Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేసుకోవడానికి పొంతపొయ్యి ఉపయోగ పడుతుంది. చలికాలంలో ఈ వేడినీళ్లు స్నానానికి, మొహం కడుక్కోవడానికి ఉపయోగపడేవి. నాలుగువైపులా మట్టిరాళ్ల గోడలు ఒకేసారి రెండు పొయ్యిలులాగా గోడలు కట్టేవారు. మంట కోసం కట్టెలు పెడితే రెండు పొయ్యిలకు అందేది. ఈ పోయ్యితో ఏకకాలంలో రెండు వంటలు చేసుకోవచ్చు. పాలు మాత్రమే కాచడానికి ప్రత్యేకంగా గుండ్రని కుంపటి ఆకారంలో కొంచెం భూమిలో పాతినట్టుగా ఉండే దాలిపొయ్యిని ఉపయోగించేవారు. ఇందులో తగినన్ని పిడకలు పెట్టి నిప్పును రాజేసి (ఎక్కువగా పెట్టి) చిన్న మంట మీద పెడితే పాలు బాగా కాగేవి, కాని అవి పొంగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. ఇలా కాచిన పాలమీద దట్టమైన మీగడ పేరుకుంటుంది. పెళ్లిళ్లలో చేసే పెద్ద వంటలకు గుంటలు తవ్వి గోడలా కట్టి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకునే వీలుగా గాడిపొయ్యిలు తయారుచేస్తారు. పెళ్లి వంట మొదలుపెట్టే ముందు పసుపు కుంకుమలతో పొయ్యిలను అలంకరించి కొబ్బరికాయ కొట్టి అగ్నిదేవునికి నమస్కరించి వంటలు మొదలుపెడతారు. గద్దెగిన్నె ఆకారంలో కుమ్మరిమట్టితో చేసిన కుంపటి ప్రతీ ఇంటిలో ఉండేది. ఈ కుంపటిలో అడుగున పిడకలు పేర్చి, దానిపైన ఉనుక లేదా రంపపుపొట్టు దట్టంగా నింపి ఉపయోగించేవారు. వంటతోపాటు చలికాలంలో వెచ్చదనానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కుంపటి. వంట పాత్రలు: తెలంగాణాలో వంటలకు ఉపయోగించే పాత్రలు కూడా క్రమ పద్దతితో, చూసేందుకు విచిత్రంగా ఉంటాయి. వీరు మట్టి, రాతి పాత్రలే కాకుండా ఇనుము, ఇత్తడి లేదా రాగి పాత్రలను కూడా ఉపయోగించేవారు. మట్టి పాత్రలలో కుండ, అటిక, కడుముంత, గురిగి, కంచుడు, ఎస్ల మొదలైనవి. ఇనుప పాత్రలలో రొట్టెపెంక, దోసెలపెనం. మట్టితో చేసిన పాత్రలు వంటలకే కాక పూజలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలకు కూడా ఉపయోగించేవారు. ప్రతీ ఇంట్లో కూరాడు కుండ, నీళ్లకుండ ఉండేవి. పెళ్లి సమయంలో మంచి ముహూర్తంలో బాజాభజంత్రీలతో కుమ్మరి దగ్గరినుండి ఐరేణి కుండలు తెచ్చి లక్ష్మీదేవిని, గౌరీదేవిగా పూజించేవారు. ఇప్పటికీ చాలామంది ఈ సంప్రదాయాన్ని ఇక్కడి ప్రాంత ప్రజలు పాటిస్తున్నారు. వెడల్పుగా పులుసు కూరలు వండడానికి ఉపయోగించేది అటిక. గరిగెబుడ్డి, గడిగబుడ్డి, గడియ కుడుక, గడియబుడ్డి పెళ్లి సమయంలో పూజలందుకునేవి. పూర్వకాలంలో గడియారాలు లేని సమయంలో గడియబుడ్డిని ఉపయోగించేవారు. స్త్రీలు వంట చేసే సమయంలో చేతులు కడుక్కోవడానికి కుడుముంత అని చిన్న గుండ్రటి కుండను ఉపయోగించేవారు. కుండ ఆకారంలో చిన్నగా ఉండేవి గురిగీలు. వీటిని పెద్ద కుండలనుండి నీళ్లు ముంచుకోవడానికి, పాలకుండపై మూతగా ఉపయోగించేవారు. కూరాడు మీద మూతపెట్టడానికి లేదా దేవుడి దగ్గర అఖండదీపం పెట్టడానికి వాడేదాన్ని కంచుడు లేదా మూకుడు అనేవారు జొన్నపేలాలు, మక్కపేలాలు వేయించుకునేందుకు ఉపయోగించేది మంగలం. ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి వెడల్పాటి మూతలతో సిలిండర్ లేదా బావిలా ఉండే గాబు లేదా గాగులు అనబడే కుండలను వాడేవారు. కర్ర లేదా చెక్కతో చేసిన వస్తువులు కూడా వంటలకు ఉపయోగించేవారు. ఈలపీట కూరగాయలు తరగడానికి, కౌచిప్ప లేదా కపిష్కం సానమీద నీళ్లు చల్లుకుంటూ నూరితే మధ్యలో రంధ్రం ఏర్పడుతుంది. దానితో కూరగాయల పొట్టు తీయడానికి ఉపయోగించే వారు. వంట చేసేటప్పుడు కూరలు లేదా అన్నం కలపడానికి, వడ్డించడానికి వాడేది తెడ్డు అంటే చెక్క గరిటలు, వీటినే చెంచాలంటారు. ఇనుముతో చేసిన గంటె పోపు పెట్టడానికి, గుడ్డు అట్టు వేసుకోవడానికి ఉపయోగించేవారు. పొడవాటి కర్రకు శుభ్రం చేసిన కొబ్బరి చిప్ప కట్టి పులుసు కూరలకు, కుండలోనుండి నీళ్లను తీసుకోవడానికి వాడేది అబక. సన్నగా ఉన్న కర్రకు చివర ముద్దలా ఉండే చెక్క ఆకారాన్ని బిగించి పప్పు రుద్దేందుకు వాడేది పప్పుగుత్తి. కవ్వం తయారు చేసేవారు, దీనిని చల్ల చిలకడానికి ఉపయోగించేవారు. రోళ్లు, రోకళ్లు, రొట్టెల కోసం రొట్టెలపీట, దానికి కోల కూడా కర్రతోనే చేసేవారు. పొయ్యిలో మంటను మండించడానికి వెదురుతో చేసిన గొట్టాలు, లేదా వెదురుతో చేసిన విసనకర్రలు, అన్నం వార్చుకోవడానికి సిబ్బిని, వండిన వంటకాలను, పాలు, పెరుగు మొదలైన ఆహారాన్ని పిల్లులు, ఎలుకలు, కుక్కలు ముట్టకుండా ఉండడానికి చాలా ఎత్తున వ్రేలాడగట్టిన వెదురుతో చేసిన ఉట్టిలో పెట్టేవారు. తెలంగాణ రుచులు 4