Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16నగారా:-మూకుడు లేదా గిన్నె ఆకారంలో తయారుచేయబడిన చర్మవాద్యాలు చాలా ఉన్నాయి. వీటిలో చిన్న పెద్ద ఆకారంలో ఉన్నవి చాలా కనిపిస్తాయి. గోండు ఆదివాసులు ఇలాంటి వాటిని “తుడుం” అంటారు. బంజారాలు మధురాలు "నగారా” అంటారు. ప్రాచీన కాలంలో దీన్ని "దుందుభి” అనేవారు. ఈ నగారా క్రింద వైపు చిన్నదిగాను పై వైపు పెద్దదిగాను ఉంటుంది. పై వైపు చర్మంతో బిగించబడి ఉంటుంది. దీన్ని కర్రలతోనూ చేతులతోనూ కూడా వాయిస్తారు. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ వాద్యం వాడుకలో ఉంది. అర మీటరు నుండి రెండు మీటర్ల వరకు పొడవు ఉండే నగారాలు ఉన్నాయి. అతి పెద్ద నగారాను “భేరీ” అంటారు. ఇది సంగీతానికి పనికిరాదు. పండగ ల్లోను, పూజలు జరిగే సందర్భాల్లోను దీన్ని వాడతారు.

పూర్వం యుద్ధ ప్రారంభంలో సంసిద్ధత కోసం దీన్ని మోగించేవారు. కోటల పైన కూడా దీన్ని మోగించేవారు. ఇప్పటికీ గోండులు, బంజారాలు నగారాన్ని వాడుతున్నారు.

17రబాబ్: రబాబ్ నాలుగు అంగుళాల పొడవు పది అంగుళాలు వెడల్పు ఉంటుంది. తలవైపు వెడల్పుగా ఉంటుంది. ఈ భాగం దగ్గరగల 'రెజనేటర్' కి పైన మేక లేదా గొర్రె చర్మం శుద్ధిచేసి మోగడానికి అనుకూలంగా అమర్చుతారు. దీన్ని “ఘొడి" అంటారు. ఈ వాద్యం రెండవవైపు సన్నగా ఉంటుంది. చివరన నాలుగు బుడిపెలను అమర్చుతారు. వీటితో శృతి చేసుకుంటారు. తంత్రులను బిగువు వదులు చేసుకునే వీలుంటుంది. వీటిని “మోన” అంటారు. ఈ కర్ర పుల్లలకు ఒక్కో దానికి ఒక్కో తీగను అమర్చుతారు. గొర్రె లేదా మేక పేగులను శుభ్రం చేసి ఎండబెట్టి తీగలుగా తయారు చేసుకుంటారు. వీరు ఇప్పటికీ ఇనుప తంత్రులు కాకుండా నరాలనే వాడుతున్నారు. ఈ తీగలను “సబాస్” అనే వింటి ఆకారం కలిగిన పుల్లతో వాయిస్తారు. సబాస్ తయారీలో జిల్లేడు కర్రను వాడతారు. ఇది మూడు నాలుగు అంగుళాల పొడవు ఉంటుంది. భారత దేశంలో ఈ వాద్యాన్ని కాశ్మీర్ లోనూ, వాడుతున్నారు. తెలంగాణ లోనూ నల్గొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వాయిస్తున్నారు. ఇలాంటి వాద్యం అరేబియా దేశంలోనూ, ఆఫ్గనిస్తాన్ లోనూ వాడుతున్నారు.

18సారంగి:- సారంగి 'లూటు' వాద్యం. దీన్ని ఉత్తర భారత దేశంలో హిందుస్తానీ సంగీత కచేరీలలో ఉపయోగిస్తున్నారు. సారంగి ఏకకాలంలో గిరిజన మరియు జానపద శాస్త్రీయ సంగీతాల్లో రాణించడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఎనిమిది మెట్లు కలిగి రెండు కర్రలు ఉన్న చెక్కతో తయారు చేసిన వాద్యం ఇది. దీనిపై గల తంత్రులను విల్లు ఆకారం గల కర్రతో వాయిస్తారు.

మృదు మనోహరమైన సంగీతం దీని ప్రత్యేకత. ఈ వాద్యం ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలోనే కనిపిస్తున్నది. భవిష్యత్తులో ఇది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

66