Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కిరాతుడని ప్రయోగించి అతని క్రూరత్వాన్ని కూడా ప్రకటించడం జరిగింది. కిరాత శబ్దం దుర్మార్గుడు అనే అర్థంలో వాడటం వ్యవహారంలో ఉంది. ఇక్కడ పాముని చంపడం అనే సాహసం, దమయంతికి ఆతిథ్యం ఇవ్వడం అనే మంచితనం అనేవి ఆటవికుల సాధారణ లక్షణాలు. కిరాతుడు దమయంతిపై మన్మథ వికారం పొందడం అనేది పురుష జాతి స్వభావ లక్షణం. అందుకు అతడు శిక్షను అనుభవించాడు.

10పాండవులు అరణ్యవాసం చేస్తూ గంధమాదన పర్వతానికి పోవాలని బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో సుబాహుడనే పుళిందరాజు పరిపాలించే నగరానికి చేరుకున్నారు. ఆ పుళిందరాజు అనేకమైన కిరాతభటులను కలిగి ఉన్నవాడు. అతడు పాండవులను పూజించి అతిథి మర్యాదలు చేశాడు. ఆతిథ్యం అనే ఆటవికుల సహజ లక్షణం ఈ సందర్భంలో ప్రస్తావించబడింది.

11మహాభారతంలో ధర్మవ్యాధుని వృత్తాంతం చాలా ప్రసిద్ధమైనది. ధర్మవ్యాధుడు ఎరుకలవాడు. ఇతడు మాంసాన్ని విక్రయించి జీవించేవాడు. అయినా ధర్మాధర్మ విచక్షణ కలవాడు. భారతంలో యయాతి మహారాజు చరిత్రలో ఆటవికులు ధర్మాధర్మ జ్ఞాన శూన్యులుగా పేర్కొనబడినారు. కానీ ధర్మవ్యాధుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడు శాపవశాన ఎరుకగా జన్మించి పూర్వ జన్మ జ్ఞానం కలిగినవాడైనాడు. కాబట్టి ధర్మ విచక్షణ కలిగిన అతడు ధర్మవ్యాధుడిగా సార్థక నామధేయుడయ్యాడు. ఈ సందర్భంలో ఆటవికుల వృత్తి ధర్మం సూచించబడింది.

12మహాభారతం ద్రోణ పర్వంలో గిరిజనుల ప్రస్తావన కనిపిస్తుంది. అందులో పాండవుల పక్షాన సాత్యకి యుద్ధం చేస్తూ కౌరవ సేనలలోని కిరాత, శక, బర్బర, పారద, యవన, సేనలను నాశనం చేసినట్లు పేర్కొనబడి ఉంది. అంటే గిరిజనులు తమ పాలకులైన రాజులు చేసే యుద్ధంలో పాల్గొనేవారని ఈ సందర్భంగా తెలుస్తుంది.

13మహాభారతంలోని శాంతి పర్వంలో బోయవాడు -పావురం కథ ఉంది. బోయవాడు వేటకు పోయి వర్షంలో చిక్కుకొని చలికి వణుకుతూ ఒక చెట్టు దగ్గరకు చేరాడు. ఆ చెట్టు తొర్రలో రెండు పావురాలు ఉన్నాయి. ఆడ పావురం బోయవానిని చూసి ఇతడు మన అతిథి. ఇతనిని మనం ఆదరించి ఆదుకోవాలి అన్నది. అందుకు మగపావురం బోయవాని చలిని పోగొట్టడానికి పుల్లలు చేర్చి పక్కనే ఉన్న పల్లెకు పోయి నిప్పు తెచ్చి మంట వేసింది. చలి తీరిన తర్వాత బోయవాడు ఆకలిగా ఉందని చెప్పగానే పావురం మంటలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. అప్పుడు నిశ్చేష్టుడైన బోయవానిలో పరివర్తన మొదలైంది. ఇక పిట్టలను చంపకూడదని నిర్ణయం తీసుకున్నాడు. తన వలలో ఉన్న పిట్టలన్నిటిని విడిచిపెట్టాడు. ఈ కథలో బోయవాని హృదయ పరివర్తన ఆవిష్కృతమైంది. ఇలాంటి పరివర్తన ఆటవికులలో అరుదైన విషయమని చెప్పవచ్చు.

14గౌతమి అనే బ్రాహ్మణ స్త్రీ కోపతాపాలను అదుపులో పెట్టుకున్న పుణ్యాత్మురాలు. పాము కరిచి ఆమె కొడుకు చనిపోయాడు. కొడుకు చావును చూసి దుఃఖిస్తున్న తల్లి దగ్గరకు ఒక కిరాతుడు ఆ బాలుని కరిచిన పామును తాడుతో కట్టి తెచ్చి "తల్లీ! ఇది దుష్ట సర్పం. దీని తలను కర్రతో చితకొట్టేదా? లేదా కత్తితో దీన్ని నరికేదా? ఏం చేయమంటావో చెప్పు" అని అడిగాడు. అందుకా తల్లి "ఈ పామును విడిచిపెట్టు" అన్నది. దానికి కిరాతుడు “ఈ పసివాని ప్రాణం తీసిన పాము ఇది. దీని ప్రాణం తీస్తాను” అన్నాడు. ఆమె అప్పుడు “అన్నా! ఈ పామును చంపితే నా కొడుకు బ్రతుకుతాడా? అంతేగాక పూర్వజన్మ కర్మానుసారం గానే ఆపదలు సంభవిస్తాయి. కనుక ఈ పామును విడిచి పెట్టు" అన్నది. కానీ బోయవాడు వినలేదు. అప్పుడు పాము " నేను మృత్యు దేవత చెప్తే చేశాను నా తప్పులేదు అని చెప్పింది". అప్పుడు మృత్యువు వచ్చి “నా తప్పు కూడా లేదు. కాలుని ఆదేశానుసారంగా నేను చేశాను" అన్నది.

13