Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విధంగా కోయలు తమ సంస్కృతిలో ఒక భాగంగా భూమితల్లిని కొలిచి బాగా పండాలని కోరుకుంటారు.

5. కుర్మిన్ పదూం( కొత్తల పండుగ):- కొత్తల పండుగను ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలలో జరుపు కుంటారు. కొత్తల పండుగ నిర్వహించే ముందు గ్రామస్తులంతా గ్రామ పూజారి ఇంటికి వచ్చి పండుగకు సంబంధించిన వస్తువులను గురించి మాట్లాడుకుని ఫలానా రోజున పండుగ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. దీన్నే వాళ్ళు "కూటవ”అని అంటారు. గ్రామస్తులంతా ముత్యాలమ్మ గుడి దగ్గర పొంగళ్ళు పెట్టి నైవేద్యాలు సమర్పించుకుంటారు. తర్వాత వరి చేల నుండి వరి కంకులు తెచ్చి వాటిని తమ గోత్రం సంఖ్యను బట్టి ఇంటి గుమ్మం ముందు వరుసగా కడతారు. ఇలా చేయడంలో కోయవారి గోత్రం అంకెలు ఇంటి ముందు వసారాలో కనబడుట తార్కాణంగా కనిపిస్తుంది. కొత్త పంటతో బోనం వండి తమ దేవతలకు పెట్టి, కొత్త వరివంగడాలను ముందుగా పక్షులకు పెట్టాలనేది వీరి సంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా సంక్రాంతి పండుగను పోలి ఉంటుంది.

6. పచ్చ పండుగ:- పచ్చ పండుగను సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరుపుకుంటారు. వారం రోజులు ముందుగా ఆ పండుగ ఏ రోజు చేయాలనేది గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. ఆకుకూరలు కూరగాయలు మొదలైనవి ముందుగా పంటకు వస్తాయి. వీటిని కోయడానికి కోయలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ చేయకుండా కూరగాయలను కోసి నట్లయితే పులి ఆవులను మేకలను తింటుందని వారి నమ్మకం.

7. చిక్కుడు పడూం (చిక్కుడు పండుగ):-కోయలు ఈ చిక్కుడు పండుగను జనవరి నెలలో సంప్రదాయబద్ధంగా జరుపు కుంటారు. వీరు తమ ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో గాని లేదా పక్కనే ఉన్న చేలలో గాని చిక్కుడు పాదులను తప్పనిసరిగా పెంచుకుంటారు. వీరు చిక్కుడు కాయలు కాసిన తర్వాత వాటిని కోయడానికి ముందుగా ఈ పండుగను జరుపుకుంటారు. మొదట కాసిన చిక్కుడుకాయలను వండి తమ దేవత “అనాల్ పేన్” కు నైవేద్యంగా పెట్టి తాము తింటారు. ఆ రోజు నుండి ఇక ఎవరికైనా ఆ కాయలు కోసి ఇస్తారు.

8. ఇక్కీం పడూం (ఇప్ప పువ్వుల పండగ); - ఇప్ప చెట్టు కోయల జీవనయానంలో, సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఇప్ప పువ్వులు రాలడం మొదలవగానే గ్రామస్తులు పూజారిని కలిసి ఇప్ప పువ్వుల పండగను చేయడానికి నిర్ణయించుకుంటారు. పూజారి ముందుగా మట్టి బొమ్మను చేసి ఒక గంపలో పెట్టి దానికి పసుపు కుంకుమ పూసి, నెమలి ఈకలతో అలంకరించి, వండిన అన్నం, గంజి ఆ గంపలో పెడతాడు. ఈ విధంగా గంపదేవరను పూజారి తయారు చేస్తాడు. దాన్ని ఇప్పచెట్టు వద్దకు తీసుకెళ్లి పూజ చేస్తాడు. తర్వాత ఇప్పపువ్వులను ఒక పుల్లకు గుచ్చి నీటిలో వేస్తాడు. ఆ పుల్ల తేలితే వర్షాలు పడవని, మునిగితే వర్షాలు కురుస్తాయని భవిష్యత్తు తెలుసుకుంటారు. దాన్ని బట్టి కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ పండుగను జరుపుకొని ఇప్పపూలు సేకరించు కుంటారు.

9. తాడిం పడూం (తాడి చెట్ల పండుగ):- కోయల అవసరాలకు ఆర్థికపరిస్థితికి తాడిచెట్టు ఎంతో ముఖ్యమైనది. వీరు తాడిచెట్ల పండుగను తాటిగెలలు వచ్చే సమయంలో జరుపుకుంటారు. ఈ పండుగకు వారు తాడి చెట్లను ఎక్కడానికి పనికివచ్చే కత్తికి తాడుకు పూజ చేస్తారు. అలా చేయడం వల్ల తాడి చెట్లను ఎక్కే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వీరు నమ్ముతారు.

10.లే లే పడూం (కన్నమరాజు పండుగ):- ఈ లే లే పండుగను కోయలు అక్టోబరు నెలలో ఆదివారంనాడు

79