Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బండను వాళ్ల మీద వేశాడు. అప్పుడు భూమి బద్దలై ఏడుగురు పిల్లలు నాగలోకానికి పోయారు. మిగిలిన తొంభైమూడు మంది చనిపోయారు.

నాగలోకంలో నాగరాజుకు ఏడుగురు భార్యలు. వాళ్లకు ఏడు పశువులు ఉన్నాయి. ఈ ఏడుగురు పిల్లలు ఏడు పశువులను మేపేవారు. కానీ ఒకరోజు ఒక భార్య పసువును ఇంకొక భార్య ఇంట్లో కట్టినందుకు నాగరాజు భార్యలకు తగాదా వచ్చింది. ఇలాంటి సమస్య మళ్ళీ రాకుండా ఏడు ఆవులకు ఏడు అంకెలు పెట్టి ఏడుగురికి ఏడు పేర్లు పెట్టాడు. 1 రఘువు, 2. బృగువు, 3. మృకంఠుడు, 4. విశ్వామిత్రుడు, 5. వశిష్ఠుడు, 6. ఆత్రేయుడు, 7. జమదగ్ని. ఈ ఏడుగురికి ఏడు అంకెల గోత్రాలు (గట్లు) రూపొందాయి. వీరు అడవులలో ఆవులు మేపుతూ గుట్టలు, కొండలు ఎక్కారు కాబట్టి వారి గోత్రం గట్టుగా మారింది. మూడో అంకెవాడు మూడవ గట్టు, నాలుగవ అంకె వాడు నాలుగవ గట్టు ఈ విధంగా గోత్రాలకు సంఖ్యలు ఏర్పడినాయి.

నాగలోకంలోని నాగేంద్రునికి రాచ పుండు వ్యాధి వచ్చింది. అప్పుడు ఆ పుండు బాధను మర్చిపోవడానికి డోలి పటాడీలను పిలిచి వారి సంగీత నాట్యాలను చూస్తూ అతడు తన బాధ మర్చిపోయాడు. ఏడుగురు కోయలు ఆకుమందుతో నాగేంద్రుని రాచపుండును నయం చేశారు. వైద్యం చేసినందుకు" మీకు ఏమి కావాలి” అని నాగేంద్రుడు వారిని అడిగాడు. కోయలు డోలు పటాడీలు తమకు కావాలన్నారు. వాళ్లను కోయలకి ఇచ్చి వారికి పుట్టిన పిల్లలను పెంచుకొని వారికి మీ గోత్రం పేరు పెట్టుకోమని నాగరాజు చెప్పాడు. కోయలు భూలోకానికి వెళ్ళిపోతామన్నారు. నాగరాజు తామర పువ్వుని సృష్టించాడు. దాని ద్వారా కోయలు భూలోకానికి వచ్చి రేల చెట్టు క్రిందకు చేరినారు. ఆ చెట్టు క్రింద కొంతసేపు నిద్రపోయి సేద తీర్చుకున్నారు. రేల చెట్టు వారికి ఆశ్రయం ఇచ్చిందని రేల పాటలు పాడుతూ వారు అడవిలో వెళుతుంటారు. అప్పుడు చనిపోయిన వారి 93 మంది కోయల ఆత్మలు కనిపించి, మాకు ఆకలిగా ఉంది అన్నారు. ఇంతమందికి మేము ఇప్పుడు ఏమి పెట్టలేము. మీరు ఇప్పచెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు, తాడి చెట్టు చిక్కుడు చెట్లు మొదలైన చెట్ల దగ్గర ఉండండి. మేము అక్కడ పూజలు చేసి మీకు నైవేద్యాలు పెడతామని చెప్పారు. ఆనాటి నుండి కోయలు ఆయా చెట్ల దగ్గర అన్నం ముద్దలు కొన్ని బియ్యం ఉంచి కోడిని కోసి తమ పూర్వీకులకు నైవేద్యం పెడతారు. ఇలా కోయల పండగలు ఏర్పడినాయి. కోయలకు ఏడు గట్టులు (గోత్రాలు) ఏర్పడడం, వారు రేలపాటలు పాడటం, కోయల పుట్టుక, పూర్వీకుల పేరుతో చెట్ల వద్ద పూజలు చేయడం, రేల పాటలు, సంగీత వాద్యాలు మొదలైన సంప్రదాయాలు ఏర్పడడానికి కారణాలు ఈ కోయ పురాణ కథ ఆధారంగా తెలుస్తున్నాయి.

ఖమ్మం వరంగల్ జిల్లాలలో నివసిస్తున్న కోయల సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఇక్కడి కొమ్ము కోయలు ప్రదర్శించే కొమ్ముకోయ నృత్యం ఎంతో విశిష్టమైనది. ప్రాచీనమైన ఈ కళ భూమిపండుగ వ్యవసాయ పండగల సందర్భంగా ఆవిర్భవించింది. చక్కగా వర్షాలు పడి మంచి పంటలు పండాలని కోయలు దేవతలను ప్రార్థిస్తూ, కొమ్ము కోయ నృత్యం చేస్తారు.

కోయల సంస్కృతి

తెలంగాణలో నివసించే గిరిజనుల్లో కోయలు ఒక ప్రధానమైన జాతి అని చెప్పవచ్చు. వీరు ఖమ్మం, వరంగల్ జిల్లాలలో అధికంగానూ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో స్వల్పంగాను నివసిస్తున్నారు.

71