తరఫు వారికి ప్రాధాన్యం ఇవ్వరు. కష్టాల్లో తల్లి తరఫు వారు ఆదుకుంటారని వీరి నమ్మకం.
చెంచుల వివాహ పద్ధతిలో పెళ్లి కూతురు పెళ్లికొడుకుకు బదులుగా రెండు బాణాలను భూమిలో పాతిపెట్టి పూజారి వాటికి వివాహం జరిపిస్తాడు. తర్వాత వధూవరులకు బాసికాలుకట్టి మద్దెల, తప్పెట్లు దరువులతో వెండి లేదా బంగారుతో చేసిన పుస్తెను కట్టిస్తారు. పెండ్లి వధువు ఇంటి వద్దనే జరుగుతుంది. వివాహం ఉదయం 11 -12 గంటల మధ్య జరుపుతారు. రాత్రి సమయంలో వివాహం జరుపుకోరు. అది కీడు అని వీరు నమ్ముతారు. వివాహాన్ని స్త్రీలు కూర్చుని చూస్తారు. పురుషులు నిలబడి చూస్తారు. వివాహం అయిన తర్వాత అందరూ భోజనాలు చేసి మద్యం సేవించి డప్పు శబ్దానికి నృత్యం చేస్తారు.
చెంచులలో విడాకులు పెద్దల సమక్షంలో ఇప్పిస్తారు. విధవా పునర్వివాహం వీరిలో ఉంది. అన్న చనిపోతే తమ్ముడు అతని భార్యను వివాహం చేసుకుంటాడు. తమ్ముడు చనిపోతే అతని భార్యను అన్న చేసుకుంటాడు. వారి పిల్లలను తమ పిల్లలుగా భావిస్తారు. పురుషులు ఇద్దరు ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. అక్రమ సంబంధాలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. నేరం రుజువైతే కాళ్ళకు, చేతులకు బాణాలతో గుచ్చటం, నిప్పులపై నడిపించడం వంటి శిక్షలు ఉంటాయి. చెంచులలో ప్రేమ వివాహాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి ఎలాంటి ఆస్తులు ఉండవు. కాబట్టి ధనిక పేద తారతమ్యాలు వీరికి లేవు. ఎవరు ఎవరిలో ఏమి చూసైనా ప్రేమించ వచ్చు.
అంత్యక్రియలు:- చెంచులు మరణాన్ని ఒక సాధారణ ప్రక్రియగా భావిస్తారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ శరీరం విడిచి భగవంతుని చేరి పోతుందని నమ్ముతారు. వీరిలో మృత శరీరాన్ని పూడ్చడం లేదా దహనం చేయడం అనే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి రక్తసంబంధీకులందరికీ తెలియజేస్తారు. ఆ తర్వాత మృత శరీరానికి స్నానం చేయించి శరీరమంతా పసుపు పూసి, సున్నం తో ముఖం మీద మూడు నామాలు పెట్టి, తలపై కొబ్బరి నూనె అంటి తల దువ్వి, శవంపై సాబ్రాణి చిలకరించి, ఆపైన వస్త్రాన్ని కప్పుతారు. వెదురు కట్టెలతో పాడిని నిర్మించి, దానిమీద శవాన్ని మోసుకుని, చెంచు నివాసాలకు దూరంగా ఉండే స్మశాన వాటికకు తీసుకుని వెళతారు. స్త్రీలు స్మశాన వాటికకు వెళ్లరు. అంత్యక్రియలు జరిగినరోజున చెంచులు భోజనం చేయరు. మరునాడు చనిపోయిన వ్యక్తి ఆత్మకు, అంత్యక్రియల్లో పాల్గొన్నవారికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. మూడవరోజు, పదవరోజు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వంశీకులందరికీ శుద్ధి కార్యక్రమం జరిపిస్తారు.
43