ముత్యాలమ్మ కొలుపు:- పొంగు, తట్టు లాంటి రోగాలు రాకుండా ఉండాలని ముత్యాలమ్మ కొలుపును కోయలు చేస్తారు. ముత్యాలమ్మను నిలబెట్టే చోట పూజారి నీళ్లు చల్లి మట్టితో అలికి ముగ్గు వేస్తాడు. దానిపైన పందిరి వేసి వేపచెట్టు కొమ్మలతో పైకప్పు వేస్తారు. పుట్ట మట్టిని తెచ్చి ముత్యాలమ్మ,ముడుపులమ్మ ప్రతిమలు చేస్తారు. ఊరి పూజారి ఇంటికి పోయి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, తెల్లచీర, రవిక, బెల్లం, కత్తి మొదలైన వస్తువులు తెస్తాడు. దేవతలకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, తెల్లచీర జాకెట్లకు పసుపు రాసి, దేవతలకు కప్పుతారు. దేవతల ముందు దీపాలు వెలిగిస్తారు. కోడిపుంజుకు పసుపు కుంకుమ రాసి, గ్రామ దేవతలకు నమస్కరించి, దాని ముందు కొన్ని బియ్యం వేస్తారు. ఆ బియ్యాన్ని కోడిపుంజు మూడు సార్లు తింటే వారికి అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. తర్వాత ఆ కోడిని బలి ఇస్తారు. తర్వాత ఒక గొర్రెను ముత్యాలమ్మ ముందు నిలబెట్టి దానిపై వేప మండలతో మూడు సార్లు నీళ్లు చల్లుతారు. ఆ సమయంలో ఆ గొర్రె ఒళ్ళు జలదరిస్తే (జడితిస్తే) వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఆ రాత్రంతా గ్రామస్తులందరు రేలాపాటలు పాడుతూ కాలం గడుపుతారు. తెల్లవారుజామున రెండు గొర్రెలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ముత్యాలమ్మకు బలి ఇస్తారు. ఆ మాంసాన్ని అందరూ పంచుకుని తీసుకుంటారు. అనంతరం ముత్యాలమ్మ ప్రతిమలు, అక్కడ పెట్టిన వస్తువులు, పందిరి అన్నిటినీ బండిలో తీసుకుని ఊరి బయటకు వెళతారు. ఆ బండి వెనక స్త్రీలు పిల్లలు కొంత దూరం వెళ్లి తిరిగి వస్తారు. మిగిలిన పెద్దమనుషులు, పూజారి ఆ బండిని ఊరి పొలిమేరకు తీసుకొనిపోయి, అక్కడ దేవతలను వదిలిపెట్టి, ఒక గొర్రెను బలి ఇచ్చి వస్తారు. ఈ కొలుపును మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు.
సమ్మక్క సారలమ్మ జాతర:-సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. తెలంగాణలో జరిగే ఈ జాతర భారతదేశంలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు సంపాదించుకున్నది. కోయ జాతిలో ఉండే పట్టుదల, నమ్మకం, నీతినిజాయితీలకు ప్రతీకగా ఈ జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకు కోయవాళ్ళు ప్రధాన పూజారులు. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు.
కోయ సామ్రాజ్యాన్ని రక్షించుకొని తమ జాతిని కాపాడడం కోసం సమ్మక్క కుటుంబ సభ్యులందరూ కాకతీయ సేనలతో యుద్ధం చేసి వీరమరణం పొందారు. చివరికి సమ్మక్క మాత్రమే మిగిలింది. ఆమె అపర కాళిలాగా కాకతీయ సైన్యంతో యుద్ధం చేస్తుండగా సైనికుడొకడు వెనుకవైపునుండి సమ్మక్క వీపులో బల్లెంతో పొడిచాడు. అప్పుడామె
74