కంటెను మెడకు ధరిస్తారు. వివాహ సమయంలో కాలి వేళ్ళకు మట్టెలు స్త్రీలకు తొడుగుతారు. వివాహిత స్త్రీలు నల్లపూసల దండను వేసుకుంటారు. స్త్రీలు నుదుట కుంకుమ బొట్టును పెట్టుకుంటారు.
b). ఆర్థిక వ్యవస్థ : -కోయలు అటవీ ఉత్పత్తులు పోడు వ్యవసాయం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని పెంపొందించు కుంటున్నారు. వీరు తమ ఆహారానికి జొన్నలు, సామలు, వరి పండించుకుంటారు. వీటితో పాటు మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటలను పండించుకుని అమ్ముకుంటారు. అటవీ ఉత్పత్తులు జిగురు, ఉసిరికాయలు, తేనె, ఇప్పపువ్వు, కరక్కాయలు, చీపుర్లు మొదలైన వాటిని సేకరించి సంతలో అమ్ముకొని, తమకు కావలసిన వస్తువులు కొని తెచ్చు కుంటారు. తునికిఆకు సేకరణ ద్వారా రెండు మూడు నెలలు కోయలు తమ ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. తాటిచెట్ల నుండి కల్లు, తాటి ముంజలు, తాటిపండ్లు, తాటి తేగలు, తాటినారతో చేసిన వస్తువులు అమ్ముతారు. కోయల ఆర్థిక పరిస్థితిలో తునికిఆకు, తాటి చెట్టు ముఖ్యపాత్రను పోషిస్తాయి.
C). న్యాయవ్యవస్థ:-కోయల న్యాయవ్యవస్థలో కుల పంచాయితీ ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా గ్రామస్తుల సమక్షంలో తీర్పులు చెప్పే దాన్నే పంచాయితీ అంటారు. పంచాయితీ సాధారణంగా రచ్చబండ మీదగాని లేదా ఒక చెట్టు కిందగాని జరుగుతుంది. పంచాయితీలో గ్రామపెద్ద ముఖ్య పాత్ర పోషిస్తాడు. అతనితోపాటు పూజారి, యాపారి (తలారి), పిన్నపెద్ద, గ్రామంలోని పెద్దమనుషులు కీలక సభ్యులుగా పంచాయతీలో ఉంటారు. పూజారి పవిత్రంగా ఉంటూ గ్రామంలో పండుగలు శుభ కార్యక్రమాలు అన్నిటినీ విధిగా నిర్వహిస్తాడు. యాపారి ( తలారి) సమాచారాన్ని గ్రామంలోని గ్రామస్తులు అందరికీ చేరవేస్తాడు. గ్రామపెద్ద అందుబాటు లో లేనప్పుడు గ్రామ సమస్యల పరిష్కారానికి పిన్నపెద్ద నాయకత్వం వహిస్తాడు. ఇతడు గ్రామపెద్దకు అన్ని సమయాల్లో సహాయకారిగా ఉంటాడు. గ్రామంలో ఏ నేరం జరిగినా దాని విచారణ గ్రామస్తులందరి సమక్షంలో జరుగుతుంది. నేరం చిన్నదైతే దానికి పంది మేక లాంటి చిన్న జంతువులను జరిమానాగా విధిస్తారు. నేరం పెద్దదైతే ఆవును జరిమానగా విధిస్తారు. జరిమానాను గ్రామస్తులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమాన కట్టలేకపోతే నేరస్తుని గ్రామం నుండి బహిష్కరిస్తారు.
d). మత విశ్వాసాలు:-కోయలకు ప్రత్యేక ఆలయాలగాని, ఒక ఆకారం లో చేయబడిన విగ్రహాలుగాని ఉండవు. ప్రతిగ్రామంలోనూ వేప, మద్ది కొయ్యలను ముత్యాలమ్మగా ప్రతిష్ఠించుకుంటారు. ఊరి బయట పొలిమేరలో బూరుగు లేదా మద్ది చెట్ల దగ్గర గ్రామ దేవతలుగా కొయ్యలను పాతుతారు. గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువు లేదా వాగు దగ్గర పెద్ద పెద్ద బండలను పెట్టి ముత్యాలమ్మ, ముడుపులమ్మ, గంగానమ్మ, కొండలమ్మలుగా పూజిస్తారు.
జాతరలు:-కోయవారికి ముత్యాలమ్మ ముఖ్యమైన గ్రామ దేవత. భక్తుల కోరికపై ఈమె గ్రామాలను రక్షిస్తుందని వీరికి విశ్వాసం. తమకు వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుతుందని, పశువులను రక్షిస్తుందని, పొలాలకు వచ్చే చీడపీడల నుండి రక్షిస్తుందని, గ్రహ బాధలనుండి, శత్రువుల నుండి కాపాడుతుందని, వీరి నమ్మకం. కోయలు దేవతల ప్రీతి కోసం పండగలు కొలుపులు చేస్తారు. ఈ దేవతలను సంతృప్తి పరచటానికి కోళ్లు మేకలు గొర్రెలు దున్నపోతులు బలి ఇస్తారు. కొబ్బరికాయలు సారా, కల్లు, పసుపు, కుంకుమ, రక్తం దేవతలకు ప్రీతికరమైనవని కోయలు నమ్ముతారు. వీటితోనే వీరు దేవతలను కొలుస్తారు. ప్రతిపూజను వీరు "జొంజోర్, సత్తెం తలుస్కిన్ ఆస్ మిందర్” అని ప్రారంభిస్తారు. “నమస్కారం సత్యమే పలకండి, తల్లులై ఉన్నవారు" అని దీనికి అర్థం. దీన్నిబట్టి కోయలు “అనిమిస్ట్” లని భావించవచ్చు.
73