Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుంచే మానవుడు వ్యవసాయాన్ని తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను కనుగొన్నాడు. దాంతో స్థిర జీవనం ప్రారంభమైంది. సంచార జీవన జాతిగా (Nomadic Tribe) ఉంటూ ఇతర జంతువులతో పాటు పోటీపడుతూ ఆహారాన్ని సమీకరించు కుంటూ వెళుతున్న మానవుడు నిప్పును కనుక్కొని నిప్పులో ఉండే విశేష గుణాలని కనుక్కొని, ఆ తర్వాత వ్యవసాయాన్ని, చక్రాన్ని కనుక్కున్న తర్వాత మనం చూస్తున్న నవీన మానవుడిగా రూపాంతరం చెందడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసుకొన్నాడు.

ఇలాంటి ఎన్నో యత్నదోష అభ్యసనల (Trial and Errors) ఫలితంగా మరెన్నో ప్రయోగాలు, మరెన్నో వైఫల్యాల ఫలితంగా మానవుడు తనని తాను తెలుసుకున్నాడు. శీతోష్ణ స్థితి నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి, ఎండ వానల నుంచి, జంతువుల నుంచి, తన సాటి మానవుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి, తన ఉనికిని కొనసాగించడానికి కావలసిన రక్షణ యంత్రాంగాన్ని క్రమక్రమంగా రూపొందించుకున్నాడు. అది చెట్ల మీద గృహాలు రూపం నుంచి మొదలుకొని ఆ తర్వాత నేలపై ఇళ్ల నిర్మాణం దాకా కొనసాగింది. ఆ క్రమంలోనే ఒకే జాతికి సంబంధించిన, ఒకే లక్షణాలతో కూడిన మనుషులందరూ ఒక చోట ఒక్కటిగా ఉంటూ సామూహిక జీవనం కొనసాగించడం ప్రారంభమైంది.

అందరూ కలిసి కట్టుగా ఒకే నిర్ధిష్ట ప్రదేశంలో జీవించడంవల్ల అందరి ప్రయోజనాలు పరిరక్షించబడడం, అన్నిటినీ మించి ప్రాణాలకు భద్రత లభించడం వల్ల సాముదాయిక జీవనం (Collective Life), తెగ జీవనం, ప్రారంభమై ఆ తెగలకీ గుర్తింపుగా “జాతి చిహ్నాలు” (Totems) మొదలయ్యాయి. ప్రతి గిరిజన తెగ తమని తాము గుర్తుంచుకోవడానికి, ఇతర తెగల కంటే విభిన్నంగా కనిపించటానికి ఆహారంలో, ఆభరణాలలో, అలంకరణలో, మతవిశ్వాసాలు, పూజా విధానాలలో, అలాగే ఆయుధాలు, గృహనిర్మాణం విషయాల్లో ప్రత్యేకతని కనబరుస్తూ వెళ్లారు. దాంతోపాటు తమని గుర్తించుకోవడానికి ఏదో ఒక జంతువును ప్రతీకగా ఆపాదించుకోవడం మొదలెట్టారు. అవే “జాతి చిహ్నాలు”గా మారాయి. అంటే ఆదిమ జాతులు సింహం, పులి, పాము, గ్రద్ద, పావురం మొ॥ పశు పక్ష్యాదులను ఆ చిహ్నాలుగా గుర్తించి తమ మెడలో వేసుకునే హారాలలోనో, ఆయుధాల పిడి భాగాలలోనో, దేహాలపై పచ్చబొట్లుగానో పొడిపించుకుని తమ జాతి గుర్తింపును (Identity)ని, ఇతర ఆదిమ జాతులతో విభిన్నతను ప్రదర్శించారని మానవశాస్త్రం, సామాజికశాస్త్రాల అధ్యయనాల్లో వెల్లడి అయింది.

అలా మొదలైన ఆదిమ జాతి మానవ జీవన ప్రస్థానం క్రమక్రమంగా తెగల(Tribes) నుంచి గణ రాజ్యాలుగా (Tribal States), రాజ్యాల నుంచి దేశాలుగా ఎదిగింది. అయినప్పటికీ ఇప్పటికీ మానవుడి లోని ఆదిమ జాతి లక్షణాలు ఇంకా పోలేదు. ఆనాటి ఆదిమ మానవుడు సహజాతాల(Instincts) ప్రాతిపదికగా తన జీవనాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ సహజాతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భావోద్వేగాలు మరింతగా విస్తరించినప్పటికీ, జ్ఞానం, తర్కం, విశ్లేషణం, సృజన, ప్రజ్ఞ మరెన్నో మానసిక మేధోపరమైన అంశాలూ (Cognitive Abilities) మానవుడి జీవనానికి తోడైనప్పటికీ, ఆదిమ జాతి గుణగణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీని వెనక ఉన్న ప్రధాన కారణం ఆదిమ జీవితంలోని సహజాతాలే! అలాంటి ఆదిమ జీవన సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలుస్తున్న సంస్కృతులు, మరెన్నో మనకి ఇప్పటికీ మన నిత్యజీవితంలో కనిపిస్తాయి.

11