4ఆంధ్రమహాభారతంలో ఏకలవ్యుని కథ ప్రసిద్ధమైనది. ఏకలవ్యుడు హిరణ్యధన్వుడు అనే ఎరుక రాజు కుమారుడు. ఇతడు ద్రోణాచార్యుని తన గురువుగా భావించి, అతని మట్టిబొమ్మను పెట్టుకుని, విలువిద్యను నేర్చుకున్నాడు. అది తెలుసుకొని ద్రోణాచార్యుడు అతని బొటనవేలిని గురుదక్షిణగా కోరాడు. ఏకలవ్యుడు తన బొటన వేలిని కోసి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా సమర్పించాడు. ఇందులో ఒక ఆటవికుని గురుభక్తి, త్యాగశీలత ఆవిష్కృతమైంది.
5ఆంధ్ర మహాభారతంలో గిరిజనుల గురించి మరొక ప్రస్తావన విశ్వామిత్రుని కథలో కనిపిస్తుంది. వశిష్టుని ఆశ్రమంలో నందినీధేనువు మహిమను చూసి దాన్ని అపహరించాలని విశ్వామిత్రుడు ప్రయత్నించాడు. అప్పుడు నందినీధేనువు తన శరీరం నుండి వివిధ జాతుల మానవులను సృష్టించింది. అందులో శబరులు, పుళిందులు ఉన్నారు. వారు భీకరంగా యుద్ధం చేసి విశ్వామిత్రుని సైన్యాన్ని మూడు యోజనాల దూరం తరిమికొట్టారు. ఇక్కడ ఆటవికులు యోధులుగా చిత్రింపబడినారు.
6ధర్మరాజు రాజసూయ యాగం చేసే సందర్భంలో అర్జునుడు ఉత్తర దిగ్విజయ యాత్రకు బయలుదేరి పుళిందరాజును ఓడించాడని, పర్వతేయుల గర్వం అణిచాడని, శబరులను, వనచరులైన దస్యులను వశం చేసుకున్నాడనే ప్రస్తావన కనిపిస్తుంది. 7అలాగే సహదేవుడు మాహిష్మతీ నగరానికి అధిపతియైన నీలుని వంశానికి చెందిన నిషాదరాజును జయించాడు. ఈ నిషాదరాజు ఆగ్నేయ దిక్కున ఉన్న తన రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వస్తే వారిని దహించివేసే విధంగా అగ్నిదేవునివల్ల వరం పొందాడు. అలాంటి నగరాన్ని జయించి సహదేవుడు ఆ నిషాదరాజు వల్ల కానుకలు పొంది దక్షిణ దిక్కుగా బయలుదేరి సాగరద్వీపవాసులైన నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ, కర్ణప్రావరకులనే నరరూప రాజక్షసయోధులను జయించాడనే సందర్భాల్లో గిరిజనుల ప్రస్తావనలు సభా పర్వంలో కనిపిస్తున్నాయి.
8అరణ్యపర్వంలో గిరిజనుల ప్రస్తావన మరొకటి కనిపిస్తుంది. అందులో తపస్సు చేసుకుంటున్న అర్జునుని వద్దకు పరమేశ్వరుడు ఎరుకరాజుగాను, పార్వతీదేవి ఆటవిక స్త్రీగాను మారురూపాలు ధరించి వచ్చారని, భూతగణాలు కురచచేతులు, మిడిగుడ్లు, మొరటురూపాలతో వచ్చారనే సందర్భం కనిపిస్తుంది. ఇందులో ఆటవికుల రూపురేఖలు వర్ణించబడడం విశేషం. ఎరుకరాజు రూపంలో వచ్చింది శివుడేనని అర్జునుడు గుర్తించినప్పుడు “ఎరుక” అనే పదం సాభిప్రాయంగా ప్రయోగించబడింది. ఎరుక అంటే తెలుసుకొనుట అని తెలుగులో అర్థం. ఎరుకజాతివారు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగలరని ప్రతీతి. అందువల్ల వారు “సోది" చెప్పడం అనేదాన్ని కులవృత్తిగా స్వీకరించారు. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఎరుకరూపు దాల్చడం అనే విశిష్టత వల్ల వారికి అలాంటి జ్ఞానం లభించిందని భావిస్తారు.
9నలమహారాజు జూదంలో రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలైనాడు. అడవిలో తనతో పాటు తన భార్య దమయంతి కష్టాలు పడటం చూడలేక ఆమెను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు అడవిలో దమయంతిని ఒక కొండచిలువ పట్టుకున్నది. ఆమె ఏడుపు విని ఒక ఎరుకలవాడు వచ్చి, తన చురకత్తితో కొండచిలువను చంపి, ఆమెను కాపాడి, ఆమెను సేద తీర్చి, అడవిలో దొరికే మంచి పండ్లతో ఆతిథ్యమిచ్చి, తీయగా మాట్లాడి ఆమె సమాచారం అంతా తెలుసుకున్నాడు. కానీ ఆమె అందచందాలను చూసి మన్మథ బాధ పీడితుడై తన కోరికను ఆమెకు తెలిపాడు. అప్పుడు ఆమె కోపంతో ఈ కిరాతుడు ఇప్పుడే చనిపోవాలని శపించింది. వాడు వెంటనే క్రిందపడి మరణించాడు. ఆమె పతివ్రత అని ఎరుగని ఎరుకడని ఇక్కడ కూడా ఎరుక అనే పదం సాభిప్రాయంగా అభివర్ణించడం జరిగింది. ఈ సందర్భంలో
12