Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వం ఎరుకులు కాన్పు సులభంగా జరగాలని గర్భిణీ స్త్రీలను ఇంటి వాసాలకు వేలాడే గట్టే సంప్రదాయం ఉండేది. అలాంటి ఆటవిక పద్ధతివల్ల స్త్రీలు నరకం చూసే వాళ్ళట. కానీ ప్రస్తుతం అటువంటి పద్ధతులు పూర్తిగా కనుమరుగై పోయాయి. మంత్రసానులు కాన్పు చేస్తారు. ఇప్పటికీ ఆ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎందుకంటే అరణ్యాలలో వుండే వారికి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కారణంగా చెప్పవచ్చు.

వివాహం: ఎరుకల వాళ్ళు మేనరికం సంబంధాలు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వారి వివాహ వ్యవస్థలో “వోలి” సంప్రదాయం ఉంది. వోలి అంటే కన్యకు ఇచ్చే కట్నం. అది ఎవరు ఎక్కువ ఇస్తే వారు అంత గొప్పవారు అని అభిప్రాయం. అందుకని వాలి నిర్ణయం అయితేనే సంబంధం ఖాయం అవుతుంది. ఇల్లిరకం సంప్రదాయం ఎరుకలోను ఉంది. ఎరుకలలో “రూకమాడ” తతంగం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. రూకమాడ అంటే నిశ్చితార్థం. ఇది జరిగింది అంటే సగం పెళ్లి అయినట్లే అని భావిస్తారు. ఒక నల్లగొంగడి పైన ఒకవైపు ఆడపెళ్ళివారు మరొకవైపు మగ పెళ్ళివారు కూర్చుంటారు. మధ్యలో కులపెద్దలు కూర్చుంటారు. కుల పెద్దలకు సారాయిని అందిస్తారు. దీన్ని “పావు” అంటారు. పావు అంటే సారాయి అని అర్థం. ఈ పావును అందించడంలో వధువు తరఫు వాళ్ళు రెండుసేర్లు కొలత పాటిస్తే వరుని తరఫు వాళ్ళు మూడు పేర్లు కొలతను పాటిస్తారు. అంటే అన్ని విధాలా మగపెళ్లి వాళ్ళు అధికులు గా కనపడాలనే ప్రయత్నంలో ఇలా చేస్తారు.

రూకమాడ సమయంలో ఓలి, మేనరికపుహక్కు, జమానత్, నిశ్చయతాంబూలాలు ముఖ్యమైనవి. వీటితో పాటు పెళ్లి ఖర్చులు మగ పెళ్ళివారు భరించాలి. మేనమామ తప్పనిసరిగా కుల పెద్దల సమక్షంలో ఆ వివాహ సంబంధానికి తన నిరభ్యంతరం తెలపాలి. అప్పుడు పిల్ల తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి కొంత డబ్బును తాంబూలం పండ్లతో కలిపి ఇస్తారు. దీన్ని మేనమామ బంధువులందరికీ చూపించి “ఈ పెళ్ళి జరగడం నాకు ఇష్టమే అని చెప్తాడు”. మేనరికం సంబంధం కుదరనప్పుడు ఎరుకలు ఇలా చేయవలసి ఉంటుంది. పిల్ల తరఫున ఒకరు పిల్లవాని తరఫున ఒకరు పెళ్లి పిల్లకు పిల్లవానికి ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పి జమానత్ గా ఉంటారు.

పెళ్లికి ఒకటి రెండు రోజుల ముందు ఇంటి ముందు పందిరి వేస్తారు. తర్వాత పుట్టమన్ను ఆచారం ఉంటుంది. పెళ్లి పెద్దలు బేసి సంఖ్యలో భజంత్రీలతో పుట్టమన్ను కోసం బయలు దేరుతారు. అప్పుడు మేనమామ గడ్డపారతో వెళ్ళటం తప్పనిసరి. పుట్టమన్ను గడ్డపారతో మేనమామ తవ్వితే, మిగిలిన వాళ్ళు గంపలలో తీసుకొనివస్తారు. దాన్ని గుంజల చుట్టూ అరుగుగా వేసి పేడతో అలికి ముగ్గు వేస్తారు. పుట్ట నాగదేవతకు ఆవాసం. మన్ను భూదేవి స్వరూపం. పుట్టమన్ను ఎవరూ తొక్కనిది. ఇలా చేయడం వల్ల ఆయా దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. పందిరి మధ్యలో సూర్యుని రథం ముగ్గు వేస్తారు. వెలుగునిచ్చే సూర్యనారాయణడు పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చి వధూవరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తారు.

వధూవరులకు తల్లిదండ్రులు వస్త్రాలను ఇచ్చిన తర్వాత బంధువులు వారిని తమ ఇళ్లకు బాజాభజంత్రీలతో తీసుకుని పోయి కొత్తబట్టలు ధరింపజేస్తారు. ఇలా చేస్తే తమ ఇంటికి శుభం జరుగుతుందని నమ్ముతారు. పందిట్లో వధువుకు గాజులు తొడుగుతారు. ఆమెతోపాటు పెళ్లికాని పడుచు పిల్లలు కూడా గాజులు తొడిగించుకుంటారు. ఎందుకంటే అలా చేస్తే వాళ్లకు త్వరగా కళ్యాణ ఘడియలు వస్తాయని నమ్ముతారు.

వరునికి ఎదురుకోలు వేడుక ప్రత్యేకమైనది. వరుడితో పాటు బంధువులను ఆహ్వానించి వారికి బిందెలతో బెల్లంనీరు, సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టెలు వధువు తరపు వాళ్ళు ఇస్తారు. బెల్లం నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకొని, సిగరెట్లు, బీడీలు కాల్చుకొని, పెళ్లివారు ఆనందిస్తారు.

31