లంబాడీల సంస్కృతి
లంబాడీల సంస్కృతి విలక్షణమైనది. వీరి జీవన విధానం, వేషధారణ, ఆహారం అలవాట్లు, గృహ నిర్మాణం, రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయ వ్యవస్థలు, భాష, సంస్కృతి ప్రత్యేకంగా ఉంటాయి. వీరు ఇతర సమాజాలతో తక్కువ సంబంధం కలిగి ఉంటారు. 3 3(a). జీవన విధానం:- పూర్వం లంబాడీలు సరుకుల రవాణాను ప్రధాన వృత్తిగా కలిగి ఉండేవారు. వీరు ఆహార ధాన్యాలు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు రవాణా చేసేవారు. రవాణాకు ఎద్దులను, గుర్రాలను, ఒంటెలను, ఉపయోగించేవారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు రోడ్లు, రైలు మార్గాలను ఏర్పాటు చేసి వాణిజ్యాన్ని అభివృద్ధి పరచడంవల్ల భారతదేశం అంతటా వ్యాపించిన లంబాడీలు ఎవరికి వారు వాణిజ్యాలను వదిలి గుంపులు గుంపులుగా తమకు అనుకూలమైన ప్రదేశాల్లో స్థిరపడ్డారు. వాణిజ్య వృత్తిని వదిలిపెట్టి వ్యవసాయం, పశుపోషణ ప్రధాన వృత్తిగా చేపట్టారు. నదీతీరాల్లోను, కొండవాలు ప్రాంతాల్లోనూ చిన్న చిన్న గుంపులుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇలాంటి గుంపుని “తండా” అంటారు. ఈ తండా పదాన్ని అక్బర్ పాదుషా 16వ శతాబ్దంలో బెనారస్ సమీపంలోని బంజారాల నివాసాన్ని తండా అని పేర్కొన్నట్లు చెప్తారు. తండా చిన్న గ్రామాన్ని పోలి ఉంటుంది. లంబాడీలు అటవీ ప్రాంతంలో ఇతర కులాలకు దూరంగా తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. పరిమిత స్థలంలో తమకు అనుకూలంగా భూమిని చదును చేసుకుని, దీర్ఘ చతురస్రాకారంలో గుడిసెలను నిర్మించుకుంటారు. ఇంటి పై కప్పును వరిగడ్డి లేదా జొన్న చొప్ప లేదా సజ్జ చొప్పతో కప్పుతారు. ఇంటికి ఎడమవైపు గానీ లేదా ఎదురుగా కానీ పశువుల కొట్టాలను నిర్మించు కుంటారు. ఇంటికి మూడు వైపులా రాళ్లతో గోడ కట్టి మట్టితో నునుపుగా చేసుకుంటారు. ఇంటి ముందు వైపు కర్రలతో పందిరి వేసుకుంటారు.
ఆహారం:- లంబాడీలు ప్రధానంగా మాంసాహారులు. వీరు మాంసాహారంతో పాటు ఆకుకూరలు ఎక్కువగా తింటారు. వీరు ముఖ్యంగా జొన్న, సజ్జ రొట్టెలను ఇష్టంగా తింటారు. వీరికి అత్యంత ఇష్టమైన వంటకం జొన్న అన్నం, సజ్జ అన్నం . సజ్జలను కడిగి వండిన అన్నం వీరికి ఎంతో ఇష్టమైనది. వీరు పండుగ పబ్బాలలో బెల్లంతో వరి అన్నం కలిపి చేసిన పాయసాన్ని ప్రత్యేకమైన వంటకంగా తింటారు. వీరు పశుపోషకులు కాబట్టి పెరుగు, మజ్జిగ, నెయ్యి,పాలు వీరి ఆహారంలో భాగంగా ఉంటాయి. లంబాడీలు మాంసం కూరను, మాంసంలో రక్తం కలిపి వండిన కూరను, కీళ్లు ఎముకలతో కలిపిన మాంసం కూరను ముఖ్యంగా తింటారు. లంబాడీలు ప్రతి పండుగకు, ప్రత్యేక ఉత్సవాలకు, పంచాయితీకీ మద్యం సేవిస్తారు. వివిధ రకాల మద్యాలను వీరే తయారు చేసుకుంటారు. ఇప్పపువ్వుసారా, బెల్లం సారా, తాటికల్లు, ఈత కల్లు వీరి మద్యపానంలో ముఖ్యమైనవి. వీరికి చుట్ట బీడీ ధూమపానం అలవాట్లు కూడా ఉంటాయి.
వస్త్రధారణ:- లంబాడీల వస్త్రధారణ ప్రత్యేకంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటుంది. యువకులు ముసలివాళ్ళు అందరూ ఒకే రకంగా వస్త్రధారణ చేస్తారు. పురుషులు సామాన్యంగా క్రింద ధోతిని పైన చొక్కాను ధరిస్తారు. తలకు ఎర్రటి తలపాగాను ధరిస్తారు. అది తలను పూర్తిగా చుట్టినట్టు కనిపిస్తుంది. లంబాడీ పురుషులు పూర్తిగా రాజస్థానీ పురుషులవలె వస్త్రధారణ చేస్తారు. లంబాడీ స్త్రీలు రవికను ఛాతి భాగానికి, లంగాను నడుముకు, పవిటను తల శరీర భాగాలను కప్పే విధంగా ధరిస్తారు. ఈ మూడు వస్త్రాలను ఎరుపు, నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ రంగులతో సమ్మిళితం చేసి అందంగా కుడతారు. స్త్రీల వస్త్రాలపై చతురస్రాకారపు, వృత్తాకారపు అద్దపుముక్కలను అలంకరణగా కుడతారు. ఇలా రంగులమయంగా ఉండే వారి వస్త్రాలు చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
54