Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లంబాడీల సంగీతం

లంబాడీలు పండగలప్పుడు, దేవతార్చన సందర్భంలోనూ, నృత్య ప్రదర్శనల సమయంలోను, ఆచార వ్యవహారాల్లోనూ రకరకాల పాటలను పాడతారు. అవి ఎంతో అర్థవంతంగానూ, వారి సంస్కృతిని తెలిపే విధంగాను ఉండడం విశేషం. తెలంగాణలో బతుకమ్మ పండుగవలె లంబాడీలకు తీజ్ పండగ ఎంతో ముఖ్యమైనది. ఈ సందర్భంగా తీజ్ మొలకలకు బుట్టలో గోధుమలు చల్లేటప్పుడు, వాటికి నీరు పోసేటప్పుడు, మొలకలు వచ్చిన తర్వాత, లంబాడీస్త్రీలు పాటలు పాడతారు. మొలకలు వచ్చిన బుట్టలలో ఒక బుట్టను అన్నదమ్ములు దాచి పెట్టి ఏడిపించాలని చూస్తారు. అప్పుడు ఆడపిల్లలు పాడే పాట ఈ విధంగా ఉంటుంది.

6"నవనద దాడేరి భూకి రఖీయో,
తరసిరే బీయో, మార చెడకలి మన ద!
భాజీరో బాద మ కిది భీయో,
ఖ్వాడీరో బాద మ కిది భీయో,
మార చడకలి మన ద! ....

'అన్నలారా! తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నాము. దాహంతో ఉన్నాము. ఆకుకూరలు తింటున్నాము. కాబట్టి మీతో పోట్లాడే శక్తి మాకు లేదు. దయచేసి చెడకలి (బుట్ట) మాకు ఇవ్వండి' అని పై పాటలోని భావం.

తీజ్ పండగను కన్యల పండగగా చెప్తారు. కన్యలు ఎంతో నిష్టతో దీన్ని జరుపుకుంటారు. ఆ విషయం ఈ పాట ద్వారా తెలుస్తుంది.

62