Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్త్రధారణ:- చెంచులు అసలు బట్టలు ధరించే వారే కాదని ఆకులు చుట్టబెట్టుకునే వారని ఫరిష్టా (17 శతాబ్దం) వ్రాశాడు. 1886లో వ్రాసిన కర్నూలు గెజిటెడ్ రికార్డ్స్ లో చెంచులలో మగవాళ్ళు చిన్న గుడ్డను మొలకు కప్పుకునే వారిని, ఆడవాళ్ళు చీర రవిక ధరించే వారని వ్రాశారు. తెలుగు సాహిత్యంలో కూడా చెంచులు పారుటాకులు (పండిన ఆకులు) కట్టుకున్నట్లుగా ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ చెంచులలో మగవాళ్ళు ముందుకు కొంత గుడ్డ వేలాడే విధంగా గోచిగుడ్డను మొలతాడుకు బిగించి కట్టుకుంటారు. ఎందుకంటే అడవిలో తిరిగేటప్పుడు అవి చెట్ల ముళ్లకు చిక్కుకొని చినిగి పోతాయని వాళ్ళు అంటారు.

ఆభరణాలు:- పేదరికం వల్ల చెంచులు ఆభరణాలను ఎక్కువగా ధరించరు. స్త్రీలు వెండి లేదా రాగి దుద్దులు, ఉంగరాలు, మెడలో పూసల దండలు, కాలికి మెట్టెలు, ముక్కుపుడక ధరిస్తారు.

b). ఆర్థిక పరిస్థితి

నల్లమల అడవుల్లో వ్యవసాయ భూమి చాలా తక్కువ కాబట్టి చెంచులు ఎక్కువగా అటవీ సంపదపై ఆధారపడతారు. బంకను చెట్లనుండి సేకరించడం, తేనెపట్టుల నుండి తేనెను తీయడంలో చెంచులు నేర్పరులు. వీటి తర్వాత వీరికి ముఖ్యమైనది ఇప్పపువ్వు. దీన్ని ఆహారంలోను, మద్యం తయారీకి వాడుకుంటారు. ఇప్ప గింజలనుండి నూనెను తీస్తారు. వీరికి అడవిలో దొరికే పండ్లు, దుంపలు, జంతువుల మాంసం ముఖ్యమైనవి. వీరు వేట కోసం వాడే పరికరాలు వేటాడే వాటిని బట్టి ఉంటాయి. పిట్టలను వలలతోను బోనులతోను పట్టుకుంటారు. చెక్క పిడిబాణాలు, ఇనుముతో చేసిన సూదిబాణాలు వీరు వేటకు వాడతారు. వీరికి వనమూలికల మీద చాలా పరిజ్ఞానం ఉంది. 200 వరకు వనమూలికలను వీరు గుర్తు పట్టగలరు. వాటిని ఉపయోగించ గలరు. ప్రధానంగా ఈ రకమైన అటవీ ఉత్పత్తులను అమ్ముకొని వీరు ఆదాయాన్ని సమకూర్చు కుంటారు. వీరి ఆర్థిక వ్యవస్థ, జీవనవిధానం రెండు అడవి పైనే ఆధారపడి ఉంటాయి.

C). న్యాయవ్యవస్థ

చెంచులకు కుల పంచాయితీయే అత్యున్నత న్యాయస్థానం. కులపంచాయితీలో ప్రతి గోత్రం నుండి ఒక్కొక్క పెద్దమనిషి సభ్యుడిగా ఉంటాడు. వీరందరికీ పెద్దగా ఉండే వ్యక్తిని రాజు అంటారు. వీరి ఆధ్వర్యంలో తగాదాలకు తీర్పులు వస్తాయి. ఈ తీర్పు ఇరు వర్గాల వారికి శిరోధార్యంగా ఉంటుంది.

d). మత విశ్వాసాలు

నల్లమల అటవీ ప్రాంతంలోని శైవ క్షేత్రాల్లోని శివుడు, కాళికాదేవి, గారెల పోచమ్మ, నాగమ్మ, పాములపుట్ట చెంచుల ఆరాధ్య దైవాలు. చెంచులు శ్రీశైల మల్లికార్జున స్వామిని చెంచు మల్లన్న అని, భ్రమరాంబను బౌరమ్మ అని

41