Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎరుక జాతి పురుషులు పూర్వం గోచి మాత్రమే ధరించేవారు. ప్రస్తుతం వీరు పైన చొక్కాను వేసుకుంటున్నారు.కొందరు గోచికి బదులుగా లుంగీని కూడా కట్టుకుంటున్నారు. వీరు పెద్ద దుప్పటిని భుజం పైన వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది వారికి కూర్చున్నా, పడుకున్నా ఉపయోగపడుతుంది.

ఆభరణాలు:- ఎరుక జాతి పురుషులు చెవి పైభాగాన పోగులను ధరిస్తారు. మోచేతి పైభాగాన కడియాలు పెట్టుకుంటారు. ఎరుక జాతిస్త్రీలు ముక్కుకు రెండువైపులా ముక్కుపుడకలను ధరిస్తారు. ముక్కు మధ్య దూలానికి ముక్కెరను పెట్టుకుంటారు. వీరు చెవులకు పొడవునా రంధ్రాలు కుట్టించుకొని పోగులు ధరిస్తారు. చేతుల నిండా గాజులు వేసుకుంటారు. కాళ్ళకు ఇత్తడి లేదా కంచుతో తయారుచేసిన కడియాలు ధరిస్తారు. చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు. మెడలో పూసల దండలు వేసుకుంటారు. సోది చెప్పే స్త్రీలు పచ్చ పూసలను ధరిస్తారు.

(b). ఆర్థిక పరిస్థితి

సంచార జీవులైన ఎరుకల ఆర్థిక పరిస్థితి ఏ పూటకు ఆ పూట అన్నట్లు ఉంటుంది. మైదానం ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న ఎరుకలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు తమ వృత్తులను, ఇంకా ఇతర పనులను కూడా నిర్వర్తిస్తున్నారు. వీళ్లు తమ జీవనోపాధికి చేసే వ్యాపారాలు చిన్న చిన్నవిగా ఉంటాయి. కాబట్టి ఒక కుటుంబంలోని వారంతా ఒకే చోట ఉంటే వ్యాపారంలో పోటీ ఏర్పడి వ్యాపారాలు సరిగ్గా సాగవని భావించి ఆ కుటుంబంలోని వాళ్లు వేరు వేరు ప్రాంతాలను ఎంచుకుని అక్కడ స్థిరపడి పోతుంటారు. అందువల్ల ఎరుకలగేరి లేదా ఎరుకల వాడలు చిన్నవిగానే ఉంటాయి. ఇది ఒక రకంగా వారి ఆర్థిక సుస్థిరతకు నిదర్శనం. ఎరుకల వృత్తినిబట్టి వాళ్లలో ఎన్నో తెగలు ఏర్పడినాయి. చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ వాళ్లే చేస్తుంటారు. వాళ్లు ప్రకృతిలో ఉచితంగా లభించే వెదురు మొదలైన వస్తువులతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ఎద్దులు, పాములు, కోతులు వంటివాటితో ప్రదర్శనలిచ్చి ప్రజలను ఆకర్షించి డబ్బు సంపాదిస్తారు. అంటే పెట్టుబడి లేకుండా ధనసంపాదన వీరి ప్రత్యేకత.

వ్యవసాయం ఒక గౌరవప్రదమైన వృత్తి. ఎరుకలు పోడు వ్యవసాయం చేస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఆముదాలు పండిస్తారు. ఇవన్నీ వర్షాధారమైనవి కాబట్టి దీనికి తోడు ఎద్దులకు కట్టే పగ్గాలు, గడ్డివాములకు కట్టే తాళ్ళు మొదలైన వ్యవసాయానికి అవసరమైన వస్తువులను కూడా వాళ్లే తయారుచేసుకుంటారు.

కొందరు ఎరుకలు దొంగతనాలు చేస్తుంటారు. ఇళ్ల నిర్మాణానికి, గృహోపకరణాలకు ఉపయోగపడే కలపను అడవుల నుండి తెచ్చి అమ్ముకుంటారు. వీరు అనేక రకాల సారాలను తయారుచేస్తారు. ఇప్పపువ్వు సారా, తుమ్మ బెరడు సారా, నల్ల బెల్లంసారా, వివిధ ఫలాలతో చేసే పండ్ల సారా వాటిలో ప్రసిద్ధమైనవి.

కొందరు ఎరుకలు అడవుల నుండి రకరకాల పండ్లను, ఆకులను సేకరించి అమ్ముకుంటారు. కుంకుడు కాయలు, బంక, చింతపండు, చింతచిగురు, సీతాఫలాలు, రేగుపండ్లు, గునుగుఆకు, అటుకు మామిడిఆకు, చిల్లికూరఆకు, కోడిజుట్టు ఆకు, ఈతపండ్లు, తాటి ముంజలు మొదలైనవి వీరి సేకరణలో ముఖ్యమైనవి.

ఎరుక స్త్రీలు సోది చెప్పి కొంత ధనం, ధాన్యం సంపాదిస్తారు. పురుషులు వేట, వ్యవసాయం, వ్యాపారం లాంటి పనులు చేస్తారు. పిల్లలు పందులను, గాడిదలను ఊరికి దూరంగా తీసుకొని పోయి మేపుకొని వస్తారు. ముసలివాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలను చూసుకుంటూ కుటుంబానికి సహాయ పడతారు. ఈ విధంగా ఎరుకల కుటుంబంలోని అందరూ జీవనోపాధికి కష్టపడుతూనే ఉంటారు.

27