Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

04. తెలంగాణ గిరిజనులు కోయలు

తెలంగాణ రాష్ట్రంలో కోయజాతి ప్రధానమైనది. వీరు ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నివసిస్తున్నారు. కొందరు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లోను అక్కడక్కడ ఉన్నారు. వీరి నివాస ప్రాంతాల్లో ప్రవహించే నదులు గోదావరి శబరి నదులు ఇవి. వీరి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక జీవనంపై ప్రభావం చూపుతున్నాయి. కోయలు తమకు తాము 'దొరలసట్టం' అని, 'పుట్టు దొరలు' అని చెప్పుకుంటారు. కోయలు తాము 'కోయతూర్' ల మని తమ భాషలో చెప్పుకుంటారు. అంటే పర్వతాల మీద నివసించువారు అని అర్థం.

ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలలో నివసించే కోయవాళ్లు తమ భాషను మర్చిపోయి. తెలుగును మాతృభాషగా అలవర్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న కోయలు మాత్రం తమ కోయ భాషను మాట్లాడుతున్నారు. దాన్ని 'చెట్టుభాష' లేదా 'గాలిభాష' అని కూడా అంటారు. అంటే చెట్టు కింద నివసించేవారిభాష లేదా అరణ్యంలో నివసించేవారిభాష అని అర్థం.

ఆదిమ జాతులలో ప్రత్యేకమైన జీవనశైలి కలిగిన తెగల్లో కోయ జాతి ప్రముఖమైంది. వీరు పూర్వం కోయరాజులుగా కోయదొరలుగా ఉండేవారని చత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన వారుగా వీరిని చెప్పుకుంటారు. కాలక్రమేణా వీరు అక్కడనుండి ఇతర అటవీ ప్రాంతాలకు విస్తరించడం జరిగిందని, వారి సంస్కృతి సంప్రదాయాలు అక్కడవేనని, వారు తమ గురించి చెప్పుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో కొండలు, కోనలు, దట్టమైన అడవులు, సెలయేళ్లు, పక్షులు, జంతువులతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఖమ్మం జిల్లా ఆదివాసులైన కోయలకు నిలయంగా ఉన్నది.

1ఈ ఆదివాసులలో ఉన్న ఒక విచిత్రమైన ఆచారం వల్ల వీరికి కోయలు అనే పేరు ఏర్పడడానికి కారణమైందని చెప్తారు. వీరు తమ పూజ గదిలో కోడిని కత్తితో కోయకుండా నేలకేసి కొట్టి బలి ఇస్తారు కాబట్టి వీరిని కొయ్యని వారు లేదా కోయవారుగా పిలుస్తారని ఒక నానుడి. అంతేగాక కొయ్య నుండి కోయ పదం ఏర్పడిందని ప్రసిద్ధి ఉంది. వీరు అడివిలోని చెట్ల కొయ్యలను తమ దేవతలుగా పూజిస్తారు కాబట్టి వీరు కోయలుగా పిలవబడుతున్నారని మరొక ప్రసిద్ధి ఉంది.

కోయలలో ఏడు గోత్రాల వారున్నారు. ఈ గోత్రాలను “గట్టు” అని అంటారు. మొదటి రెండు గోత్రాలవారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నారు. మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు గోత్రాల వారు తెలంగాణలో ఉన్నారు. మూడవది కాకేటి గోత్రం, నాలుగవది సనపగాని గోత్రం, ఐదవది బండాని గోత్రం, ఆరవది బెరంబోయేడు గోత్రం, ఏడవది పారేడు గట్టు గోత్రం. కొన్ని ప్రాంతాల్లో కోయలు తమ గోత్రాలను అంకెలుగా చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో వారి గోత్రనామాలు చెప్తారు.

కోయలు వివాహ సందర్భంలో ఈ గోత్రాలను కచ్చితంగా చూస్తారు. పండగల సందర్భంలో గోత్రాల ఆధారంగా చేసుకుని వేల్పులు, ఇంకా కొన్ని పండుగలు కూడా జరుపుకుంటారు. మూడవ గోత్రం వారు 4,5,6,7, గోత్రాల్లో

69