లంబాడి/బంజారా నృత్యాలు
4లంబాడీ నృత్యం:- లంబాడీ జాతి స్త్రీలు లంబాడీ నృత్యాలు చేస్తారు. వీరు పురుషులు వాయించే డప్పుకు అనుగుణంగా నృత్యం చేస్తూ సంపదలను, మంచి పాడిపంటలను ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తారు. ఈ నృత్యం నాగార్జునకొండ సమీపంలోని అనుపు అనే గ్రామం దగ్గర ప్రారంభమైనట్లుగా చెప్తారు. లంబాడీల నృత్యంలో పురుషుల కంటే స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వీరి నృత్యం చాలా అద్భుతంగా చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే వారు ధరించే ఆభరణాలు, వస్త్రాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. వారి వస్త్రాలను అద్దాలు, పూసలు, గవ్వలు వంటి వస్తువులతో కుట్టి చాలా అందంగా తయారు చేసుకుంటారు. కడియాలు, దంతపు గాజులు మణికట్టు నుంచి మోచేతి వరకు వేసుకుంటారు. వీరు నృత్యం చేసేటప్పుడు ఆ గాజుల ధ్వని గలగల లాడుతూ వాళ్ళ నృత్యానికి లయాత్మకతను విశేషంగా అందిస్తుంది. దసరా దీపావళి హెూలీ వంటి పండగల సమయంలోనూ, పెళ్లి వేడుకలప్పుడూ వీరు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు తమ నిత్య జీవితంలోని పని పాటలను అనుకరిస్తూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. లయబద్ధంగా సాగే వీరి నృత్యానికి డప్పు దరువు తోడై ఉధృతమైనపుడు పురుషులు కూడ వారితో కలిసి నృత్యం చేస్తూ ఉంటే చూడముచ్చటగా కన్నులపండుగగా ఉంటుంది.
5మధుర బంజారాల నృత్యం:- తెలంగాణలో బంజారాలు లేదా లంబాడీలలో ఒక ఉపశాఖగా మధుర బంజారాలు కనిపిస్తారు. సంస్కృతి, జీవన విధానం అనే అంశాలలో బంజారాలకు మధురబంజారాలకు కొన్ని భేదాలు ఉన్నాయి. అందుకు వారు నివసించిన ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు ప్రధాన కారణం. ఈ మధుర బంజారాలు మొదట ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రాంతంలో నివసించేవారు. కాబట్టి ప్రాంతపు సంస్కృతి జీవన విధానం అనే అంశాలు వారిమీద ప్రభావం చూపించాయి. క్రీ.శ. 1708 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుండి మధుర బంజారాలు దక్షిణ దేశంలోని నాందేడ్ కు వలస వచ్చారు. వీరు తాము శ్రీకృష్ణుని వారసులమని చెప్పుకుంటారు. బంజారాలతో కొన్ని ఆచార వ్యవహారాల్లో అలంకరణల విషయంలో కూడ మధుర బంజారాలు కొంత భిన్నంగా ఉంటారు. వీరి నృత్య ప్రదర్శనకు కృష్ణాష్టమి ముఖ్యమైన రోజు. స్త్రీలు మాత్రమే ఆ రోజు నృత్యం చేస్తారు. ఇతర పండగల సమయాల్లో స్త్రీ పురుషులిద్దరు దండరాసకం నృత్యం చేస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పాదాలను వెనుకకు ముందుకు కదుపుతూ మధ్య మధ్యలో గుండ్రంగా తిరుగుతూ లయబద్ధంగా కోలాటం (దాండియా) నృత్యం చేస్తారు. స్త్రీల అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. వారు తమ తలపై ముడి వేసుకొని దానిలో ఒక కర్రపుల్లను పెట్టుకొని చుట్టు కుంటారు. దాన్ని “చుండియా” అంటారు. దీన్ని బట్టి వాళ్లకు కొప్పు బంజారాలు లేదా కొప్పు లంబాడీలు అని పేరు వచ్చింది. ఆ కొప్పు మీద వారు తమ కొంగును కప్పుకుంటారు. ఇది గోపికలను గుర్తు చేస్తుంది. పురుషులు తలపై తలపాగాను ధరించి పంచ చొక్కాలను కట్టుకుంటారు. స్త్రీలు పొట్టి లంగాలను పొడవైన అంగీలను ధరిస్తారు ఇదే బంజారా నృత్యాలకు మధుర బంజారాల నృత్య అలంకరణలో ఉండే ప్రధానమైన భేదం.
61