మారుపేర్లతో పిలుచుకుంటారు. శివరాత్రి రోజును వీరు అతి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినాన వీరు ఎక్కడ ఉన్నా స్వామి దర్శనానికై తమ ఆవాసాలనుండి కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. పిల్లపాపలతో పాటు నడవలేని ముసలివారు కూడా కొండలు, గుట్టలు దాటుకొని వెళ్లి శ్రీశైలేశుని దర్శించుకుంటారు. రెడ్డిరాజులు చెంచులతో శ్రీశైలేశునికి ప్రథమ పూజ చేయించేవారని ప్రసిద్ధి. చెంచులు శివరాత్రికి స్త్రీ పురుషులు కలిసి నృత్యం చేస్తారు.
శ్రీశైలానికి రోడ్లు బస్సులు లేని కాలంలో భక్తులు కాలినడకన వెళ్లి మల్లికార్జునస్వామి దర్శనం చేసుకొనేవారు. ఎంత త్వరగా నడిచినా రానుపోను శ్రీశైలానికి అడవిలో నాలుగు రోజులు నడక ఉండేది. ఆ సమయంలో అడవిలో ప్రయాణించే భక్తులు క్రూరమృగాల బారిన పడకుండా చెంచులు సహాయం చేసేవారు. దీన్ని వారు మల్లన్న సేవగా భావించేవారు. వీరు ముసలివాళ్లను, నడవలేని వాళ్లను డోలీలలో మోసుకొని పోయేవారట. అలాగే చెంచులు లక్ష్మీనరసింహ స్వామిని కులదైవంగా పూజిస్తారు. చెంచులక్ష్మిని వీరు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. చెంచులుమాత్రమే పూజించే దైవం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న సలేశ్వర స్వామి. చెంచుల అధీనంలో ఉండే ఈ సలేశ్వరం పుణ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలంలో ఉంది. సలేశ్వర పుణ్యక్షేత్రానికి ప్రయాణం వేలాది అడుగుల లోతైన లోయలో ఇరుకైన కొండదారులపై సాగుతుంది. ఇక్కడ ఏటా చైత్ర పూర్ణిమనాడు ఉత్సవాలు జరుగుతాయి. స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చెంచులు 'వాలంటీర్ల' వలె చూసుకుంటారు. ఈ ఆలయానికి చెంచుపూజారి ఉంటాడు. దీనికి వచ్చే ఆదాయాన్ని చెంచులే తీసుకుంటారు.
విశ్వాసం:- చెంచులు వేటకు పోయేటప్పుడు "లింగమయ్యా! మాకు వేట బాగా దొరికే టట్లు దీవించు నీకు నైవేద్యం సమర్పించు ఉంటాము” అని ప్రార్ధించి బయలుదేరుతారు. అలాగే అడవిలో ఎటువంటి క్రూరమృగం మా కంట్లో పడకూడదు, క్రూరమృగం కంట్లో మేము పడకూడదు అని దేవుని ప్రార్థిస్తే ఆ మహాదేవుడు వీరిని రక్షిస్తాడని ప్రగాఢ విశ్వాసం. చెంచులు ఇంట్లోకూడా గుండ్రటి రాళ్ళకు పసుపు కుంకుమ పెట్టి శివయ్య గా భావించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు.
e). ఆచార వ్యవహారాలు:-
జననం:- పిల్లలు పుట్టడం దేవుని దీవెనగా చెంచులు భావిస్తారు. వీరికి ఆడ మగ పిల్లల భేదం లేదు. ఇద్దరినీ సమానంగా భావిస్తారు. గర్భిణీ స్త్రీలకు అడవిపంది మాంసం హాని కలిగిస్తుందని నమ్ముతారు. మిగిలిన ఆహార విషయంలో ఏ నిబంధన లేదు. రోజువారి పనులు చేసుకుంటే సుఖ ప్రసవం అవుతుందని నమ్ముతారు. చెంచులలో పిల్లలకు నామకరణం చేయడం వివిధ రకాలుగా ఉంటుంది. పిల్లలు పుట్టక ముందే దేవతల పేర్లు పెట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు పుట్టిన నాల్గవ రోజున, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగైదు సంవత్సరాల తర్వాత పేర్లు పెట్టడం కూడా కనిపిస్తుంది.
వివాహం:- చెంచుల పెండ్లి వయస్సు సగటున 14 సంవత్సరాలు. పెళ్లిళ్లు చెంచుల మధ్యనే జరుగుతాయి. ఇంటి పేరు, గోత్రాలు ఆధారంగా పెళ్లి సంబంధాలు నిర్ణయం అవుతాయి. చెంచులలో 26 గోత్రాల వారు ఉన్నారు. అవి ఎక్కువగా చెట్లు, జంతువుల పేర్లుగా ఉంటాయి. ఉదాహరణకు నిమ్మల (నిమ్మ చెట్టు), పులిచర్ల (పులి), ఉడతల మొదలైన విధంగా ఉంటాయి. చెంచులది పితృస్వామ్య వ్యవస్థ. పెండ్లి అయిన వెంటనే ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళాలి. ఇల్లరకం అరుదుగా కనిపిస్తుంది. వీరిలో వోలి సంప్రదాయం ఉంది. వీరు తల్లి తరఫు వారికి ప్రాధాన్యం ఇస్తారు. తండ్రి
42