Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్తున్నారు. అడవులు కొండలు, నదీ తీరాలు ఆవాసంగా చేసుకొని జీవించడం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడటం, వేట మద్యపానం అనేవి గిరిజనులందరిలోనూ కనిపించే సాధారణ లక్షణాలు. కాలాంతరంలో గిరిజనులలో వచ్చిన మార్పు పోడు వ్యవసాయం. ఎందుకంటే ఈనాటికి గిరిజనులు జీవితాల్లో కనిపించే గొప్ప ప్రగతి ఏమీ లేదు. అదీ పదహారవ శతాబ్దం నుండి మొదలైనట్లు తెలుగు సాహిత్యం ఆధారంగా తెలుస్తుంది. పూర్వం గిరిజనలు పారుటాకులు (పండిన ఆకులు) వస్త్రాలుగా ధరించే వారిని, గురిగింజ పూసలను ఆభరణాలుగా అలంకరించుకునే వారిని తెలుస్తుంది. ప్రస్తుతం వీరు జనసామాన్య వస్త్రధారణతోను, వెండి ఆభరణాల అలంకరణలతో కనిపిస్తున్నారు. గిరిజనుల లక్షణాలను పరిశీలించినప్పుడు ఆతిథ్యం అనే సుగుణం మెండుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది వారి సంస్కృతిలో ఒక భాగంగా చెప్పవచ్చు. ఇందుకు సాహిత్యాధారాలు కూడా కనిపిస్తున్నాయి. గిరిజనులు నమ్మకద్రోహం చేసిన వారి పట్ల వారి వైఖరి ప్రాణాంతకంగా ఉంటుందని కూడా సాహిత్యాధారాన్నిబట్టి తెలుస్తుంది.

సంగీత నృత్యాలు, పండుగలు గిరిజనుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇవి ఎల్లప్పుడూ సామూహికంగానే ప్రదర్శింప బడతాయి. అంతేగాక ఇవి ఆయా తెగల ప్రత్యేకతను సూచించేవిగా ఉంటాయి. గిరిజనుల సంగీత వాద్యాలు ఎక్కువగా చర్మ వాద్యాలు గానే ఉంటాయి. దానికి కారణం వారికి వేటలో లభించిన జంతు చర్మాలను వినియోగించు కోవడమేనని చెప్పవచ్చు. పిల్లనగ్రోవి, తప్పెట, డోలు వంటి వాద్యాలను సాధారణంగా గిరిజనులందరూ ఉపయోగిస్తారు. ఇవేగాక మిగిలిన వాద్యాలు ఆయా జాతుల ప్రత్యేకతను తెలిపేవిగా ఉన్నాయి.

గిరిజన తెగలలో భేదాన్ని తెలిపే అంశాల్లో మొదటిది మత విశ్వాసం. రెండవది సంగీత నృత్య రీతులు. మూడవది సంగీత వాద్యాలు. ఇక వారి జీవన విధానం సాంఘిక ఆర్థిక న్యాయవ్యవస్థలు, సంగీత నృత్య వాద్యాల ప్రదర్శన సందర్భం, వాటి భావం అనేవి తెగల మధ్య సారూపాన్ని తెలిపే అంశాలు. పచ్చబొట్టు వేయించుకోవటం (టాటూ) గిరిజనులందరిలోనూ ఉన్న ఆచారం. ఇది నేడు నాగరికులలో 'ఫ్యాషన్' గా మారింది.

21