మొదలు పెట్టి నెల రోజులపాటు జరిపి మళ్లీ ఆదివారంతో ముగిస్తారు. ఈ పండుగ జరిపేటప్పుడు కన్నమరాజు దేవత కోసం ప్రత్యేకంగా ఒక చిన్న ఇల్లు కడతారు. దేవతకు బోనాలు సమర్పించుకుంటారు. ఈ పండుగ రాత్రివేళలో వీరు కంచాలు పట్టుకొని నృత్యం చేస్తారు. ఈ పండుగ సమయంలో జన్మించిన అమ్మాయిలకు కన్నమ్మ అని, అబ్బాయిలకు కన్నయ్య అని పేరు పెడతారు.
కోయ నృత్యాలు
4రేల నృత్యం:- కోయలు దేవతలను పూజించేటప్పుడు, పండగరోజుల్లోను, ఉత్సవాల్లోనూ, వివాహ సమయాల్లోను, ఇతర వేడుకల్లోనూ బృంద నృత్యాలను ప్రదర్శిస్తారు. రేలా అంటే పండువెన్నెల అని అర్థం. రేలా అంటే బదరీవృక్షం అనే అర్థం కూడా చెప్తారు. కోయజాతి మూలం బదరీ వృక్షం క్రింద ప్రారంభమైనట్లు వారు విశ్వసిస్తారు. వారి నృత్య ప్రదర్శన ప్రకృతి నుండి ప్రేరణ పొంది చేసినట్లుగా కనిపిస్తుంది. అడవి ఎద్దుల పోరాటం వలె పురుషుల నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ నృత్య ప్రదర్శనలో వారు అనేక నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. చిన్న చిన్న వస్తువులను గాని చేతి గుడ్డలను గాని నేల మీద ఉన్న వాటిని తీయడం అనేది ప్రత్యేకంగా వారి నైపుణ్యాలలో పేర్కొనదగినది. కోయలలో రేలకొమ్మునృత్యం విశిష్టమైనదిగా చెప్పదగినది. వారు నృత్యాన్ని మూడు రకాలుగా ప్రదర్శిస్తారు. స్త్రీ పురుషులు ఒకరి చేతులను ఒకరు నడుము దగ్గర పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తారు. ఈ గ్రూపులో ముప్పై నుండి నలభై మంది వరకు పాల్గొంటారు. మరొక పద్ధతిలో స్త్రీ పురుషులు విడివిడిగా గుండ్రంగా తిరుగుతూ ఒక అడుగు ముందుకు ఒక అడుగుకు వెనకకు వేస్తూ ముందుకు వంగుతూ లేస్తూ లయబద్ధంగా పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు. మరొక పద్ధతిలో స్త్రీ పురుషులు గుండ్రంగా తిరుగుతూ ముందుకు వెనుకకు అడుగులు వేస్తూ పాటకనుగుణంగా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తారు. అలాగే చప్పట్లు కొట్టేటప్పుడు స్త్రీ పురుషులు కలిసి గుండ్రంగా తిరుగుతూ తమకు కుడి ఎడమల వైపు ఉండే వారితో చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తారు. ఇది ఒక రకంగా కోలాటం నృత్యం వలె కనిపిస్తుంది. స్త్రీలకు ఒక నాయకురాలు ఉంటుంది. పురుషులకు ఒక నాయకుడు ఉంటాడు. స్త్రీలు మోకాళ్ళ వరకు చీర కట్టుకొని కుడివైపు కొంగును వేసుకుంటారు. స్త్రీల వెంట్రుకలను కొప్పుగా పెట్టుకుని అలంకరించు కుంటారు. దీన్ని కొప్పుముడి అంటారు. కొప్పు ముడి మీద ఈకలను అందంగా పెట్టుకుంటారు. ఈ రేలా నృత్యాన్ని వెన్నెల నృత్యంగా పేర్కొంటారు. పురుషులు అడవి ఎద్దుల కొమ్ములకు రంగురంగుల వస్త్రాలను చుట్టి, నెమలి ఈకలతో అలంకరించి దాన్ని తలపై ధరిస్తారు.
5కుర్రె నృత్యం:- వరంగల్ జిల్లాలలో కుర్రె నృత్యం చాలా ప్రసిద్ధమైనది. ఈ నృత్య ప్రదర్శనలో పురుషులు మాత్రమే పాల్గొంటారు. పంచె, బనీను ధరించి, తలకట్టు కట్టుకొని, చేతిలో తువ్వాలు పట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, గుండ్రంగా తిరుగుతూ, పాట పాడుతూ నృత్యం చేస్తారు. ఈ సంగీతానికి అనుగుణంగా రెండు సన్నాయిలు, మూడు డప్పులు ప్రధాన వాద్యాలుగా ఉంటాయి.
వాద్యాల కనుగుణంగా నృత్యం నడుస్తుంది. సందర్భాన్ని బట్టి ఇరవై నుండి ముప్పై మంది వరకు పురుషులు ఈ కుర్రె నృత్యంలో పాల్గొంటారు. ఒకరి భుజంపై ఒకరి చేతులు వేసి బృంద నాయకుని సైగలను అనుసరించి నృత్యం చేస్తారు.
80
80