ఎరుకల నృత్యాలు
కురవంజి నృత్యం:- కురవజాతి దక్షిణ దేశంలో వ్యాపించి ఉన్న ఒక దేశ దిమ్మరి తెగ. వీరు వివిధ ప్రాంతాల్లో వ్యాపించి ఉండడం వల్ల వీరికి భిన్నమైన పేర్లు ఏర్పడినాయి. అత్యంత ప్రాచీన తమిళ కావ్యమైన శిలప్పాధికారంలో 'కురవైక్కూత్తు' అనే పదం కనిపిస్తుంది. కురవై అనేది కురవల నృత్య విశేషమని పలువురు పండితుల అభిప్రాయం. తెలుగు సాహిత్యంలో కూడా పలువురు కవులు ఈ కురవనృత్యాన్ని కురవంజి లేదా కొరవంజి అని ప్రస్తావించారు. కురవంజి అంటే ఎరుక జాతికి చెందిన స్త్రీ. ఈమె శృంగార కావ్యాల్లో నాయికానాయకులకుగాని లేదా ఎవరైనా ముఖ్య పాత్రకు గాని భవిష్యవాణిని తెలిపే పాత్రగా కనిపిస్తుంది. అలాగే ఈ కురవంజి యక్షగానాల్లోను ప్రధాన పాత్రలకు నృత్య రూపంలో వచ్చి సోదిచెప్పే పాత్రగా ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ ప్రత్యేకత వల్ల కురవంజి పాత్ర ప్రవేశం కలిగిన యక్షగానాలకు కొరవంజి యక్షగానాలని పేరు వచ్చింది. యక్షగాన ప్రదర్శనలో అందమైన ఎరుక స్త్రీ, కురవంజి వేషధారణతో, తన ముఖంపై దిష్టి తగల కుండా ఉండడానికి వేయించుకున్న పచ్చబొట్టుతో, జానపద కళారూపంవలె నృత్య ప్రదర్శన చేస్తూ ప్రవేశించి 'సోదె”ను సంగీత రూపంగా వినిపిస్తుంది. ఈ నృత్య ప్రదర్శనలో అందమైన అడుగుల నడకలు, శరీరవిన్యాసాలు కనిపిస్తాయి. కురవంజి తన అడుగుల విన్యాసాలతో నృత్య ప్రదర్శనను ఇంకా సుందరంగా ప్రదర్శించి ఆకట్టుకుంటుంది. ఈ నృత్యరూపంలో ఎలాంటి స్థిరమైన పద్ధతులుకాని, సమయ నిబంధనలుకాని లేకపోవడం వల్ల ఇలాంటి వెసులుబాటు ఉంది. కొందరు ఈ కురవంజి నృత్యాన్ని ఎనిమిది మంది కళాకారులతో బృంద నృత్యంగా కూడా ప్రదర్శిస్తున్నారు. 'పూర్వం ఈ నృత్యరూపాన్ని శైవ సంబంధమైన రూపకాల్లో ప్రదర్శించేవారని మద్రాస్ యూనివర్సిటీకి చెందిన మానవ శాస్త్రవేత్త శ్రీ ఎమ్.డి. రాఘవన్ గారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నృత్యరూపం విష్ణు సంబంధమైన రూపకాలలోనూ ప్రదర్శింప బడుతున్నది.
కురవ నృత్యం:- ఎరుకలు పచ్చబొట్టు పొడవడంలో సిద్ధహస్తులు. కాబట్టి వీరిని "పచ్చకుటీలు” అని కూడా పిలుస్తారు. వీరు పచ్చబొట్టు వేయడంలో నిపుణులు. పచ్చబొట్టులను అందంగా రూపకల్పన చేయడంలో వీరి సృజనాత్మక శక్తి తెలుస్తుంది. ఎన్నో కళాకృతులను సూర్యచంద్రులు, ఇంద్రధనస్సు, తూగుటుయ్యాలలు, రాజ భవనాలు, స్వస్తిక్, ముగ్గులు, దశావతారాలు, నెలవంక, నక్షత్రాలు మొదలైనవాటిని వీరు అందంగా రచించగలరు. వీరు తమ ఇళ్లలోగాని ఇతరుల ఇళ్లల్లో గాని చిన్న పిల్లలకు దృష్టి దోషాలు పోవడానికి పచ్చబొట్లు పొడుస్తారు. ఆ పొడిచే సమయంలో కొరవ నృత్యం చేస్తారు. పచ్చబొట్టు వేయించుకునే వాళ్లకు బాధ తెలియకుండా ఉండడం కోసం ప్రధానంగా ఈ నృత్యం చేస్తారు. పచ్చబొట్ల ఆకృతి తప్పకూడదనే ఉద్దేశంతో కూడా ఈ నృత్యం చేయబడుతుంది. ఎందుకంటే నృత్యం చేసేటప్పుడు ఆలపించే పాటలు దేవతా స్తుతులుగా ఉంటాయి. కురవ నృత్యం విలక్షణమైనది. పర్వదినాల్లో ఈ నృత్యాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. మంగమ్మ దేవతను, నిషానీ దేవతను, ముత్యాలమ్మను ఇలవేల్పులుగా కొలుస్తుంటారు. అలాగే వీరు ప్రకృతి ఆరాధకులు. వీరు ప్రకృతిలోని చెట్టు పుట్టలను పంచభూతాలను దైవాలుగా కొలుస్తారు. ఆయా దేవతలను ఆరాధించే సమయంలో వీరి నృత్యం పూర్తిగా
33