Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. నాల్గవ గోత్రం వారు 3, 5, 6 గోత్రాల వారిని వివాహం చేసుకుంటారు. 5వ గోత్రం వారు 3, 4,6, 7 గోత్రాల వారిని వివాహం చేసుకుంటారు. ఆరవ గోత్రం వారు 3, 4, 5, 7 గోత్రాల వారిని వివాహం చేసుకుంటారు. ఏడవ గోత్రం వారు 3,5,6, గోత్రాల వారిని వివాహం చేసుకుంటారు. అంటే సగోత్రీకులలో వివాహ సంబంధాలు ఉండవు . అంతేగాక నాలుగవ గట్టు, ఏడవ గట్టు వారు తోడుతమ్ములు అయ్యేవారు కనుక వారి మధ్య వివాహ సంబంధం ఉండదు. కోయలలో ప్రతి గోత్రానికి ప్రత్యేకించి వారివారి “కులదేవర” ఉంటుంది. ప్రతి గోత్రం వారు తమ దేవుళ్ళు దేవతలు వేరే వేరే కలిగి ఉంటారు. వారిని “పంక్” అని వాళ్ళ భాషలో అంటారు.

2కోయ సంస్కృతి మూలాలను తెలిపే కోయ పురాణ కథ ఒకటి కోయ జాతిలో ప్రసిద్ధంగా ఉంది. సృష్టి అంతా జలమయంగా ఉన్నప్పుడు ఏకో ఆదినారాయణుడు ఒక్కడే ఉన్నాడు. అతడు తన శరీరాన్ని రెండుగా చీల్చి ఒక భాగాన్ని స్త్రీ రూపంలో ఆదిశక్తిగా మార్చాడు. ఆదినారాయణుడు తన రెండవ భాగమైన పురుషునితో కలిసి నరలోక సృష్టి చేయమని ఆదిశక్తిని అడుగుతాడు. అందుకు ఆదిశక్తి మన ఇద్దరిదీ ఒకే శరీరం కనుక మనం అన్నా చెల్లెళ్ళం అవుతాం. కాబట్టి నీవు నీటిలోపలకు పోయి కపిల మహాముని నామంతో తపస్సు చేసి నీ నాభినుండి ఒక తామర పువ్వుని సృష్టించు, అందులో నేను కోడి రూపంలో గుడ్డు పెడతానని చెప్పింది. ఏకో ఆదినారాయణుడు అలాగే చేశాడు. ఆమె కోడి రూపంలో మూడు గుడ్లు పెట్టింది. అందులో మొదటిగుడ్డు పగిలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు. రెండవ గుడ్డు నుండి కార్తీకరాజు పుట్టాడు. ఇతడే గిరిరాజు లేదా కోయభూంకరాజు. మూడవ గుడ్డు నుండి పంచభూతాలు, అన్ని గ్రహాలు, అరణ్యాలు, అన్ని జీవరాసులు ఉద్భవించాక. గిరిరాజు కొండ ఎక్కినాడు.

ఆదిశక్తి మొదట పుట్టిన త్రిమూర్తు లను పెళ్లి చేసుకోమని అడిగింది. ఆమె చేతిలో కమండలం వెండిబెత్తం, చిత్రకన్ను అనే మూడువస్తువులు ఉన్నాయి. త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు నీవు మాకు జన్మనిచ్చిన తల్లివి కాబట్టి వివాహం చేసుకోలేము అన్నారు. ఆదిశక్తి తన చేతిలోని చిత్రకన్నుతో వారిని భస్మం చేసింది. అది చూచి శివుడు వాళ్ళిద్దరిని బ్రతికిస్తే వివాహం చేసుకుంటానన్నాడు. అప్పుడు ఆమె కమండలంలోని నీళ్లు చల్లి ఈ వెండి బెత్తం తాకిస్తే బ్రతుకుతారని చెప్పింది. అయితే నీవు సముద్రంలో స్నానం చేసి వస్తే వివాహం చేసుకుంటానని శివుడు చెప్పాడు. వెంటనే తన దగ్గర ఉన్న కమండలం, వెండి బెత్తం, చిత్రకన్ను శివుని చేతికి ఇచ్చి సముద్ర స్నానానికి ఆదిశక్తి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చే లోపల శివుడు కమండలంలోని నీళ్లు చల్లి వెండిబెత్తం తాకించి బ్రహ్మా విష్ణు లను బతికించాడు. ఆదిశక్తి స్నానం చేసి వస్తుండగా శివుడు చిత్రకన్నుతో ఆమెను కాల్చి బూడిద చేసాడు. అందులో కొన్ని వెంట్రుకలు కాలిపోకుండా నీటిలో పడి జలగలుగా మారాయి.

శివుడు ఆదిశక్తి బూడిదను నాలుగు భాగాలు చేసి వాటి మీద నీళ్లు చల్లి బెత్తం తాకించగా సరస్వతి లక్ష్మి పార్వతి జన్మించారు. వచ్చి వారి ముగ్గురిని త్రిమూర్తులు వివాహం చేసుకున్నారు. నాలుగవ బూడిద కుప్ప నుండి గిరిరాజు వచ్చాడు. మరి నాకు భార్య కావాలి కదా! అన్నాడు. అదిగో నీటిలో నీ భార్య ఉందని చెప్పి వాళ్లువెళ్ళిపోయారు. నీటిలో ఆదిశక్తి అందమైన స్త్రీ రూపంలోను మత్స్య రూపంలోను రకరకాల రూపాల్లో తిరుగుతూ కనిపించింది. గిరిరాజు గాలం వేసి ఆమెను పట్టాలని ప్రయత్నించి నీటిలో పడిపోయాడు. అప్పుడు ఆదిశక్తి గిరిరాజు నీటి పైకి వచ్చేసరికి వాళ్లకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ అమ్మాయి పేరు రేణుక. ఆ తర్వాత వారికి వంద మంది పిల్లలు పుట్టారు. వారంతా కోయ జాతికి చెందిన వారే. ఆదిశక్తి వంద మంది పిల్లలకు పాలు ఇవ్వలేక గిరిరాజుని నీవే వారిని పెంచుకోమని చెప్పి వెళ్ళింది. గిరిరాజు పిల్లలను తీసుకొని అడవికి పోయాడు. అడవిలో ముందు నడిచే పిల్లలు పండ్లు తింటూ వెళ్లారు. వెనకబడిన వారు చెట్ల కొమ్మలు విరుచుకొని తింటూ వెళ్లారు. అలా రొట్టలు (చిన్న కొమ్మల ఆకులు) తిన్నవారు కాబట్టి వారిని “రొట్టకోయతూర్” అని పిలిచారు. చివరికి గిరిరాజు కూడా వాళ్లను పోషించలేక పెద్ద

70