరిసెలు, సకినాలు, గర్జెలు, లడ్డూలు, మడుగులు చేయిస్తారు. పెళ్లి అయిన పదహారవరోజు చేసేది అట్ల పండగ. ఈ రోజు అట్లు చేసి చాట గొడితే పెళ్లిపనులన్నీ అయిపోయాయి. చుట్టాలు ఇక వెళ్లవచ్చు అని అంటారు.
అమ్మాయి గర్భవతి అయినప్పుడు పుల్లగా తినాలనిపిస్తుందని చింతపండు పులిహోర లేదా తొక్కు మామిడికాయ పచ్చడి, పులుసు కూరలు చేసిపెడతారు. సీమంతం రోజు ఎక్కువగా సద్దులు లేదా అన్నంతో ఆహారపదార్థాలు చేస్తారు. చింతపండు పులిహోర, కొబ్బరన్నం, కుడువన్నం లేదా ఆవన్నం, నువ్వన్నం, దధ్యోజనం.. వీటిని చేస్తారు. బాలింతకు సూడి లేదా మోడి అనే మందు తయారుచేస్తారు. పిప్పళ్లు, సొంఠి, మిరియాలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, తాటిబెల్లం, ఇంగువతో బాలింతకు కారం చేసి రోజూ ఎల్లిపాయకారంతో కలిపి భోజనం పెడితే పాలు చక్కగా పడతాయని దీనితో ఆరోగ్యం తొందరగా కుదుటపడుతుందని నమ్మకం.
తెలంగాణ పండుగలు - ప్రత్యేక వంటలు:
పండగలకు కూడా ప్రత్యేకమైన ఆహారపదార్థాలను తయారుచేస్తారు. తొలేకాశి లేదా తొలేకాదశినాడు మక్కపాలాలతో పిండి చేసి బెల్లం, నెయ్యి కలిపి పేలపిండి చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టి అందరూ తింటారు. ఈ రోజు పేలపిండి తినకుంటే దయ్యమై పుడతామని పెద్దల నమ్మకం. ఉగాదినాడు కొత్తకుండలో చింతపండు పులుసు, మామిడి తురుము, బెల్లం, వేపపువ్వు, గసగసాలు వేసి పచ్చడి, కొత్తబెల్లం, శనగపప్పుతో చేసిన భక్ష్యాలు తప్పనిసరిగా చేసేవారు. భక్ష్యాలకు చేసిన పూర్ణంతో చారు కాస్తారు. మామిడి పులిహోర తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే వస్తున్న మామిడికాయలను ఉడికించి పిసికి జీలకర్ర పొడి, కాస్త ఉప్పు వేసి కలిపి షర్బత్లో తాగితే వడదెబ్బ కొట్టదని అంటారు. ఇక తెలంగాణా ప్రాంతంలో మరో ముఖ్యమైన పండగ సంక్రాంతి. మూడు రోజుల ఈ పండగకు ప్రతీరోజు సంబరమే. భోగినాడు కొత్త బియ్యం, బెల్లం నువ్వులతో పులగం, బియ్యం పెసరపప్పు కలిపి కట్టుపొంగలి చేస్తారు. సంక్రాంతి రోజు అన్ని కూరగాయలను కలిపి కలెగూర, నువ్వులు, పల్లీలు, పుట్నాలతో చేసే ఉండలు, పరమాన్నం చేస్తారు. సంక్రాంతి పండగనాడు ఎక్కువగా నువ్వులు కలిసిన పిండివంటలు చేస్తారు. సకినాలు, నువ్వుల ముద్దలు, నువ్వులు చల్లిన అరిసెలు, నువ్వులు కొబ్బరిపొడి, పుట్నాలపొడితో చేసే గరిజెలు మొదలైనవి. కనుమనాడు మాత్రం మాంసాహారం తప్పనిసరిగా ఉండేది. బంధువులను, కుటుంబ సభ్యులందరినీ పిలుచుకుని ఇష్టపూర్తిగా పూరీలు, గారెలు, గుడాలు, కోడి, మాంసం మొదలైనవి తయారుచేసి సంబరంగా గడపడం ఆనవాయితీగా ఉండేది. హెూలీ పండుగనాడు కూడా మాంసాహారం ఉండాల్సిందే. శ్రీరామనవమికి బెల్లం, సోంపు పొడితో పానకం, పెసరపప్పు లేదా శనగపప్పుతో వడపప్పు చేస్తారు. దసరా నవరాత్రులలో ఆడే బతుకమ్మకు రోజూ అటుకులు, బెల్లం పెట్టినా, సద్దుల బతుకమ్మనాడు మాత్రం అయిదురకాల సద్దులు చేయాల్సిందే. దానితోపాటు రొట్టెముక్కలు, బెల్లం కలిపి దంచి చేసే మలీద ముద్దలు. వినాయక చవితికి ఉండ్రాళ్లు, బెల్లం, శేవలతో చేసే పాశం లేదా పాయసం, తుమ్మికూర చేస్తారు. కార్తీక పున్నమి తర్వాత వచ్చే పున్నమిని యముని కోళ్ల పున్నమి అంటారు. ఈ రోజు బొబ్బర్లు కాని, పచ్చి అనుములుగాని పోసి, పచ్చికారం, ఉప్పు, ఉల్లాకు వేసి కుడుములు చేసి ఆవిరి మీద ఉడికించి నైవేద్యంగా పెడతారు.
తెలంగాణా భోజన పద్ధతి:
తెలంగాణాలో వంట వండిన అందరు కల్సి భోజనం చేయడం కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. విస్తరాకులో అందరికీ అన్నీ వడ్డించిన తర్వాతే ఎవరైనా తినడం మొదలుపెట్టాలి. అది కూడా ముందుగా పెద్దవాళ్లు, తర్వాతే అందరూ తినడం ప్రారంభిస్తారు. మొదటి ముద్ద తీసి పితదేవతలకు పక్కన పెడతారు. భోజనం అయిపోయినా మధ్యలో ఎవరూ లేచి వెళ్లరాదు. అందరూ భోజనం చేసిన తర్వాతే బంతినుండి లేచి చేయి కడగాలి. భోజనం పూర్తయిన తర్వాత ఎంగిలాకును మడిచివేయాలి. విస్తరిని కుడినుండి ఎడమకు మడిస్తే భోజనం పెట్టినవాళ్లకి, తిన్నవాళ్లకి మధ్య సంబంధం గట్టిపడుతుందని, ఎడమనుండి కుడికి మడిస్తే గొడవలు అవుతాయని, ఎప్పుడు కూడా ఆకులు మనవైపే మడవాలనే ఒక సాంప్రదాయం ఇక్కడ పాటిస్తుంటారు.
తెలంగాణ రుచులు