Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిచిన దాన్ని కుండ అంటారు. తాళ్లతో చర్మాన్ని బిగించిన తర్వాత కుండ అడుగు బాగాన కుదురుగా తాడును లాగి చుడతారు.

15గజ్జెలు:-గజ్జెలను నృత్యం చేసేటప్పుడు కాళ్లకు కట్టుకుంటారు. ఇవి గుత్తిగా గుండ్రంగా తాడుకు బిగించబడి ఉంటాయి. వీటిని కాళ్లకు కట్టుకున్న నృత్య కళాకారులు ఎవరైనా వీటి ధ్వనికి రెట్టింపు ఉత్సాహంతో నృత్యం చేస్తారు.

16నాగస్వరం:-చెంచులు నాగదేవతను పూజిస్తారు. ఎందుకంటే శివుని కంఠాభరణం నాగం అని అది ప్రత్యక్ష దేవత అని వారి భావన. వీరు నాగకాయ అంటే సొరకాయను ఎండబెట్టి కొన భాగాన్ని కత్తిరించి దానికి సన్నాయి వెదురు పుల్లలను తొడిగి అంచుల వెంట గాలిపోకుండా మైనాన్ని అంటిస్తారు. చెంచులు పెళ్లిళ్ల సమయంలో పుట్టమన్ను తేవడానికి వెళ్లే సందర్భంలో దీన్ని వినసొంపుగా ఊదుతారు.

17ఢమరుకం:-శివుడు బిక్షాటనకు వెళ్ళునప్పుడు, నృత్యం చేసేటప్పుడు ఢమరుకాన్ని మోగిస్తాడని చెంచులు నమ్ముతారు. చెంచులు తాము శివుని సంతానంగానే భావిస్తారు. గిరిజ పర్వతరాజు పుత్రిక. అంటే ఆమె గిరిజన స్త్రీ అని వారి భావన. చెంచులు శివునికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు ఢమరుకాన్ని మోగిస్తారు. ఢమరుకాన్ని మోగిస్తే “ఢంఢం” అని శబ్దం వస్తుంది కాబట్టి దాన్ని ఢమరుకం అని అంటారని చెంచులు చెప్పారు. తమ ఇష్ట దైవమైన శివునికి, భైరవునికి, గారెల మైసమ్మకు, ఈరమ్మకు, ఈదమ్మకు పూజలు చేసే సమయంలోను చెంచులు ఢమరుకాన్ని మోగిస్తారు. చర్మవాద్యాల్లో అతి చిన్నవాద్యం ఢమరుకం

ఒక చిన్న కొయ్యను తెచ్చి, దాన్ని తొలిచి మధ్యలో సన్నంగాను చివరల వెడల్పుగాను చెక్కుతారు. చిన్న కొయ్య ముక్కను లోపల వేసి రెండు వైపులా మేక చర్మంతో మూసివేస్తారు. రెండు చివరలను గట్టిగా తాడుతో బిగిస్తారు. దీన్ని కదిలించినప్పుడు ఢంఢం అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం వచ్చినప్పుడు కొందరు చెంచు భక్తులకు పూనకం కూడా వస్తుంది. ఈ వాద్యానికి ఝర్జర అని మరొక పేరు కూడా ఉంది. శివుడు ఝర్జరను కలిగిన వాడు కనుక ఆయనకు ఝర్జరి అనే పేరు వచ్చింది.

18జేగంట:-తెలంగాణ ప్రాంతంలో చెంచులు జే గంటను శాయిస్తారు. ఇది వీరి ప్రాచీన సంప్రదాయానికి చెందిన వాద్యం. ఇతర ప్రాంతాల్లోని చెంచులు దీన్ని వాడటం వదిలివేశారు. ఇది కంచుతో చేయబడిన గుండ్రటి వాద్యం. దీన్ని చేత్తో పట్టుకొని అదే చేతితో ఒక కర్ర ముక్కతో కొడుతూ చెంచులు భిక్షాటన చేస్తారు."చే గంట” కాలక్రమంలో జేగంటగా మారిందని కొందరు చెబుతున్నారు. “జయ” శబ్దసూచకంగా మోగించేది జేగంట అనే అర్థం కొందరు చెప్తున్నారు. జే గంటతోపాటు వీరు మెడలో ఒక గంటను కట్టుకుంటారు. మరొక చేతిలో పిల్లనగ్రోవిని పట్టుకుంటారు. ఈ మూడు వాద్యాల సమ్మేళనంతో వీరు ప్రత్యేకమైన సంగీత ధ్వనిని సృష్టిస్తారు.

49