అప్పుడు యముడు వచ్చి “జీవుడు తాను చేసిన కర్మల వలన సుఖదుఃఖాలు పొందుతాడు. నా తప్పు లేదు”అని చెప్పి కిరాతుని ధర్మసందేహం తీర్చాడు. ఆ తల్లి గౌతమి చెప్పిన మాట, యముడు చెప్పిన మాట ఒకటే కావడం వల్ల ఆ కిరాతునికి జ్ఞానోదయమై పామును విడిచిపెట్టాడు. అంతవరకు బాలునికి కీడు చేసిన పామును చంపడమే ధర్మం అని కిరాతుడు భావించాడు. ఈ కిరాతుని పేరు అర్జునుడు. అంటే స్వచ్ఛమైన మనసుకలవాడని అర్థం. చివరికి కిరాతుడు నిజంగానే తన ఆత్మ జ్ఞానంతో సార్థకనామధేయుడైనాడు. కిరాతుడైన ఆటవికునికి జ్ఞానోదయం కావడం ఈ కథలోని విశేషం. ఇది మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో ఉన్న కథ.
15ధర్మరాజు అశ్వమేధయాగం చేసే సందర్భంలో యజ్ఞాశ్వం వెంట వెళ్లిన అర్జునుడు ఏకలవ్యుని కుమారుడు పరిపాలించే నిషాద దేశానికి వెళ్ళాడు. యుద్ధంలో నిషాదరాజు అర్జునుని చేతిలో పరాజితుడైనాడు. అయినా నిషాద రాజు అర్జునుని పూజించాడు. ఈ సందర్భంలో ఏకలవ్యుని వలెనే అతని కుమారుడు కూడా ధైర్యం, ఆత్మగౌరవం కలిగిన యోధుడు, వినయ సంపన్నుడు అని తెలుస్తుంది.
16మహాభారత యుద్ధానంతరం బలరాముడు నిర్యాణం చెందాడు. తర్వాత అర్జునుడు బలరాముని అంత్య క్రియలు నిర్వహించి ద్వారకానగరంలోని అంతఃపుర వాసులందరినీ తీసుకొని బయలుదేరాడు. మార్గమధ్యంలో కిరాతులు నిర్భయంగా అర్జునునిపై దాడి చేశారు. కానీ అర్జునుడు ఏమీ చేయలేక పోయాడు. ఆ కిరాతులు ధనాన్ని ఆభరణాలను దోచుకుని పోయారు. ఈ సందర్భాన్ని బట్టి కిరాతులు క్రూరులే కాక దోపిడీ దొంగలు అని కూడ తెలుస్తుంది.
17శ్రీకృష్ణ నిర్యాణం వార్త తెలిసి అర్జునుడు అతని పార్థివదేహానికై వెతుకుతున్న సమయంలో, ఆరచిత్తుడైన ఒక బోయవాడు శ్రీకృష్ణుని తాను ఒకచోట అడవిలో చూసాననిచెప్పి, అడవిలో దారి చూపి అక్కడకు తీసుకుని పోయాడు. అడవిలో అన్ని ప్రదేశాలు తిరిగే ఆటవికుడు కాబట్టి ఎరుకలవాడు అర్జునునికి శ్రీకృష్ణుని జాడ చెప్పి, అతని పార్థివ దేహాన్ని చూపి సహాయం చేయగలిగాడు.
18ఆంధ్ర మహాభాగవతంలో కూడా శ్రీకృష్ణుని నిర్యాణ సందర్భం పేర్కొనబడింది. శ్రీకృష్ణుడు ఒక పొదరింటి చాటున విశ్రమించి కాలు మీద కాలు వేసుకుని విలాసంగా కాలు కదిలిస్తూ ఉండగా వేట కొరకు వచ్చిన ఒక లుబ్ధుడు అది చూచి కదులుతున్న శ్రీకృష్ణుని పాదం జింక చెవిగా భావించి బాణంతో కొట్టాడు
ఆ దెబ్బకు కృష్ణ పరమాత్మ హాహాకారం చేయగా బోయవాడు పరిగెత్తివచ్చి అక్కడ కృష్ణుని చూచి బాధపడి ఏడుస్తుండగా వానిని శ్రీకృష్ణుడు ఓదార్చి పూర్వ జన్మ కర్మలు ఎంత వారికైనా అనుభవించక తప్పదు ఇందులో నీ తప్పేమీ లేదు. నీవు తప్పు చేసినట్టుగా భావించవద్దని చెప్పాడు.
సంస్కృతంలో వాల్మీకి రచించిన రామాయణానికి భారతదేశంలోని ఇతరభాషల్లో అనేకమైన రామాయణాలు రచింప బడినాయి. తెలుగు భాషలో భాస్కరకవి, రఘునాథరాజు, కవయిత్రి మొల్ల రచించిన రామాయణాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఈరామాయణాలు ఒకదానికొకటి చిన్న చిన్న విషయాల్లో కొంత భేదాలు కలిగి ఉన్నాయి. వీటిలో 16వ శతాబ్దంలో మొల్ల రచించిన రామాయణం పాత్ర చిత్రణలో విశిష్టమైనదిగా ప్రసిద్ధి. ఈ రామాయణంలో గుహుడు, శబరి అనే గిరిజనపాత్రలు కనిపిస్తాయి.
19గుహుడు సీతారామ లక్ష్మణులకు ఆశ్రయమిచ్చి ఆదరించి వారిని తన పడవలో గంగానదిని దాటించాడు. అది అతని అతిథి మర్యాదకు నిదర్శనం. ఈనాటికీ గిరిజనులలో ఇటువంటి అతిథి మర్యాదను మనం చూడగలం.
14